Shami-Akram: సేమ్ ప్లేస్‌మెంట్.. ఒకటే వ్యత్యాసం.. షమీ బౌలింగ్‌ అందుకే కష్టం: వసీమ్‌ అక్రమ్‌

భారత పేసర్‌ షమీ (Shami) బౌలింగ్‌పై పాకిస్థాన్‌ క్రికెట్ దిగ్గజం వసీమ్‌ అక్రమ్‌ ప్రశంసలు కురిపించాడు. ఇలాంటి బౌలింగ్‌ దాడిని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు చాలా కష్టమని వ్యాఖ్యానించాడు.

Published : 10 Nov 2023 02:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన భారత స్టార్‌ పేసర్‌ మహమ్మద్ షమీ (Shami) 16 వికెట్లు పడగొట్టాడు. అందులోనూ రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టించాడు. ఈ క్రమంలో షమీ బౌలింగ్‌పై పాక్‌ పేస్‌ దిగ్గజం వసీమ్‌ అక్రమ్‌ ప్రశంసలు కురిపించాడు. వికెట్‌కు రెండువైపులా స్వింగ్‌ చేయడం.. పిచ్‌ పరిస్థితులను సంపూర్ణంగా వినియోగించుకోవడం షమీ స్పెషాలిటీ అని అక్రమ్‌ వ్యాఖ్యానించాడు.

‘‘బౌలర్‌గా అత్యుత్తమమం అనే ఆత్మవిశ్వాసం వస్తే అతడి ప్రదర్శన మరింత నాణ్యంగా ఉంటుంది. ఇప్పుడీ వరల్డ్‌ కప్‌లో భారత పేసర్లు అదే స్థాయిలో ఉన్నారు. గత కొన్నేళ్లుగా వారు పడిన శ్రమకు ఇవాళ ఫలితం దక్కతోంది. మరీ ముఖ్యంగా షమీ వేసిన ప్రతి బంతి వికెట్‌ తీసేలా ఉంది. సీమ్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తించాడు. బంతిని ఎటుపడితే అటు కాకుండా వికెట్లను లక్ష్యంగా చేసుకుని పిచ్‌పై బలంగా వేయడం వల్ల బ్యాటర్లకు కష్టంగా మారుతోంది. 

ఇంగ్లాండ్‌ బ్యాటర్ బెన్‌స్టోక్స్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన విధానం అద్భుతం. వరుసగా ఔట్‌ స్వింగర్లతో ఇబ్బంది పెట్టి ఒక్కసారి ఇన్‌స్వింగర్‌తో క్లీన్‌బౌల్డ్‌ చేసేశాడు. షమీ వేసిన ఆ బంతికి బెన్‌ దగ్గర సమాధానమే లేదు. అరౌండ్‌ ది వికెట్‌ తీసుకుని లెంగ్త్‌కు కట్టుబడి బంతిని సీమ్‌ చేశాడు. అంతకుముందు ఐదు బంతులకు.. వికెట్‌ పడిన బంతికి లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో మార్పే లేదు. కానీ ఒకే పాయింట్‌ నుంచి లోపలికి.. బయటకు బంతిని స్వింగ్‌ చేసిన విధానం అనిర్వచనీయం. అందుకే, అతడి బౌలింగ్‌ అంత కష్టంగా మారింది’’ అని వసీమ్‌ అక్రమ్‌ వెల్లడించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని