Updated : 19/11/2020 18:34 IST

చూశారా... ‘సోషల్‌’లో మాయమైపోతున్నాయ్‌

ఇంటర్నెట్ డెస్క్‌: కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఏర్పడితే సర్ది చెప్పేటప్పుడు ‘పట్టు విడుపు ఉండాలి.. ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోండి’ అని పెద్దవాళ్లు  చెబుతుంటారు. గతంలో జరిగిన వాటిని మర్చిపోయి మునుపటిలా కలిసుండమని అలా చేస్తుంటారు. సరిగ్గా ఇదే సూత్రాన్ని ప్రస్తుతం సోషల్ మీడియా కంపెనీలు అమలు చేస్తున్నాయి. ఎలా అంటారా..? గతంలో మనం సామాజిక మాధ్యమాల్లో పంపే మెసేజ్‌లు ఎన్ని రోజులైనా డిలీట్ కాకుండా అలానే ఉండేవి. మనకు కావాల్సినప్పుడు వాటిని తిరిగి చూసుకోవచ్చు. అయితే వాటిలో కొన్ని మెసేజ్‌లు మనకు ఆనందానిస్తే.. మరి కొన్ని బాధను మిగులుస్తాయి. ఒక రకంగా ఇవి జరిగిన సంఘటనను పదే పదే గుర్తుచేసి బాధకు గురిచేస్తుంటాయి.

అందుకే సోషల్ మీడియా కంపెనీలు డిస్‌అపియరింగ్ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నాయి. ఇందులో మనం పంపే మెసేజ్‌లు కొంత కాలం తర్వాత వాటంతటవే డిలీట్ అయిపోతాయి. దాని వల్ల వ్యక్తులు లేదా గ్రూపుల మధ్య జరిగిన సంభాషణలు ఎక్కువ రోజుల పాటు గుర్తుంచుకొనే అవకాశం ఉండదని సోషల్ మీడియా కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ ఫీచర్‌ను ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా చిన్న చిన్న మార్పులతో తమకు నచ్చిన పేరుతో తీసుకొస్తున్నాయి. పేరేదైనా వాటి వెనక ఉన్న ఉద్దేశం మాత్రం ఒక్కటే. మరి ఈ ఫీచర్‌ ఏయే యాప్‌లో ఏవిధంగా పనిచేస్తుంది? వాటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటనేది ఒక్కసారి చూద్దాం.


వాట్సాప్‌ (WhatsApp)

ఇటీవలే వాట్సాప్‌ డిస్‌అపియరింగ్ పేరుతో కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఇందులో యూజర్స్‌ పంపే మెసేజ్‌లు ఏడు రోజుల తర్వాత వాటంతటవే డిలీట్ అయిపోతాయి. దీన్ని ఉపయోగించాలనుకునే వారు కాంటాక్ట్ నేమ్‌పై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే డిస్‌అపియరింగ్ మెసేజెస్ అనే ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి ఆన్‌ చేస్తే ఫీచర్‌ యాక్టివేట్ అవుతుంది. ఒక వేళ మీరు వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. అయితే మీరు డిస్‌అపియరింగ్ యాక్టివేట్ చేసుకుని మెసేజ్‌ పంపిన తర్వాత అవతలి వారు వాట్సాప్ ఓపెన్‌ చేయకుంటే ఏడు రోజుల తర్వాత మెసేజ్‌ డిలీట్ అయినా నోటిఫికేషన్‌లో కనిపిస్తుంది. అలానే ఏడురోజులలోపు ఛాట్ బ్యాకప్ చేసినా మెసేజ్ మళ్లీ పొందొచ్చు. 


ఇన్‌స్టాగ్రాం (Instagram)

ఇన్‌స్టాగ్రాం కూడా కొద్దిరోజుల క్రితం వానిష్‌ మోడ్ పేరుతో డిస్‌అపియరింగ్ మెసేజ్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఫీచర్ తమ ఇన్‌స్టాగ్రాం ఖాతాను ఫేస్‌బుక్ మెసెంజర్‌తో కలపాలనుకుంటున్న వారికి మాత్రమేనని తెలిపింది. ఇప్పటికే కొంత మంది యూజర్స్‌కి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. వానిష్ మోడ్ కావాలనుకునేవారు తాము ఛాట్ చేస్తున్న స్క్రీన్‌ని పైకి స్వైప్‌ చేస్తే వానిష్‌ మోడ్ ఆన్‌ అవుతుంది. అందులో మీరు ఛాట్ చేసి బయటికి వచ్చిన తర్వాత ఆ ఛాట్ మొత్తం ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతుంది. వానిష్ మోడ్‌లో మీరు పంపిన మెసేజ్‌లను అవతలి వ్యక్తులు స్క్రీన్ షాట్ తీసినా మీకు అలర్ట్ మెసేజ్‌ వస్తుంది.


ట్విటర్‌ (Twitter)

ట్విటర్‌ కూడా ఫ్లీట్ పేరుతో డిస్‌అపియరింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇందులో మీరు ట్వీట్ చేసిన టెక్ట్స్‌, ఫొటో లేదా వీడియో 24 గంట్లలో దానంతటవే డిలీట్ అయిపోతాయి. పరీక్షల్లో భాగంగా ఎక్కువ మంది యూజర్స్‌ సాధారణ ట్విటర్‌ కంటే ఫ్లీట్‌ ఉపయోగించేందుకే ఇష్టపడుతున్నట్లు గుర్తించామని ట్విటర్‌ తెలిపింది. మొబైల్‌లో ట్విటర్‌ పై భాగంలో మీ టైమ్‌లైన్‌పై క్లిక్ చేస్తే ఫ్లీట్ ఫీచర్‌ ఓపెన్ అవుతుంది. అందులో మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్న వాటిని పోస్ట్‌ చేసి ఫ్లీట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆ ట్వీట్ 24 గంటల తర్వాత ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతుంది. అయితే మీరు చేసిన ట్వీట్‌ని ఎవరెవరు చూసారనేది మీకు తెలుస్తుంది. అలానే ట్వీట్‌కి లైక్‌, కామెంట్, షేర్ ఫీచర్స్‌ ఉండవు.   


టెలిగ్రాం (Telegram)

మిగతా వాటితో పోలిస్తే టెలిగ్రాంలో ఈ డిస్‌అపియరింగ్ కాస్త భిన్నం. ఎందుకంటే ఇందులో మనం పంపే మెసేజ్‌లకు టైం లిమిట్ సెట్ చేసి పంపొచ్చు. దాని వల్ల అవతలి వ్యక్తి వాటిని చూసిన తర్వాత మీరు పెట్టిన టైం లిమిట్ లోపల మెసేజ్‌లు డిలీట్ అయిపోతాయి. ఈ ఫీచర్ సీక్రెట్ ఛాట్‌ ద్వారా మెసేజ్‌లు పంపేవారికి మాత్రమే అందుబాటులో ఉంది. ముందుగా మీరు ఎవరితో ఛాట్ చేయాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్ సెలెక్ట్ చేయాలి. తర్వాత వారి పేరు మీద  క్లిక్‌ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో మోర్‌ క్లిక్ చేస్తే స్టార్ట్ సీక్రెట్ ఛాట్ ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే సీక్రెట్ ఛాట్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు టెక్ట్స్‌, ఫొటో లేదా వీడియో అటాచ్‌ చేసి టైం లిమిట్ సెట్ చేసి పంపొచ్చు. అవతలి వ్యక్తులు మీ మెసేజ్ చూసిన వెంటనే మీరు పెట్టిన టైం లిమిట్ లోపల అవి డిలీట్ అయిపోతాయి. అయితే ఈ ఫీచర్ కేవలం టెలిగ్రాం  మొబైల్ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది.


ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ (Facebook Messenger)

ఫేస్‌బుక్ మెసేంజర్‌లో ఎప్పటినుంచో సీక్రెట్ కన్వర్‌జేషన్స్‌ పేరుతో డిస్‌అపియరింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. మెసేంజర్ ఓపెన్ చేసి అందులో న్యూ మెసేజ్‌పై క్లిక్ చేస్తే మీ మెసేంజర్‌ కాంటాక్ట్ జాబితాతో పాటు కుడివైపు పైభాగంలో సీక్రెట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు టైం సెట్ చేసి మెసేజ్‌ పంపొచ్చు. అవతలి వ్యక్తి మీరు పంపిన మెసేజ్‌ చూశాక మీరు సెట్ చేసిన టైం లిమిట్‌ తర్వాత సందేశాలు వాటంతటవే డిలీట్ అయిపోతాయి. దీనితో పాటు మెసేంజర్‌లో కొత్తగా వానిష్‌ మోడ్‌ను తీసుకొస్తున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. అయితే ఈ ఫీచర్ పైన పేర్కొన్నట్లు ఇన్‌స్టాగ్రాం, మెసేంజర్ రెండు ఖాతాలను కలిపిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని పేస్‌బుక్‌ తెలిపింది.


స్నాప్‌ఛాట్ (Snapchat)

స్నాప్‌ఛాట్‌లో మొదటి నుంచి ఈ డిస్‌అపియరింగ్ ఫీచర్ ఉంది. ఇందులో మీరు పంపే టెక్ట్స్‌, ఫొటో లేదా వీడియోలు అవతలి వ్యక్తులు చూసిన వెంటనే వాటంతటవే డిలీట్ అయిపోతాయి. అయితే మీరు పంపిన వాటిని అవతలి వారు టెక్ట్స్‌ని స్క్రీన్‌షాట్ తీసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఫొటోలు, వీడియోలను వాటిపై లాంగ్‌ప్రెస్‌ చేసి సేవ్‌ చేసుకునే సదుపాయం ఉంది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని