Egg - Chicken: గుడ్డు ముందా? కోడి ముందా?

గుడ్డు నుంచి కోడిపిల్ల పుట్టిందా? కోడి నుంచి గుడ్డు వచ్చిందా? ఏది ముందు? మొదటి నుంచీ ఆసక్తి గొలుపుతున్న ప్రశ్నే. కోడి లేకపోతే గుడ్డు ఎలా వస్తుంది? గుడ్డు లేకపోతే కోడి ఎలా పుడుతుంది?

Updated : 22 Feb 2023 09:45 IST

గుడ్డు నుంచి కోడిపిల్ల పుట్టిందా? కోడి నుంచి గుడ్డు వచ్చిందా? ఏది ముందు? మొదటి నుంచీ ఆసక్తి గొలుపుతున్న ప్రశ్నే. కోడి లేకపోతే గుడ్డు ఎలా వస్తుంది? గుడ్డు లేకపోతే కోడి ఎలా పుడుతుంది? నిజంగా ఇది విచిత్రమైన ప్రశ్నే. దీనికి సమాధానం చెప్పటం మనకు కష్టమే. కానీ జీవశాస్త్రవేత్తలకు సులువే. కాకపోతే ఎలాంటి గుడ్డు అనే దాన్ని బట్టి దీనికి సమాధానం ఆధారపడి ఉంటుంది.

గుడ్డే ముందు! చాలామంది జీవ శాస్త్రవేత్తలు ముక్తకంఠంతో చెప్పే మాట ఇదే. అతి ప్రాథమిక స్థాయిలో గుడ్లు కేవలం స్త్రీ లింగ కణాలే మరి. కోట్లాది ఏళ్ల క్రితమే ఇవి పుట్టుకొచ్చాయి. లైంగికంగా పునరుత్పత్తి చేసుకునే జీవులన్నీ గుడ్లు (ప్రత్యేకమైన స్త్రీ లింగ కణాలు) పెడతాయి. అయితే ఈ లింగ భేదం ఎప్పుడు ఏర్పడిందన్నది కచ్చితంగా తెలియదు. సుమారు 200 కోట్ల ఏళ్ల క్రితం ఇది ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. అంత క్రితం కాకపోయినా కచ్చితంగా 100 కోట్ల ఏళ్ల క్రితమైనా ఏర్పడి ఉండొచ్చు. నేల మీద పడినా పగలకుండా కాపాడే గట్టి పొరతో కూడిన గుడ్లు (ఆమ్నియోటిక్‌ ఎగ్స్‌) సకశేరుకాల పరిణామంలో గొప్ప మేలి మలుపుగా నిలిచాయి. నీటి నుంచి చాలా చాలా దూరం సకశేరుకాలు విస్తరించటానికివి అవకాశం కల్పించాయి. పోషకాలతో నిండిన పచ్చసొనతో గట్టి పెంకు గల గుడ్లు ఏర్పడటానికి ముందు సకశేరుకాలు పునరుత్పత్తి కోసం నీటి వనరుల మీదే ఆధార పడుతుండేవి. ఇప్పటికీ చాలా ఉభయచరాలు జిగురుగా ఉండే తమ గుడ్లు తేమగా ఉండటానికి నీటిని వాడుకోవటమే దీనికి నిదర్శనం.

వెంట్రుకంత పెంకే!

కార్బోనిఫెరస్‌, పర్మియన్‌, ట్రయాసిక్‌ యుగాల్లో నేల మీద నివసించే చాలా సకశేరుకాలు ఆమ్నియోటిక్‌ గుడ్లు పెడుతుండేవి. వీటిల్లో ప్రధానమైనవి.. బాగా తెలిసినవి డైనోసార్లే. సుమారు 20 కోట్ల ఏళ్ల క్రితం డైనోసార్లు పెట్టిన గుడ్ల మీద శాస్త్రవేత్తలు పెద్ద అధ్యయనమే నిర్వహించారు. వీటి పైపొర చాలా పలుచగా.. కేవలం 100 మైక్రాన్ల మందంతోనే (వెంట్రుకంత) ఉన్నట్టు గుర్తించారు. అయితే ఆకారాన్ని బట్టి తొలి డైనోసార్ల గుడ్లు అరటితొక్క మాదిరిగా మృదువుగా కాకుండా పింగాణీలా గట్టిగా ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకూ మనకు తెలిసిన అతి పురాతన గుడ్లు ఇవే. వీటి పెంకు చాలా పలుచగా ఉండటం వల్లనే తొలి గుడ్ల శిలాజాలు దొరకలేదని అనుకుంటున్నారు. గుడ్డు నేల మీద ఉంటే మట్టిలోని ఆమ్ల ప్రభావంతో నెమ్మదిగా పెంకు కరుగుతూ వస్తుంది. అందువల్ల ఎక్కువకాలం ఉండదు. తొలి డైనోసార్లు గుడ్లు మృదువైన పొరతో కూడుకొని ఉండేవన్నది మరో భావన. శిలాజాలుగా మారకపోవటానికి ఇదొక కారణం కావొచ్చని 2020లో నిర్వహించిన ఒక అధ్యయనం చెబుతోంది.


కోడే ముందు?

రెడ్‌ జంగిల్‌ఫౌల్‌


జీవుల పరిణామ క్రమాన్ని బట్టి చూస్తే- పిల్ల కన్నా గుడ్డే ముందని స్పష్టమవుతుంది. కానీ ఆధునిక కోళ్ల విషయానికి వస్తే కథంతా మారిపోతుంది. డైనోసార్ల అనంతరం చాలాకాలం తర్వాతే కోళ్లు పుట్టుకొచ్చాయి. ఇవి మనుషులు పెంచుకోవటంతోనే వృద్ధి చెందుతూ వచ్చాయి. భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లో నివసించిన మానవులు తొలిసారి కోళ్లను పెంచుకున్నారని తాజా పరిశోధన ఒకటి పేర్కొంటోంది. తక్కువ ఉద్రిక్త స్వభావం గల అడవి పక్షులను మనిషి ఎంచుకొని, అవి గుడ్లు పెట్టి పొదిగేలా ప్రోత్సహించటంతో ఇవి వృద్ధి చెందాయి. ఈ ప్రక్రియ 10వేల ఏళ్ల క్రితం వేర్వేరుగా చాలా ప్రాంతాల్లో మొదలై ఉండొచ్చన్నది ఒక భావన. ప్రస్తుతం మనం పెంచుకుంటున్న కోళ్ల పూర్వీకులైన రెడ్‌ జంగిల్‌ఫౌల్‌ (గాలస్‌ గాలస్‌) అనే అడవి పక్షులు దక్షిణాసియా అడవుల్లో ఇప్పటికీ జీవించి ఉన్నాయి. మనుషులు వీటిని మచ్చిక చేసుకొని, పెంపుడు పక్షులుగా మార్చుకొని ప్రపంచమంతా వ్యాప్తి చేశారు. రెడ్‌ జంగిల్‌ఫౌల్‌ పక్షులు ఇతర పక్షులతో సంపర్కం చెందటం వల్ల క్రమంగా వాటి జన్యుక్రమం మారిపోతూ వచ్చింది. క్రమంగా వీటి నుంచి కొత్త ఉపజాతి (గాలస్‌ గాలస్‌ డొమెస్టికస్‌) పుట్టుకొచ్చింది. ప్రస్తుతం మనం పెంచుకుంటున్న కోళ్లు ఇవే. అయితే ఈ మార్పు ఎప్పుడు జరిగిందని చెప్పటం కష్టం. రెండు జంగిల్‌ఫౌల్‌ పక్షి జాతులు సంపర్కం చెందే క్రమంలో కొత్త జన్యుక్రమంతో కూడిన కోళ్ల జాతి పుట్టుకొచ్చి ఉండొచ్చు. ఆధునిక కోళ్ల చివరి పూర్వజాతి దీనికి సంబంధించిందే! ఇది జనక జాతుల నుంచి పూర్తిగా విభిన్నమైన జాతి ఏర్పడటానికి అవసరమైన జన్యుమార్పులు గల పిండంతో కూడిన గుడ్డు పెట్టి ఉండొచ్చు. ఇది మొదట్లో పరిపక్వ దశకు చేరుకొని ఉండకపోవచ్చు. అనంతరం, యుక్తవయసుకు చేరుకున్నాక మొట్టమొదటి పూర్తిస్థాయి గుడ్డును పెట్టి ఉండొచ్చు. ఇదే మొట్టమొదటి కోడి గుడ్డు కావొచ్చు. దీన్ని కోడి పొదగటం, దానిలోంచి పిల్లలు రావటం, పెరగటం, విస్తరించటం అంతా వేరే కథ. దీని ప్రకారం ప్రస్తుతం మన ముంగిట్లో తిరుగాడే కోళ్ల విషయంలో కోడే ముందు పుట్టుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాతే గుడ్డు కథ మొదలైంది.

మరో వాదన

కోడిగుడ్డు పెంకు చాలావరకు క్యాల్షియం కార్బొనేట్‌తోనే ఏర్పడుతుంది. ఇందుకు అవసరమైన క్యాల్షియం కోళ్లకు ఆహారం నుంచే లభిస్తుంది. క్యాల్షియం పెంకుగా మారటానికి ముందు క్యాల్షియం కార్బొనేట్‌ స్ఫటికాలుగా పోగు పడాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు కొన్ని ప్రొటీన్లు అవసరం వీటిల్లో ఒకటి ఓవోక్లీడిన్‌-17 (ఓసీ-17) ప్రొటీన్‌. ఇది కేవలం కోళ్ల అండాశయాల్లోనే ఉంటుంది. గుడ్డు కన్నా కోడే ముందు పుట్టుకొచ్చిందనే వాదనకు ఇది దారితీస్తోంది. ఎందుకంటే ఓసీ-17 లేకపోతే గుడ్డు ఏర్పడే అవకాశమే లేదు మరి. ఇది పెంకు త్వరగా ఏర్పడేలా చేస్తుంది. ఏమీ లేని స్థితి నుంచి కేవలం 24 గంటల్లోనే గుడ్డు ఏర్పడి, బయటకు రావటానికిదే కారణం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని