ఇకపై పకడ్బందీగా సామాజిక తనిఖీలు

Eenadu icon
By Telangana News Desk Published : 29 Oct 2025 05:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

కేంద్రం మార్గదర్శకాలతో పంచాయతీరాజ్‌ శాఖ సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో అక్రమాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కొత్త పంథాలో సామాజిక తనిఖీలు నిర్వహించనుంది. ఏటా సొసైటీ ఫర్‌ సోషల్‌ ఆడిట్‌ ఎకౌంటబులిటీ, ట్రాన్స్‌పరెన్సీ(ఎస్‌ఎస్‌ఏఏటీ) ద్వారా సామాజిక తనిఖీలు జరుగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అసాధారణ రీతిలో పనులు జరిగాయనే కారణంతో కేంద్ర ప్రభుత్వం రెండు దఫాలు ప్రత్యేక బృందాలను రాష్ట్రానికి పంపి తనిఖీలు చేయించింది. ఆ బృందాల నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి పలు మార్గదర్శకాలను సూచించింది. దీనికి అనుగుణంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ఏడాది సామాజిక తనిఖీలపై ప్రత్యేక దృష్టి సారించింది.

వంద శాతం రికార్డులతో..

  • తనిఖీ బృందాలు ఉపాధి పనుల రికార్డుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది పనులు ఇంకా పూర్తి కాలేదని, వివరాలు లేవని సరిగా ఇవ్వడం లేదు. దీంతో అరకొర రికార్డులతోనే తనిఖీలు చేపడుతున్నారు. ఈసారి 2024-25లో చేసిన ప్రతి పనికి సంబంధించి వందశాతం రికార్డులను ఈ నెల 31లోగా సమర్పించాలని పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశించింది. ఇవ్వని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో సోమవారం వరకు 90% రికార్డులు చేరాయి.  
  • ఏటా తనిఖీ బృందాలు తాము గుర్తించిన లోపాలను నమోదు చేసి వాటికి సమాధానం ఇవ్వాలని నిర్దేశిస్తున్నాయి. దీనిని అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీనిపైనా పీఆర్‌ శాఖ దృష్టి సారించింది. ఇకపై వెంటనే సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. పాత వాటికి సంబంధించిన సమాధానాలను కూడా ఈ నెల 31లోగా సమర్పించాలని తెలిపింది. వీటి ఆధారంగా తనిఖీ బృందాలు పాత పనులను సైతం తనిఖీ చేయనున్నాయి.  
  • ఉపాధి హామీలో గుర్తించిన అక్రమాల ఆధారంగా బాధ్యులైన వారి నుంచి ఆయా నిధులను రికవరీ చేయాల్సి ఉండగా.. సకాలంలో జరగడం లేదు. ఇకపై డబ్బులు చెల్లించని వారిని తొలగించి నివేదిక ఇవ్వాలని పీఆర్‌ శాఖ సూచించింది. 
  • సామాజిక తనిఖీల ప్రక్రియ పూర్తయిన వెంటనే గ్రామసభలను పక్కాగా నిర్వహించాలని ఆదేశించింది. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని