RTC bus Reservation: గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి ఆర్టీసీ బస్‌ రిజర్వేషన్‌!

Eenadu icon
By Telangana News Desk Updated : 03 Nov 2025 07:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

త్వరలో అందుబాటులోకి

ఈనాడు, హైదరాబాద్‌: బస్సు టికెట్‌ రిజర్వేషన్, ఛార్జీల చెల్లింపులను మరింత సులభతరం చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఆర్టీసీ వెబ్‌సైట్, లేదంటే బస్టాండ్లలో కౌంటర్ల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు రిజర్వు చేసుకోవాల్సి ఉంది. త్వరలో గూగూల్‌ మ్యాప్స్‌ నుంచి ఆర్టీసీ బస్సుల సమాచారం తెలుసుకోవడంతోపాటు.. అప్పటికప్పుడే రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సంస్థ సిద్ధమవుతోంది. అమల్లోకి వస్తే..మొబైల్‌ ఫోన్‌లో ‘గూగుల్‌ మ్యాప్స్‌’లోకి వెళ్లి, ఏ ఊరికి వెళ్లాలనే వివరాలు నమోదుచేసి, ఎక్కాల్సిన బస్సును ఎంచుకుని..డబ్బులు చెల్లిస్తే చాలు..అప్పటికప్పుడు రిజర్వేషన్‌ ఖరారవుతుంది. మొబైల్‌కే ఈ-టికెట్‌ వచ్చేస్తుంది. రిజర్వేషన్‌ ఉన్న బస్సులకే కాకుండా.. రిజర్వేషన్‌ లేని బస్సుల్లోనూ టికెట్లను ఇదే విధానంలో తీసుకుని, ప్రయాణించే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. 


బస్సుల సమాచారం గూగుల్‌కు

తెలంగాణ పరిధిలో తిరిగే బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసుల వివరాలను గూగుల్‌కు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం జాబితా సిద్ధం చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సిటీ బస్సుల సమాచారాన్ని ఐటీ శాఖ ద్వారా గూగుల్‌కు కొద్దిరోజుల క్రితం అందించినట్లు ఆర్టీసీ వర్గాల సమాచారం. గూగుల్స్‌ మ్యాప్స్‌లో ప్రస్తుతం టెస్టింగ్‌ ప్రక్రియ కొనసాగుతుండగా..రెండు, మూడు వారాల తర్వాత ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. తొలుత హైదరాబాద్‌ సిటీ బస్సుల సమాచారం అందుబాటులోకి వచ్చాక, జిల్లా బస్సుల వివరాలనూ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ వర్గాల సమాచారం.


కార్డు చూపగానే.. టికెట్‌..

బస్సెక్కిన తర్వాత క్రెడిట్, డెబిట్‌ కార్డుతో చెల్లింపులు చేసి టికెట్‌ తీసుకునే సదుపాయం ఇప్పుడు అమల్లో ఉంది. ఈ విధానంలో కార్డుదారు..పిన్‌ నంబరు నమోదు చేయాల్సి ఉంటుంది. సిటీ బస్సులు లేదా దూరప్రాంత బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణికులున్నప్పుడు టికెట్‌ జారీకి ఎక్కువ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో పిన్‌ నంబరు నమోదుచేయాల్సిన అవసరం లేకుండా క్రెడిట్, డెబిట్‌ కార్డును..టిమ్‌ యంత్రంపై పెట్టగానే నగదు చెల్లింపు జరిగి, టికెట్‌ జారీఅయ్యే విధానం తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయించుకుంది. వారంలోగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. తొలుత హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఏసీ బస్సుల్లో అమలుచేయనున్నట్లు సమాచారం. తర్వాత సిటీ బస్సులు, దూరప్రాంత బస్సుల్లో అందుబాటులోకి రానుంది.

Tags :
Published : 03 Nov 2025 07:44 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని