Ukraine Crisis: శత్రుసేన కమ్ముకొస్తున్నా ‘వెన్ను చూపట్లేదు!’

రష్యా ఆయుధ సంపత్తి ముందు ఉక్రెయిన్‌ బలం దిగదుడుపే. అయినా పుతిన్‌ సేన దూకుడుకు అడుగడుగునా అడ్డుకట్టపడుతోంది. ఉక్రెయిన్‌ సైనికులు, ప్రజలు అందుబాటులో ఉన్న ఆయుధాలతో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. కమ్ముకొస్తున్న రష్యా సైన్యాన్ని నిలువరించడానికి

Updated : 27 Feb 2022 05:50 IST

వీరోచితంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌ బలగాలు
ఆత్మాహుతికీ సిద్ధపడుతున్న వైనం

ష్యా ఆయుధ సంపత్తి ముందు ఉక్రెయిన్‌ బలం దిగదుడుపే. అయినా పుతిన్‌ సేన దూకుడుకు అడుగడుగునా అడ్డుకట్టపడుతోంది. ఉక్రెయిన్‌ సైనికులు, ప్రజలు అందుబాటులో ఉన్న ఆయుధాలతో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. కమ్ముకొస్తున్న రష్యా సైన్యాన్ని నిలువరించడానికి ఆత్మాహుతికీ సిద్ధపడుతున్నారు. లొంగిపోవడానికి బదులు పోరాడుతూ మాతృభూమి రక్షణలో ప్రాణాలు వదులున్నారు. ఈ పోరులో నేలకూలిన రష్యన్‌ యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, పేలిపోయిన యుద్ధట్యాంకులు ఉక్రెయిన్‌ ప్రతిఘటనకు దర్పణం పడుతున్నాయి.  

2014 ఫిబ్రవరిలో క్రిమియా ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకున్నప్పుడు ఉక్రెయిన్‌ బలగాలు కనీస పోరాటమూ చేయలేదు. అప్పట్లో వారి వద్ద పెద్దగా సాధనసంపత్తి లేదు. పోరాటస్ఫూర్తి కూడా అంతంతమాత్రమే. తర్వాతి కాలంలో సైనిక సంస్కరణలకు ఉక్రెయిన్‌ శ్రీకారం చుట్టింది. 2014-15 నాటితో పోలిస్తే తన రక్షణ బడ్జెట్‌ను మూడింతలు పెంచి సైనికదళాల ఆధునికీకరణకు పూనుకుంది. రష్యా దాడులను ఎదుర్కోవడానికే కాకుండా ‘నాటో’ కూటమిలోకి ప్రవేశించడానికి అవసరమైన అర్హతలను అందుకోవడం ఈ కసరత్తు ఉద్దేశం. ఇది మిశ్రమ ఫలితాలను ఇచ్చింది.  

* దాదాపు 800 యుద్ధట్యాంకులు, వేల సాయుధ శకటాలు, 2లక్షల మంది బలగంతో ఉక్రెయిన్‌ సైన్యం పటిష్ఠంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. 2014తో పోలిస్తే సైనికులు కఠిన శిక్షణతో రాటుదేలారు. అయితే ఉక్రెయిన్‌ సైన్యంలో ఎక్కువగా కాలం చెల్లిన ఆయుధాలే ఉన్నాయి. అవి రష్యా ట్యాంకులు, సాయుధ శకటాలను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నాయి. నాటో దేశాలు ఇటీవల ఇచ్చిన ట్యాంకు, విమాన విధ్వంసక ఆయుధ వ్యవస్థలు రష్యా బలగాలకు నష్టం కలిగిస్తున్నాయి.

* ఉక్రెయిన్‌ వైమానిక దళంలో సోవియట్‌ హయాం నాటి యుద్ధవిమానాలు, సుశిక్షిత చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. ఆ దేశ గగనతలాన్ని ఆక్రమించుకోవడానికి రష్యా తన ఏరోస్పేస్‌ దళాలను రంగంలోకి దించింది. ప్రమాదకరమైన ఎస్‌-400 దీర్ఘశ్రేణి విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థ సహా పలు ఆయుధాలను మోహరించింది. అయినా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఉక్రెయిన్‌ వాయుసేన కొన్ని విజయాలను నమోదు చేసింది. ఇప్పటికీ ఆ దేశానికి చెందిన కొన్ని యుద్ధవిమానాలు గగనవిహారం చేస్తూ పోరాడుతున్నాయి. రష్యాకు చెందిన కొన్ని ఫైటర్‌ జెట్‌లను కూల్చేశాయి. ఉక్రెయిన్‌ విమాన విధ్వంసక క్షిపణులు కూడా పుతిన్‌ సేనకు గణనీయ నష్టాన్ని కలిగించాయి. ఈ యుద్ధం దీర్ఘకాలం సాగకూడదని రష్యా కోరుకుంటోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పోరాటంతో తమ సేనకు ప్రాణనష్టం కలుగుతుందని భావిస్తోంది. చెచెన్యాలో ఈ తరహా పరిస్థితులను రష్యన్‌ సైన్యం ఎదుర్కొంది.


సెయింట్‌ జావలిన్‌

రష్యా సైన్యాన్ని ఎదుర్కోవడంలో జావలిన్‌ క్షిపణి.. ఉక్రెయిన్‌కు ప్రధానాస్త్రంగా నిలిచింది. ఈ అధునాతన ట్యాంకు విధ్వంసక క్షిపణి పుతిన్‌ సేన జోరుకు కళ్లెం వేస్తోంది. ఈ ఆయుధాన్ని తన పోరాట స్ఫూర్తికి చిహ్నంగా ఉక్రెయిన్‌వాసులు భావిస్తున్నారు. చర్చిలో కనిపించే మేరి మాగ్దాలిన్‌ చిత్రంతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మేరి చేతిలో జావలిన్‌ క్షిపణి వ్యవస్థను ఉంచుతూ ‘సెయింట్‌ జావలిన్‌’ అని నామకరణం చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిధులు సేకరించడానికి ఇదే పేరుతో వెబ్‌సైట్‌నూ ప్రారంభించారు. జావలిన్‌ క్షిపణులను అమెరికా నుంచి కొనుగోలు చేసింది.


ఆత్మాహుతితో అడ్డుకట్ట

ఉక్రెయిన్‌ సైన్యానికి చెందిన మెరీన్‌ బెటాలియన్‌ ఇంజినీర్‌ విటాలీ స్కాకున్‌ వొలొదిమిరోవిచ్‌.. ఖెర్‌సోన్‌ ప్రావిన్స్‌లోని హెనిచెస్క్‌ వంతెన వద్ద తన దళంతో కలిసి విధులు నిర్వర్తిస్తున్నాడు. రష్యా ఆక్రమణలో ఉన్న క్రిమియాను, ఉక్రెయిన్‌ను ఈ వంతెన కలుపుతోంది. శుక్రవారం రష్యా ట్యాంకులు అటువైపునకు దూసుకురావడాన్ని ఉక్రెయిన్‌ దళం గుర్తించింది. వాటిని అడ్డుకోవాలంటే వంతెనను పేల్చివేయడమే మార్గమని తేల్చింది. మందుపాతరలు అమర్చడానికి విటాలీ ముందుకొచ్చాడు. వంతెన నిండా పేలుడు పదార్థాలను అమర్చేటప్పటికీ చాలా ఆలస్యం జరిగిపోయింది. ఇక తాను తప్పించుకోవడానికి సమయం లేదని విటాలీ గుర్తించాడు. దీంతో అక్కడే ఉండి వంతెనను పేల్చేశాడు. పేలుడు తీవ్రతకు అతడు చనిపోయాడు. ‘‘అతడి బలిదానం వల్ల శత్రు జోరుకు బాగా కళ్లెం పడింది. దీనివల్ల అదనపు బలగాలను సమకూర్చుకొని, అక్కడ పటిష్ఠంగా రక్షణ చర్యలు చేపట్టడానికి మాకు వీలు కలిగింది’’ అని ఉక్రెయిన్‌ రక్షణ శాఖ తెలిపింది. విటాలీ త్యాగాన్ని ఆ దేశవాసులు కొనియాడుతున్నారు. అతడిని హీరోగా అభివర్ణిస్తున్నారు.


స్నేక్‌ ఐలాండ్‌లో వీరోచిత పోరు

నల్ల సముద్రంలోని స్నేక్‌ ఐలాండ్‌ అనే చిన్నదీవిలో 13 మంది ఉక్రెయిన్‌ సైనికులు మొక్కవోని ధైర్యసాహసాలతో పోరాడారు. అక్కడికి వచ్చిన రష్యా యుద్ధనౌక.. వీరిని ఆయుధాలు వదిలి లొంగిపోవాలని హెచ్చరించింది. లేకుంటే బాంబులు ప్రయోగిస్తామని స్పష్టంచేసింది. దీనికి ఉక్రెయిన్‌ సైనికులు నిరాకరించారు. ‘గో టు హెల్‌’ అంటూ నినదించారు. ఆ వెంటనే రష్యా బలగాలు సముద్రం, వాయు మార్గంలో వారిపై విరుచుకుపడ్డాయి. ఈ పోరులో అక్కడున్న ఉక్రెయిన్‌ సైనికులంతా చనిపోయారు. వీరికి మరణానంతరం ‘హీరో ఆఫ్‌ ఉక్రెయిన్‌’ పురస్కారాన్ని అందించనున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ తెలిపారు.


- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు