ప్రధాని మోదీతో పీవీ కుటుంబ సభ్యుల భేటీ

ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్‌ వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు.

Updated : 08 May 2024 06:51 IST

ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్‌ వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు. రాజ్‌భవన్‌లో వీరి భేటీ 30 నిమిషాల పాటు కొనసాగింది. ప్రధాని మోదీని కలిసిన వారిలో పీవీ కుమారుడు  ప్రభాకర్‌రావు, కుమార్తె, భారాస ఎమ్మెల్సీ వాణీదేవి, అల్లుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి కె.ఆర్‌.నందన్‌, మనవడు, భాజపా నాయకుడు ఎన్‌.వి.సుభాష్‌ తదితరులు ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నతో సత్కరించినందుకు గాను ప్రధాని మోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు ఎన్‌.వి.సుభాష్‌ తెలిపారు. పీవీ కుటుంబ సభ్యులతో భేటీ చిత్రాన్ని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు తదితర అంశాలపై వారితో చర్చించినట్లు తెలిపారు. ఇటీవల కాలంలో మన దేశం సాధిస్తున్న పురోగతిపై పీవీ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని