ఈశాన్య భారతంలో క్రీడోదయం

ఈశాన్య రాష్ట్రాల్లో క్రీడా కాంతులు వెల్లివిరుస్తున్నాయి. ఆ ఎనిమిది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రపంచ స్థాయి క్రీడాకారులు తయారవుతున్నారు. ఇటీవలి కామన్వెల్త్‌ క్రీడల్లో ఈశాన్య రాష్ట్రాల అథ్లెట్ల అద్భుత ప్రదర్శన అక్కడి క్రీడా విప్లవానికి సూచికగా నిలుస్తోంది. దేశ జనాభాలో ఈశాన్య రాష్ట్రాల వాటా 3.8 శాతమే. మొన్నటి కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు లభించిన 61 పతకాల్లో, ఆరింటిని

Updated : 16 Aug 2022 09:02 IST

దేశానికే ఆదర్శం

శాన్య రాష్ట్రాల్లో క్రీడా కాంతులు వెల్లివిరుస్తున్నాయి. ఆ ఎనిమిది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రపంచ స్థాయి క్రీడాకారులు తయారవుతున్నారు. ఇటీవలి కామన్వెల్త్‌ క్రీడల్లో ఈశాన్య రాష్ట్రాల అథ్లెట్ల అద్భుత ప్రదర్శన అక్కడి క్రీడా విప్లవానికి సూచికగా నిలుస్తోంది. దేశ జనాభాలో ఈశాన్య రాష్ట్రాల వాటా 3.8 శాతమే. మొన్నటి కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు లభించిన 61 పతకాల్లో, ఆరింటిని ఈశాన్య రాష్ట్రాల క్రీడాకారులు సాధించిపెట్టారు. భారత్‌కు దక్కిన 22 స్వర్ణ పతకాల్లో మూడింటిని ఈశాన్య రాష్ట్రాల క్రీడాకారులే అందించారు. ఈ పర్యాయం వెయిట్‌లిఫ్టింగ్‌లో పసిడి పతకాలు గెలిచిన మీరాబాయి చాను (మణిపుర్‌), జెరెమీ లాల్రినుంగా (మిజోరాం)ల ప్రదర్శన ఒలింపిక్‌ ప్రమాణాలకు దీటుగా ఉండటం విశేషం. వారిద్దరూ కామన్వెల్త్‌ క్రీడల్లో కొత్త రికార్డులు నెలకొల్పారు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌లో మీరా రజతం గెలవగా- తరవాతి ఒలింపిక్స్‌లో పతకానికి జెరెమీ గట్టి పోటీదారు అవుతాడని అంచనా వేస్తున్నారు. కామన్వెల్త్‌ క్రీడల లాన్‌బౌల్స్‌ పోటీల్లో తొలిసారి బంగారు పతకం నెగ్గిన భారత జట్టులో సభ్యురాలైన నయన్మణి సైకా (అస్సాం), జూడోలో రజతం సాధించిన సుశీలా దేవి (మణిపుర్‌), వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం నెగ్గిన బింద్యారాణి    (మణిపుర్‌) సైతం ఈశాన్య రాష్ట్ర క్రీడాకారిణులే.

ఘన చరిత్ర

ఆటల్లో ఈశాన్య రాష్ట్రాల క్రీడాకారుల మెరుపులు కొన్ని దశాబ్దాల కిందటే మొదలయ్యాయి. పాశ్చాత్య దేశాల మాదిరిగా ఈశాన్య రాష్ట్రాల్లో ఫుట్‌బాల్‌కు ఆదరణ ఎక్కువ. దేశంలోని మిగతా ప్రాంతాల్లో క్రికెట్‌లాగా ఈశాన్యంలో సాకర్‌ను అమితంగా ఇష్టపడతారు. భారత ఫుట్‌బాల్‌ జట్టు తొలి కెప్టెన్‌ టాలిమెరెన్‌ ఆవో ఈశాన్య ప్రాంతానికి చెందిన వ్యక్తే. 1948 లండన్‌ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు ఆయన సారథ్యం వహించారు. ఆ తరవాత ఎంతోమంది మేటి ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ఈశాన్యం నుంచి వచ్చారు. వారందరిలో బైచుంగ్‌ భుటియాకు మంచి పేరు వచ్చింది. సిక్కిమ్‌కు చెందిన భుటియా ఒక ఇంగ్లిష్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో ఒప్పందం చేసుకున్న తొలి భారత ఫుట్‌బాలర్‌గా రికార్డులకెక్కారు. భారత జట్టు కెప్టెన్‌గా ఎన్నో గొప్ప విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక మణిపుర్‌ ఉక్కు మహిళ, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి దేశంలో మహిళల బాక్సింగ్‌ విప్లవానికి కారణమైన మేరీకోమ్‌ గురించి పరిచయం అక్కర్లేదు. వెయిట్‌లిఫ్టర్లు కుంజురాణి దేవి, సంజిత చాను (మణిపుర్‌), బాక్సర్‌ లవ్లీనా, అథ్లెట్‌ హిమదాస్‌ (అస్సాం)... ఇలా ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రపంచ స్థాయి క్రీడాకారుల జాబితా పెద్దదే. ఫుట్‌బాల్‌తో పాటు వెయిట్‌లిఫ్టింగ్‌, బాక్సింగ్‌, అథ్లెటిక్స్‌లో ఈశాన్య ప్రాంత క్రీడాకారులు ప్రపంచస్థాయిలో మెరుపులు మెరిపిస్తున్నారు. అక్కడి వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల సహజంగా ఉండే శారీరక దారుఢ్యం క్రీడాకారులకు కలిసివస్తోందని, సరైన శిక్షణ అందడం వల్ల వారు అద్భుతాలు చేయగలుగుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రూపం, ఆహార్యం, ఆహారపు అలవాట్లు, సంస్కృతి పరంగా తమను మిగతా భారతీయులు చూసే తీరు వేరుగా ఉంటుందని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వాలూ తమ పట్ల దుర్విచక్షణ చూపుతుంటాయని ఆరోపిస్తుంటారు. మేరీకోమ్‌ సహా ఇతర ఈశాన్య ప్రాంత క్రీడాకారులు సాధించిన విజయాల వల్ల వస్తున్న గుర్తింపుతో మిగతా దేశానికి, ఈశాన్య రాష్ట్రాలకు మధ్య అంతరం తగ్గుతోంది. అక్కడి క్రీడాకారులు దేశమంతటికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మేరీకోమ్‌ లాంటివారి స్ఫూర్తితో అమ్మాయిలు పెద్దయెత్తున క్రీడల్లోకి అడుగుపెడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం క్రీడలకు తగిన ప్రాధాన్యం ఇచ్చి మౌలిక వసతులు, శిక్షణ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్నాయి. కేంద్రం సైతం ఖేలో ఇండియా పథకం కింద నిధులు కేటాయిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి తోడ్పడుతోంది.

మేటి ప్రోత్సాహం

జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది క్రీడాకారులు ప్రత్యేక శిక్షణ పొందుతుంటే అందులో 22శాతానికి పైగా మహిళా అథ్లెట్లు ఈశాన్య రాష్ట్రాల నుంచే ఉన్నారు. మణిపుర్‌, అస్సాం, సిక్కిం లాంటి రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా క్రీడా మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. పెద్ద సంఖ్యలో అకాడమీలు ఏర్పాటయ్యాయి. దేశంలో క్రీడలను ఒక పరిశ్రమగా గుర్తించిన తొలి రాష్ట్రంగా 2020లో మణిపుర్‌ నిలిచింది. మరోవైపు ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా ఎదిగిన మేరీకోమ్‌, బైచుంగ్‌ భుటియాలాంటి వారు ఈశాన్యంలో తమ పేరుతో అకాడమీలు ఏర్పాటు చేస్తున్నారు. నామమాత్ర రుసుములతో క్రీడాకారులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఉచిత బస ఏర్పాటు చేసి, ఆటల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. వారికి ప్రభుత్వాలు, దాతల నుంచి మంచి సహకారం అందుతోంది. ఈ ప్రోత్సాహంతో ఈశాన్యం నుంచి ఉత్తమ క్రీడాకారులు తయారవుతున్నారు. ప్రపంచ వేదికలపై సత్తా చాటుతూ మొత్తం దేశం తమవైపు చూసేలా, భావి క్రీడాకారులు స్ఫూర్తి పొందేలా రాణిస్తున్నారు.


యువతకు మేలు

శాన్యంలో మాదక ద్రవ్యాల వినియోగం, వాటి అక్రమ రవాణా ప్రమాదకర స్థాయికి చేరుకొంటోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. యువత మద్యపానానికి బానిసలవుతున్నారని, హెచ్‌ఐవీ బారిన పడుతున్నారని, ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారనే ఆందోళనా వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో చెడు అలవాట్ల నుంచి యువతను దారి మళ్ళించడానికి క్రీడలే సరైన మార్గంగా అక్కడి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందుకే ఆటలకు మంచి ప్రోత్సాహాన్నిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో సత్తా చాటితే జీవితమే మారిపోతుందని ఈశాన్య భారత యువత భావిస్తోంది. వాటిలో రాణించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.


- తిమ్మాపురం చంద్రశేఖర్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.