మత్స్యజాతులకు కాలుష్యం కాటు

నేడు ప్రపంచ మత్స్య దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా మత్స్యజాతుల ఆవాసాల్లో విపరీత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటిలో మూడింట రెండొంతుల ప్రాంతాల్లో విచ్చలవిడి వేట కొనసాగడమో లేదా వ్యవసాయానికి అనుగుణంగా మారిపోవడమో జరుగుతోందని ఐరాస తాజా నివేదిక వెల్లడించింది.

Published : 21 Nov 2022 00:25 IST

నేడు ప్రపంచ మత్స్య దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా మత్స్యజాతుల ఆవాసాల్లో విపరీత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటిలో మూడింట రెండొంతుల ప్రాంతాల్లో విచ్చలవిడి వేట కొనసాగడమో లేదా వ్యవసాయానికి అనుగుణంగా మారిపోవడమో జరుగుతోందని ఐరాస తాజా నివేదిక వెల్లడించింది. ఫలితంగా మత్స్యజాతులకు గడ్డుకాలం ముంచుకొచ్చిందని ఆందోళన వ్యక్తం చేసింది.

విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం, భూతాపం ప్రపంచవ్యాప్తంగా మత్స్యజాతుల ఆవాసాలను కల్లోలపరుస్తున్నాయి. సముద్రాలు, నదుల్లోకి విచ్చలవిడిగా వదిలేస్తున్న పారిశ్రామిక, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చమురు వెలికితీత సందర్భంగా వెలువడే విషపూరితాలు వాటి ఆవాసాలను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఫలితంగా ఎన్నో రకాల మత్స్యజాతులు అరుదైన జాతుల్లోకి చేరిపోయాయి. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఇండియాలోనూ అదే పరిస్థితి నెలకొంది. మత్స్య సంపదకు ఆలవాలమైన నదులు, వాగులు, చెరువులను కాలుష్యం, ఆక్రమణలు కాటేస్తున్నాయి. భారత్‌లో కోట్ల సంఖ్యలో మత్స్యకారులకు సముద్రంపై వేటే జీవనాధారం. తరాలుగా అదే వృత్తిలో కొనసాగుతున్న మత్స్యకారుల జీవితాలు నిత్యం ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రకటించినా మత్స్యకారుల బతుకు చిత్రంలో ఆశించినంత మార్పు రాలేదన్నది నిష్ఠుర సత్యం. ఈ పరిస్థితులపై అవగాహన పెంచి, మత్స్యజాతుల ఆవాసాలను పరిరక్షించుకోవడమే లక్ష్యంగా ఏటా నవంబర్‌ 21న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా ఇండియా రెండో అతిపెద్ద మత్స్య ఉత్పత్తిదారు. మత్స్యరంగ సమగ్రాభివృద్ధి, మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ప్రారంభించిన ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన (పీఎంఎంఎస్‌వై) దేశంలో మత్స్యసంపద పెరుగుదలను వేగవంతం చేసింది. గడచిన రెండేళ్లలో ఈ రంగం అభివృద్ధి 14.3శాతం వృద్ధితో ముందుకు సాగుతున్నట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ప్రకటించారు. 2021-22లో భారత్‌ రూ.57,587 కోట్ల విలువైన మత్స్య ఎగుమతులు చేపట్టింది. అందులో సింహభాగం రొయ్యలే. చేపలు, ఇతర మత్స్యజాతుల ఎగుమతుల్లో ఇంకా ముందడుగు వేయాల్సి ఉంది.

వాతావరణ మార్పుల ప్రభావమూ మత్స్య రంగంపై పడుతోంది. ముఖ్యంగా హిమాలయ పర్వతాలు కరిగి అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తుండటం మత్స్యజాతుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. తీరప్రాంతం పొడవునా పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థాలు, ప్లాస్టిక్‌ అవశేషాలు మత్స్యసంపదకు పెనుశాపంగా పరిణమిస్తున్నాయి. దీంతోపాటు నదుల్లోకీ విపరీతంగా వ్యర్థాలు, కాలుష్య కారకాలు చేరుతున్నాయి. గంగానదిలోకి దాని పరీవాహక ప్రాంతాల నుంచి రోజూ పెద్దయెత్తున వ్యర్థజలాలు వస్తున్నాయి. నమామిగంగే లాంటి ప్రాజెక్టుతో నదిని శుద్ధి చేసేందుకు యత్నాలు సాగుతున్నాయి. గోదావరి, కృష్ణా నుంచి బ్రహ్మపుత్ర వరకు అన్నింటా ఇలాంటి పథకాలు చేపడితేనే మత్స్యజాతుల పరిరక్షణ సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు సముద్రంలోకి వ్యర్థాలు చేరకుండా నిరోధించాలి. కొల్లేరు, పులికాట్‌ లాంటి సరస్సుల్లో అధికమవుతున్న ఆక్రమణలు సహజ మత్స్యసంపద పెరుగుదలకు తూట్లు పొడుస్తున్నాయి. మత్స్యకారుల పెట్టుబడి అవసరాలను తీర్చేందుకు కిసాన్‌ క్రెడిట్‌ సౌకర్యం కల్పించడం, చేపల పెంపకం, విక్రయం వంటివాటికి దేశవ్యాప్తంగా మత్స్యకార సంఘాలు ఏర్పాటు చేయడంతోపాటు, తాజాగా ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన చేపట్టారు. ఇవి మత్స్యకారుల పురోగతికి పూర్తిస్థాయిలో తోడ్పడలేకపోతున్నాయి. చేపలు, రొయ్యల నిల్వ, శుద్ధి ప్రక్రియ కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని, దళారుల బారిన పడకుండా మత్స్యకారులు, చేపల పెంపకందారులను కాపాడుకోవడం అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు. మత్స్యకారుల బీమాకూ తగిన ప్రాధాన్యం కల్పించాలి. ప్రాణాలు పణంగా పెట్టి సముద్రంలో వేటాడి తెచ్చిన చేపలు, రొయ్యలను ఎగుమతి చేయడంలోనూ అవాంతరాలు ఎదురవుతున్నాయి. కొవిడ్‌ తరవాత ఎగుమతులపై ఆంక్షలు పెరిగాయి. చైనా, అమెరికాలాంటి దేశాల్లో బహుళ స్థాయుల్లో తనిఖీలతో అనుమతుల్లో బాగా జాప్యం జరుగుతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సరకు రవాణా ఛార్జీలు విపరీతంగా పెరగడమూ మత్స్య ఉత్పత్తుల ఎగుమతికి ప్రధాన అవరోధంగా మారింది. ఈ ఇబ్బందులన్నీ తొలగించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి, సత్వర కార్యాచరణ చేపడితే మత్స్యసంపద దేశానికి మరింత విలువైన ఆస్తిగా మారుతుంది. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది.

- శిశిర

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.