MS Dhoni: ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్‌ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు

తన టీ20 కెరీర్‌లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు.

Published : 06 May 2024 11:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై అద్భుత విజయం సాధించింది. అయితే, ఎంఎస్ ధోనీ (MS Dhoni) 9వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడం కొత్త చర్చకు తెరలేసింది. ధనాధన్ షాట్లతో అలరించిన ‘కెప్టెన్ కూల్’ అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు? సాధారణంగా మిడిలార్డర్‌లో వచ్చే అతడు చివర్లో బ్యాటింగ్‌కు రావాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతకుముందు కూడా ఒక మ్యాచ్‌లో 8వ స్థానంలో క్రీజ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు మాత్రం 19 ఓవర్‌లో వచ్చినప్పటికీ తొలి బంతికే ఔటై పెవిలియన్‌కు చేరాడు. దీనిపై భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్‌ సింగ్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

ధోనీ ఇంకా ముందు రావాలి: పఠాన్

‘‘ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడం వల్ల చెన్నైకేమీ ప్రయోజనం లేదు. అతడి వయసు 42 ఏళ్లు. కానీ, ఫిట్‌నెస్‌ అద్భుతంగా ఉంది. మంచి ఫామ్‌లోనూ ఉన్నాడు. కాబట్టి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో బాధ్యత తీసుకుని ముందుకు రావాలి. కనీసం నాలుగైదు ఓవర్లు అయినా బ్యాటింగ్‌ చేయాలి. అలా చేస్తే చెన్నైకి తిరుగుండదు. చివర్లో ఆడటం వల్ల అనుకున్నంత మేర చెన్నైకి లాభం ఉండటం లేదు. ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తేనే సీఎస్కే ప్లేఆఫ్స్‌ బెర్తును ఖాతాలో వేసుకుంటుంది. సీనియర్‌ ఆటగాడిగా, మంచి ఫామ్‌లో ఉన్న ధోనీ దూకుడుగా ఆడేందుకు ముందు రావాలి. దీనిపై మేనేజ్‌మెంట్ వర్కౌట్‌ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ధోనీకి ఎవరైనా చెప్పండి ‘కమాన్.. నువ్వు నాలుగు ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేయి’.  అప్పుడు మరోసారి ఛాంపియన్‌గా నిలిచేందుకు చెన్నైకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి’’ అని ఇర్ఫాన్ తెలిపాడు. 

మరొక పేసర్‌ను తీసుకోండి: హర్భజన్‌ సింగ్

‘‘ఒకవేళ ధోనీ ఇలానే 9వ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని భావిస్తే.. అతడి స్థానంలో తుది జట్టులో మరొక పేసర్‌ను అదనంగా తీసుకోండి. ధోనీనే డెసిషన్ మేకర్. ముందుగా బ్యాటింగ్‌కు రాకుండా నిరాశపరిచాడు. శార్దూల్‌ ఠాకూర్‌ను పంపించాడు. కానీ, ధోనీలా ఠాకూర్ భారీ షాట్లను కొట్టలేడు. అసలు ఎందుకు ఇలాంటి పొరపాటు చేశాడనేది నాకు అర్థం కావడం లేదు. అతడి అనుమతి లేకుండా ఇలా జరగదని తెలుసు. లేకపోతే ఎవరైనా ధోనీని లోయర్‌ ఆర్డర్‌లో పంపించాలనే నిర్ణయం తీసుకున్నారని చెబితే అంగీకరించడానికి నేను సిద్ధంగా లేను. చెన్నైకి త్వరగా పరుగులు రావాలంటే ధోనీని ముందుగా పంపించాలి. గత మ్యాచుల్లో అలా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కానీ, పంజాబ్‌తో మ్యాచ్‌లో ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడం సరైంది కాదు. సీఎస్కే విజయం సాధించినప్పటికీ ఆ జట్టు నిర్ణయంపై నేను ఇలానే స్పందిస్తా’’ అని హర్భజన్‌ వ్యాఖ్యానించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని