పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు

భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి.

Published : 06 May 2024 06:26 IST

రాష్ట్రంలో ఒకేరోజు భిన్న వాతావరణం
జగిత్యాల జిల్లాలో ఈ ఏడాదిలోనే అత్యధికంగా 47.1 డిగ్రీల ఎండ
నల్గొండ, సూర్యాపేట, ములుగు, జనగామ జిల్లాల్లో వర్షాలు
వడదెబ్బ, పిడుగుపాటుతో నలుగురు చొప్పున మృతి

ఈనాడు, హైదరాబాద్‌: ఈనాడు, హైదరాబాద్‌: భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరులో ఈ ఏడాదిలోనే అత్యధికంగా 47.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలోని ఆరు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, ఆసిఫాబాద్‌, నల్గొండ జిల్లాల్లో 46 డిగ్రీలపైన ఎండ కాసింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 51 మండలాల్లో వడగాలులు వీచాయి.

చల్లబడ్డ జిల్లాలు

ఇన్నాళ్లూ రికార్డు స్థాయి ఎండలతో ఉడికిపోయిన నల్గొండ, సూర్యాపేట, ములుగు, జనగామ జిల్లాలు ఆదివారం వర్షపు చినుకులతో కాస్త చల్లబడ్డాయి. మరికొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు కురిశాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో 6.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 4.7, ములుగు జిల్లా ఏటూరునాగారంలో 4.3, జనగామ జిల్లా దేవరుప్పులలో 3.2, నల్గొండ జిల్లా కేతేపల్లిలో 3.1, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్ల, నాగారం మండల కేంద్రాల్లో 2.9 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ములుగు జిల్లా వాజేడు, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాలు, జనగామ జిల్లాకేంద్రం, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలాల్లో మామిడికాయలు నేలరాలగా.. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, ధాన్యం తడిసిపోయాయి. కొన్ని జిల్లాల్లో సోమ, మంగళవారాల్లోనూ ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొంది.


ఎనిమిది మంది మృత్యువాత

జమ్మికుంట, ఖానాపురం, గార్ల, ఏటూరునాగారం, రఘునాథపల్లి, అడ్డగూడూరు, బేగంపేట, ఆమనగల్లు, న్యూస్‌టుడే: ములుగు జిల్లా ఏటూరునాగారం పట్టణానికి చెందిన రైతు బాస బుల్లెయ్య(40) ఓడవాడ సమీపంలో జంపన్నవాగు వద్ద మిర్చి ఆరబోశారు. సాయంత్రం ఈదురుగాలులు వీస్తుండటంతో కుమారుడు శివకుమార్‌ను వెంటబెట్టుకుని మిర్చిపై టార్పాలిన్లు కప్పేందుకు వెళ్లారు. జంపన్నవాగు దాటిన తర్వాత పిడుగుపడటంతో బుల్లెయ్య అక్కడికక్కడే మృతిచెందగా, శివకుమార్‌ స్వల్పంగా గాయపడ్డారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరుకు చెందిన దాసరి అజయ్‌(25) తన వ్యవసాయ భూమి వద్ద తల్లితో కలిసి పశువులు మేపుతున్నారు. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో పశువులను పాకలో కట్టేందుకు తీసుకెళ్తుండగా పిడుగుపాటుకు గురయ్యారు. అజయ్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. తల్లికి ప్రాణాపాయం తప్పింది. ఓ ఆవు, లేగ దూడ మృత్యువాతపడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తిలో చిప్పలపెల్లి బాలమల్లు(65) గేదెను తోలుకుని ఇంటికి వస్తుండగా వర్షం కురవడంతో సమీపంలో ఉన్న రేకుల షెడ్డులోకి వెళ్లారు. పక్కనే పిడుగుపడటంతో బాలమల్లుతోపాటు అతని గేదె కూడా అక్కడికక్కడే మృతిచెందింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కావటి పద్మమ్మ(45) తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా వర్షం రావడంతో చెట్టు కిందకు వెళ్లారు. ఈ సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు.
- కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లికి చెందిన ఎం.రాజయ్య(50) ఆదివారం జమ్మికుంట పుర పరిధి కొత్తపల్లి ఆదర్శనగర్‌ కాలనీ సమీపంలో ఎండ తీవ్రతతో మృతిచెందారు. వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌కు చెందిన ముర్రు భిక్షపతి(36) కూలీ పనులు చేస్తూ, మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండల కేంద్రానికి చెందిన జమాల్‌పురి నాగేందర్‌(45) వంట పనులకెళ్లి, బేగంపేట పోలీసుస్టేషన్‌ పరిధిలో అన్నానగర్‌ చౌరస్తాలోని బీరప్ప ఆలయం వద్ద మునీర్‌(45) అనే కూలీ ఎండదెబ్బతో చనిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని