Pathhole: రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్‌.. వాటంతట అవే పూడుకునేలా.!

గుంతల రహదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిష్కారం కనుక్కోనుంది. నిర్మాణంలో కొత్త మెటీరియలను వినియోగించే అంశంపై పనిచేస్తోంది.

Published : 06 May 2024 15:38 IST

Pathhole | ఇంటర్నెట్‌ డెస్క్: దేశంలో రహదారులు రోజురోజుకూ విస్తరిస్తున్నా.. గుంతల సమస్య మాత్రం ఇప్పటికీ వాహనదారులను వేధిస్తూనే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు గుంతలతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు పాడవడం, ట్రాఫిక్‌ జామ్‌ వంటి ఇక్కట్లే కాదు.. కొన్నిసార్లు వాహనదారులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలూ ఉంటున్నాయి. దీనికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) పరిష్కారం కనుక్కునేందుకు సిద్ధమైంది. రహదారిపై గుంత ఏర్పడినప్పుడు దానంతట అదే పూడుకుపోయే సాంకేతికతతో పని చేస్తోంది.

సాధారణంగా రహదారులపై ఏదైనా గుంత ఏర్పడితే మళ్లీ దాన్ని మాన్యువల్‌గా పూడ్చాల్సిందే. ముఖ్యంగా వర్షాకాలంలో వస్తే ఈ గుంతల్లో నీరు నిలిచిపోయి రోడ్లు మరింత పాడవుతున్నాయి. అలా కాకుండా చిన్నపాటి గుంత లేదా పగుళ్లు ఏర్పడగానే దానంతట అదే పూడుకుపోయేందుకు గానూ రహదారుల నిర్మాణంలో సెల్ఫ్‌ హీలింగ్‌ మెటీరియల్‌ను వాడనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు తెలిపాయి. స్టీల్‌ ఫైబర్స్‌, తారు కలిపిన పదార్థాన్ని ఇందులో వాడతారు. గుంత ఏర్పడగానే తారు హీట్‌ అయ్యి దానంతట అదే పూడుకుపోతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొన్ని జాతీయ రహదారులపై దీన్ని NHAI పరీక్షిస్తోంది. ఈ మెటీరియల్‌ను వినియోగించడం వల్ల ఎంతమేర ప్రయోజనం కలగనుంది..? దానికయ్యే ఖర్చు ఎంత? వంటివీ అంచనా వేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని