హౌస్‌ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!

ఒక రాష్ట్రమంత్రి సహాయకుడికి చెందిన హౌస్‌కీపర్ ఇంట్లో భారీ సంఖ్యలో కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఎన్నికల వేళ ఈ పరిణామం కలకలం సృష్టిస్తోంది. 

Updated : 06 May 2024 10:15 IST

రాంచీ: సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న తరుణంలో.. ఝార్ఖండ్‌(Jharkhand)లోని ఓ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. అదంతా లెక్కల్లోకి రాని సొమ్ము అని, ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న సొమ్ము రూ.20 కోట్లుపైనే ఉంటుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రాజధాని నగరం రాంచీలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ కేసులో ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన మాజీ చీఫ్ ఇంజినీర్ వీరేంద్ర రామ్‌ 2023లో అరెస్టయ్యారు. దర్యాప్తులో భాగంగా ఆయనకు చెందిన 10కి పైగా ప్రాంతాల్లో ప్రస్తుత సోదాలు జరిగాయి. ఈ క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంఘీర్‌ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌ లాల్‌కు సహాయకుడికి చెందినదిగా భావిస్తోన్న ఇంట్లో నోట్ల గుట్టలు దర్శనమిచ్చాయి. ఒక గదిలో కరెన్సీ కట్టలు పేర్చి ఉన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై భాజపా స్పందించింది. ‘‘ఝార్ఖండ్‌లో అవినీతి ముగిసిపోలేదు. ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికల్లో భాగంగా సదరు వ్యక్తులు దీనిని ఉపయోగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’’ అని కోరింది.

పలు ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలకు పాల్పడ్డారని, రూ.100 కోట్ల మేర కూడబెట్టారని వీరేంద్రపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నేతలతో ఆయన జరిపిన లావాదేవీల వివరాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను ఇదివరకే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగానే సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని