Published : 01/12/2022 19:34 IST

రెండో బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నారా?

ఉష-ఉత్తేజ్ దంపతులకు రెండేళ్ల పాప ఉంది. ప్రస్తుతం వారు మరో బిడ్డ కోసం ప్రయత్నిద్దామనుకుంటున్నారు. కానీ అందుకు ఇది సరైన సమయమేనా.. అని తేల్చుకోలేకపోతున్నారు.

ఇలా రెండో సంతానం కోసం ప్రయత్నించే దంపతుల్లో చాలామందిని కొన్ని రకాల ప్రశ్నలు తికమకపెడుతుంటాయి. జనరేషన్ గ్యాప్ లేకుండా ఉండాలంటే ఇద్దరు పిల్లలకు మధ్య రెండేళ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు అని కొందరనుకుంటే.. మొదటి బిడ్డ కాస్త పెద్దయ్యాక రెండో సంతానం గురించి ఆలోచిద్దాంలే అని మరికొందరు భావిస్తుంటారు. ఏదేమైనా మరో బిడ్డ కోసం ప్రయత్నిస్తున్న దంపతుల్ని ఇలాంటి సందేహాల నుంచి బయటపడేసే ఉద్దేశంతోనే నిపుణులు కొన్ని విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందామా..

స్థిరపడ్డాకే..

కుటుంబం పెరిగేకొద్దీ క్రమంగా ఆర్థిక అవసరాలు కూడా పెరుగుతూ వస్తాయి. కాబట్టి మరో బిడ్డకు జన్మనిచ్చే ముందు మీ ఆర్థిక స్థితిగతులు, స్తోమత.. వంటివి కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో మరో బిడ్డ ఆలనాపాలనా చూసుకోవడం, వారి కనీస అవసరాలు తీర్చడం, ఇంటి అవసరాలు, మీపై ఆధారపడిన వారు.. వంటి వాటి గురించి ఆలోచించాలి. ఈ అవసరాలన్నిటితో పాటు పొదుపు చేయడానికి కూడా డబ్బు సరిపోయి.. ఎలాంటి సమస్యా లేదు అనుకున్నప్పుడు మాత్రమే మరో బిడ్డ గురించి ఆలోచించడం మంచిదనేది నిపుణుల అభిప్రాయం. లేదంటే కాస్త ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది.

జాగ్రత్తపడాలి..

మరో బిడ్డ కోసం ప్రయత్నించడమనేది దంపతుల్లో కేవలం ఎవరో ఒకరికి మాత్రమే సంబంధించిన విషయం కాదు.. అది ఇద్దరి ఇష్టప్రకారమే జరగాలి. లేదంటే ఆలుమగల మధ్య లేనిపోని గొడవలు, కలతలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్తలిద్దరిలో ఒకరికి బిడ్డ కావాలని, మరొకరికి అప్పుడే వద్దని.. ఇలా భిన్నాభిప్రాయాలున్నట్లయితే ముందుగా వాటి గురించి ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడం, ఒకరి ఆలోచనలను మరొకరు అర్థం చేసుకుని ముందుకెళ్లడం ఉత్తమం. అయినా కూడా ఇంకా దంపతులిద్దరూ సందిగ్ధంలోనే ఉన్నట్లయితే కుటుంబ పెద్దలు లేదంటే సంబంధిత నిపుణుల సలహాలు, కౌన్సెలింగ్.. వంటివి తీసుకోవడం చాలా మంచిది. దీంతో సందేహాలన్నీ నివృత్తి అయి, రెండో బిడ్డ విషయంలో మంచి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది.

ఆరోగ్యమూ చూసుకోవాలి..

మొదటిసారి బిడ్డ పుట్టినప్పుడు కొందరు మహిళలకు సిజేరియన్ అయ్యే అవకాశముంటుంది. ఇలాంటి వారు ఆరోగ్యరీత్యా కోలుకొని తిరిగి మామూలు స్థితికి రావడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. దీంతో పాటు పుట్టినప్పటి నుంచి బిడ్డ అవసరాలన్నీ తీర్చే క్రమంలో ఎదురయ్యే మానసిక, శారీరక ఒత్తిళ్లు.. ఇవన్నీ తల్లి ఆరోగ్యంపై కాస్త ఎక్కువగానే ప్రభావితం చేస్తాయి. దీంతో పాటు తల్లికి మరే ఇతర అనారోగ్యాలైనా ఉంటే మరో బిడ్డ కోసం ప్రయత్నించడం కష్టమవుతుంది. ఇలాంటి ఆరోగ్య పరిస్థితుల్లో మరో బిడ్డ కోసం ప్రయత్నించడం అంటే ఇటు తల్లికి, అటు పుట్టబోయే బిడ్డకీ మంచిది కాదు. కాబట్టి తల్లి శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ని పొందిన తర్వాత మరో బిడ్డ కోసం ప్రయత్నించడం శ్రేయస్కరం.

కనీసం మూడేళ్లు..

రెండో బిడ్డ కోసం ప్రయత్నించే దంపతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. అందులో ఇద్దరు పిల్లల వయసుల మధ్య తేడా కూడా చాలా ముఖ్యమైంది. ఈ క్రమంలో బిడ్డలిద్దరి మధ్య వయసులో తేడా కనీసం మూడు నుంచి ఐదేళ్లుండేలా చూసుకోవడం మంచిది. ఇలాంటప్పుడే పిల్లలు జనరేషన్ గ్యాప్ లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ప్రేమగా కలిసిపోవడం.. వంటివి చేస్తారట. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. మొదటి బిడ్డ వయసు మరీ చిన్నగా ఉన్నప్పుడే మరో బిడ్డ పుట్టిందనుకోండి.. ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకోవడం ఇబ్బందవుతుంది. కాబట్టి పిల్లలు కొన్ని చిన్న చిన్న పనులు తమకు తాముగా చేసుకోవడం ప్రారంభించాక మరో బిడ్డ పుట్టినా తల్లిదండ్రులపై అంతగా భారం ఉండకపోవచ్చనేది నిపుణుల అభిప్రాయం.

అనుభవం వచ్చాకే..

కుటుంబంలో తొలి సంతానం అంటే ఎవరికైనా కాస్త ప్రత్యేకంగా, ప్రేమగానే ఉంటుంది. పూర్తి శ్రద్ధంతా వారి పైనే పెట్టి కంటికి రెప్పలా పెంచుతారు. ఈ క్రమంలో చిన్నారుల అలవాట్లు, వారి అవసరాలు, వారి మనస్తత్వం గురించి కూడా పూర్తి అవగాహన వస్తుంది. ఫలితగా పిల్లల పెంపకం విషయంలో కొంత అనుభవం సంపాదించి రెండో సంతానాన్ని చక్కగా చూసుకునే సామర్థ్యం వస్తుంది. అందుకే పిల్లలిద్దరికీ మధ్య కనీసం మూడు నుంచి ఐదేళ్ల ఎడం ఉండాలన్నది నిపుణుల అభిప్రాయం. అలాగే బిడ్డలిద్దరి మధ్య కాస్త గ్యాప్ ఉండడం వల్ల పని ఒత్తిడి, ఆందోళన వంటివి ఉండవు. ఉన్న సమయాన్నే ఇద్దరు పిల్లల సంరక్షణకు చక్కగా వినియోగించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని