Published : 24/11/2022 20:42 IST

చలికాలంలో.. చర్మానికి.. జుట్టుకి..!

కాలమేదైనా అందంగా మెరిసిపోవాలని అమ్మాయిలు ఆరాటపడడం సహజం. అందుకోసమే ఇటు ఇంట్లో సహజసిద్ధమైన సౌందర్య చికిత్సల్ని ఫాలో అవుతూనే అటు బ్యూటీ పార్లర్లను కూడా ఆశ్రయిస్తుంటారు. అయినప్పటికీ ఆయా కాలాల్లో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులు అతివల సౌందర్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటాయి. ఇక ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే చలికాలంలో అయితే ఈ సమస్యలు మరింత తీవ్రమవుతుంటాయి. పొడి చర్మం, మడమల్లో పగుళ్లు, జుట్టు నిర్జీవమవడం.. వంటి ఎన్నో సౌందర్య సమస్యలు ఈ కాలంలో అమ్మాయిల పాలిట శాపంగా మారుతున్నాయి. అందుకే వీటన్నింటి నుంచి బయటపడడంతో పాటు ఈ కాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందించడానికి ఇంట్లోనే చేసుకునే కొన్ని సహజసిద్ధమైన స్పా ట్రీట్‌మెంట్లు ఉత్తమం అని చెబుతున్నారు సౌందర్య నిపుణులు.

స్క్రబ్ చేసేయండిలా..!

చలి వల్ల గరుకుగా మారిన చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చుకునేందుకు చాలామంది ఆశ్రయించే పద్ధతి స్క్రబ్బింగ్. చలికాలపు స్పా ట్రీట్‌మెంట్లలో భాగంగా దాల్చినచెక్క, తేనె.. ఈ రెండూ కలిపిన మిశ్రమాన్ని చర్మాన్ని స్క్రబ్ చేయడానికి ఉపయోగించవచ్చు. దీనివల్ల శరీరానికి పోషణ అందడంతో పాటు చర్మంపై మృతకణాలు కూడా తొలగిపోతాయి. అలాగే దాల్చిన చెక్క శరీరంలో వేడిని పుట్టించడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలున్న ఈ స్క్రబ్బింగ్ పద్ధతిని ఇంట్లోనూ ప్రయత్నించవచ్చు.

మెడపై సుతారంగా..

చలికాలంలో అటు వెచ్చదనాన్ని పంచడంతో పాటు చర్మాన్ని మృదువుగా మార్చే సహజసిద్ధమైన పదార్థాలు కొన్నుంటాయి. అలాంటి వాటిలో గుమ్మడి కూడా ఒకటి. దీని గుజ్జుతో ముఖం, మెడపై సుతారంగా మసాజ్ చేయడం వల్ల పొడిబారిపోయిన చర్మం మృదువుగా మారుతుంది. ఇందులోని ఎంజైమ్స్, బీటా కెరోటిన్, మినరల్ సాల్ట్స్.. వంటివన్నీ ఇందుకు ప్రధాన కారణం. అందుకే దీన్ని నేరుగా ఉపయోగించడంతో పాటు పలు స్పా ట్రీట్‌మెంట్లలో భాగంగా కూడా ఉపయోగిస్తుంటారు.

జుట్టుకు బటర్..

చలికాలంలో చర్మమే కాదు.. జుట్టు కూడా తేమను కోల్పోయి నిర్జీవంగా మారిపోతుంది. అలాగని దాన్ని నిర్లక్ష్యం చేస్తే జుట్టు రాలిపోవడం, చుండ్రు.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. కాబట్టి ప్రారంభంలోనే వాటికి ఫుల్‌స్టాప్ పెట్టడం మంచిది. అందుకు ఇంట్లో లభించే బటర్ చక్కటి పరిష్కారం చూపుతుంది. ఇందుకు మనం చేయాల్సిందల్లా బటర్‌ని కుదుళ్లకు పట్టించి అరగంట పాటు షవర్ క్యాప్ పెట్టి అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే బటర్ వల్ల కుదుళ్లకు పట్టుకున్న జిడ్డుదనం వదిలిపోతుంది. ఈ హెయిర్‌మాస్క్ వల్ల కుదుళ్లకు తేమ అందడంతో పాటు ఆ భాగంలో సహజసిద్ధమైన నూనెలు ఉత్పత్తవుతాయి. తద్వారా కుదుళ్లు, జుట్టు పొడిబారకుండా జాగ్రత్తపడచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని