Published : 15/10/2022 17:04 IST

మీ భాగస్వామి ఇలా వేధిస్తున్నారా?

దంపతుల మధ్య విభేదాలు రావడం సహజం. అయితే కొంతమంది తమ కోపాన్ని భౌతికంగా చూపిస్తే.. ఇంకొంతమంది మానసికంగా వేధిస్తుంటారు. భౌతిక వేధింపులకు పరిష్కారం వెతకచ్చు. కానీ మానసిక వేధింపులు అలా కాదు. వీరు బయటకు హుందాగానే కనిపిస్తూ భాగస్వామిని వేధిస్తుంటారు. ఇలాంటి వేధింపులను గుర్తించడానికి, దాని వెనక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి సమయం పడుతుంటుంది. ఈ సమస్య కేవలం దంపతుల మధ్యే కాకుండా స్నేహితులు, బంధువులు, సహోద్యోగుల మధ్య కూడా కనిపించవచ్చు. అయితే మానసికంగా వేధించే వారిలో కొన్ని లక్షణాలు కామన్‌గా ఉంటాయంటున్నారు నిపుణులు. వీటిని తెలుసుకోవడం ద్వారా ముందు నుంచే జాగ్రత్త పడచ్చంటున్నారు. మరి, ఆ లక్షణాలేంటో తెలుసుకుందామా...

నమ్మకం పోయేలా..

ఎదుటి వ్యక్తిని మానసికంగా వేధించడంలో ‘గ్యాస్‌లైటింగ్’ కూడా ఒకటి. దీన్ని అనుసరించే వారు కోవర్టులాగా ప్రవర్తిస్తుంటారు. ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వారి పక్కనే స్నేహంగా ఉంటూ తప్పుదోవ పట్టిస్తుంటారు. ఈ క్రమంలో తమ పైన తమకు నమ్మకం పోయేలా, తమ నిర్ణయాలపై తమకే అనుమానం వచ్చేలా చేస్తుంటారు. అయితే ఈ విధానాన్ని అందరి మీద అప్లై చేయరు. మానసికంగా దృఢంగా లేని వారితో మాత్రమే ఇలా ప్రవర్తిస్తుంటారు. రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌లోనే ఇది ఎక్కువగా జరుగుతుంది. ఎదుటి వారిని క్రమంగా బలహీనులని చేసి తమ అధీనంలోకి తెచ్చుకోవడమే ఇలా చేసేవారి లక్ష్యమని రిలేషన్‌షిప్‌ నిపుణులు అంటున్నారు.

ఒంటరి వారిని చేస్తూ.. 

మానసికంగా వేధించే వారి శైలి భిన్నంగా ఉంటుంది. కొంతమంది తమ జీవిత భాగస్వామిని స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి క్రమంగా దూరం చేస్తుంటారు. కొంతకాలానికి వారికి తను తప్ప ఇంకెవరూ లేరన్నంతగా ఒంటరిని చేస్తుంటారు. ఇది జరగడానికి చాలా సమయం పడుతుంది. ఆ తర్వాత తమ ప్రతాపం చూపిస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి పనికీ తన అనుమతి తీసుకోవాలంటారు. జీవిత భాగస్వామికి మరో అవకాశం ఇవ్వకుండా ‘నేనే రాజు.. నేనే మంత్రి’లాగా ప్రవర్తిస్తుంటారు.

నేను మోనార్క్‌ని..!

కొన్ని రకాల మానసిక సమస్యలు ఉన్నవారు బయటకు సాధారణంగానే కనిపిస్తుంటారు. ఇలాంటివారిని గుర్తించడం కష్టం. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కూడా ఇతరులను మెంటల్‌ టార్చర్‌ చేస్తుంటారు. వీరు తమను తాము గొప్పగా ఊహించుకుంటారు. ఈ క్రమంలో ‘నేను తీసుకున్న నిర్ణయం సరైంది. నాకు చాలా విషయాలు తెలుసు’ అనుకుంటారు. ఈ క్రమంలో భాగస్వామి తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా వీరే తీసుకుంటారు. వారి వ్యక్తిగత జీవితంలోకి దూరి మరీ పట్టు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ జీవిత భాగస్వామికి తనపై ఆసక్తి తగ్గిందని భావిస్తే తనకంటే మంచి వ్యక్తి ఇంకొకరు లేరన్న భావనను సృష్టిస్తుంటారు. పరిస్థితి చేయిదాటితే ఇలాంటివారు అనేక రకాలుగా బెదిరించడానికి కూడా వెనుకాడరు.

మాట్లాడకుండా..

చాలామంది మాటలతోనే ఇతరులను వేధిస్తుంటారు. కానీ, కొంతమంది మాట్లాడకుండా కూడా వేధిస్తుంటారు. దీనినే ‘స్టోన్ వాలింగ్’ అంటారు. ఇలాంటి వారు ఇతరులతో పెద్దగా మాట్లాడరు. సీరియస్ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా సమాధానం చెప్పకుండా ముభావంగా ఉండడమో, మధ్యలోనే వెళ్లిపోవడమో చేస్తుంటారు. కొంతమంది మాటల మధ్యలో అక్కర్లేని విషయాల గురించి ప్రస్తావిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అసలు విషయం చెప్పకుండా ఆరోపణలు చేస్తుంటారు. ఇలాంటివారు తమ చేష్టలతో జీవిత భాగస్వామికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తారు.

✮ కొంతమంది చికాకు, ఒత్తిడిలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామిని తిడుతుంటారు. అయితే ఇది ఎప్పుడో ఒకసారి జరిగితే పర్లేదు. కానీ, తరచుగా ఇలా చేస్తుంటే అది కూడా మానసిక వేధింపుల కిందికే వస్తుంది.

✮ కొంతమంది తాము ఏ పనీ చేయకపోయినా జీవిత భాగస్వామి చేసే పనుల్లో తప్పులు వెతుకుతుంటారు. వాటి గురించి పదే పదే ప్రస్తావిస్తూ వారిని చులకన చేస్తుంటారు. ఇదీ మానసిక వేధింపుల్లో భాగమే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని