వాయేజర్‌-2 నుంచి అందుతున్న సంకేతాలు!

భూమి నుంచి వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో.. సౌర కుటుంబం అవతల పయనిస్తున్న అమెరికా వ్యోమనౌక వాయేజర్‌-2 నుంచి తిరిగి సంకేతాలు రావడం మొదలైంది.

Updated : 02 Aug 2023 05:47 IST

కేప్‌ కెనావెరాల్‌: భూమి నుంచి వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో.. సౌర కుటుంబం అవతల పయనిస్తున్న అమెరికా వ్యోమనౌక వాయేజర్‌-2 నుంచి తిరిగి సంకేతాలు రావడం మొదలైంది.  ఈ వ్యోమనౌకను నియంత్రించే అధికారులు రెండు వారాల కిందట పొరపాటున తప్పుడు ఆదేశం ఇచ్చారు. ఫలితంగా వాయేజర్‌-2 యాంటెన్నా.. భూమి దిశగా కాకుండా వేరే వైపునకు మళ్లింది. దీంతో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు ప్రపంచంలో పలు చోట్ల భారీ రేడియో యాంటెన్నాలు ఉన్నాయి. వాటికి తాజాగా వాయేజర్‌-2 నుంచి సంకేతం అందింది. దీంతో.. 46 ఏళ్ల నాటి ఆ వ్యోమనౌక ఇంకా పనిచేస్తోందని స్పష్టమవుతున్నట్లు నాసా పేర్కొంది. ఇప్పుడు ఆ వ్యోమనౌక యాంటెన్నాను తిరిగి భూమి వైపునకు తిప్పడానికి ప్రయత్నిస్తామని తెలిపింది.

సౌర కుటుంబంలోని గ్రహాలపై పరిశోధనలు సాగించేందుకు వాయేజర్‌-1, 2 వ్యోమనౌకలను 1977లో ప్రయోగించారు. వాయేజర్‌-1 ప్రస్తుతం భూమికి 24 బిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన వ్యోమనౌకగా అది గుర్తింపు పొందింది. ఇది ఇప్పటికీ పనిచేస్తోంది. వాయేజర్‌-2 ప్రస్తుతం 19 బిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉంది. అది పంపే సంకేతాలు భూమికి చేరడానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని