Updated : 23 Feb 2022 05:27 IST

Ukraine Crisis: రష్యాపై ఆంక్షల కత్తి

దొనెట్స్క్‌, లుహాన్స్క్‌లతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల్ని నిషేధించిన అమెరికా
రష్యా బ్యాంకులు, సంపన్నులకు బ్రిటన్‌ హెచ్చరికలు

వాషింగ్టన్‌, లండన్‌, బెర్లిన్‌: ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌, లుహాన్స్క్‌లను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించి, వాటిలోకి తన బలగాలను రష్యా పంపుతుండటంపై ప్రపంచ దేశాలు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. రష్యా వైఖరిని నిరసిస్తూ ఆ దేశంపై ఆంక్షల కత్తిని ఝళిపిస్తున్నాయి. ఆ దేశాన్ని ఆర్థికంగా, వాణిజ్యపరంగా ఏకాకిని చేసే చర్యలు ముమ్మరం చేశాయి. దొనెట్స్క్‌, లుహాన్స్క్‌లతో తమ దేశ పౌరులు, సంస్థలు ఎలాంటి వాణిజ్య సంబంధాలు నెరపకుండా అమెరికా నిషేధం విధించింది. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులపై సంతకం చేసినట్లు శ్వేతసౌధం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దుందుడుకు వైఖరిని మార్చుకోకుంటే మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు రష్యాకు చెందిన 5 ప్రముఖ బ్యాంకులు, ముగ్గురు సంపన్నుల కార్యకలాపాలపై బ్రిటన్‌ ఆంక్షలు విధించింది. జర్మనీ కూడా రష్యాకు వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి సహజ వాయువు సరఫరాకు ఉద్దేశించిన ‘నార్డ్‌ స్ట్రీమ్‌ 2’ గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఐరోపా సమాఖ్య(ఈయూ)లోని 27 సభ్య దేశాలు రష్యా అధికారులపై ఆంక్షల అమలుకు మంగళవారం ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. దొనెట్స్క్‌, లుహాన్స్క్‌లలోకి దళాలను పంపే నిర్ణయానికి ఆమోదం తెలిపిన రష్యా దిగువ సభ సభ్యులు, అధికారులపై ఆంక్షలు విధించినట్లు ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి జీన్‌-వెస్‌ లె డ్రియన్‌ తెలిపారు. ఈయూ సభ్య దేశాలతో రష్యా ఆర్థిక కార్యకలాపాలపైనా ఆంక్షలు విధించినట్లు ఈయూ విదేశీ విధానాల బాధ్యులు జోసెప్‌ బొరెల్‌ చెప్పారు. ఇవి తొలి దశ ఆంక్షలే అని, మున్ముందు మరిన్ని కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇదే దారిలో మరికొన్ని దేశాలూ రష్యాపై ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్నాయి.


వారి ఆస్తులు జప్తు చేస్తాం: బ్రిటన్‌

రష్యాకు చెందిన రొస్సియా, ఐఎస్‌ బ్యాంక్‌, జనరల్‌ బ్యాంక్‌, ప్రొమ్స్‌వ్యాజ్‌ బ్యాంక్‌, బ్లాక్‌ సీ బ్యాంకులతోపాటు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితులైన సంపన్నులు గెన్నడీ టించెంకో, బోరిస్‌ రొటెన్‌బర్గ్‌, ఇగోర్‌ రొటెన్‌బర్గ్‌పై బ్రిటన్‌ చర్యలు చేపట్టింది. ఆ ముగ్గురికి బ్రిటన్‌లో ఆస్తులు ఉంటే వాటిని జప్తు చేస్తామని పేర్కొంది. వారు బ్రిటన్‌కు రాకుండా నిషేధించనున్నట్లు తెలిపింది. వారితో బ్రిటన్‌ పౌరులు, సంస్థలు ఎలాంటి సంబంధాలు నెరపకుండా అడ్డుకుంటామని పేర్కొంది. రష్యాపై ఇవి తొలి విడత ఆంక్షలే అని, భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పార్లమెంటుకు తెలిపారు. మరోవైపు రష్యా రాయబారిని పిలిపించి బ్రిటన్‌ విదేశాంగ శాఖ కార్యాలయం నిరసన వ్యక్తం చేసింది.


‘నార్డ్‌ స్ట్రీమ్‌ 2’ గ్యాస్‌ పైప్‌లైన్‌ను ధ్రువీకరించం: జర్మనీ

రష్యా నుంచి తమ దేశానికి సహజవాయువును తీసుకురావడానికి నిర్మించతలపెట్టిన ‘నార్డ్‌ స్ట్రీమ్‌ 2’ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు ధ్రువీకరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌, లుహాన్స్క్‌లను స్వతంత్ర ప్రాంతాలుగా ప్రకటించిన రష్యా వైఖరికి నిరసనగానే ఈ చర్య తీసుకున్నట్లు జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ షోల్స్‌ తెలిపారు. రష్యా అసంబద్ధ చర్యలకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ప్రపంచ దేశాలు స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.


Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని