ఐరోపా, అమెరికాలో మంకీపాక్స్‌ కలకలం

ఐరోపా, అమెరికాలో మంకీపాక్స్‌ కలకలం సృష్టిస్తోంది. తొలి కేసు బయటపడిన బ్రిటన్‌ నుంచి ఈ వ్యాధి వివిధ దేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తోంది. గతవారం స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో

Updated : 21 May 2022 08:08 IST

స్పెయిన్‌లో 23, బ్రిటన్‌లో 20 కేసులు 

అప్రమత్తమైన భారత్‌

లండన్‌: ఐరోపా, అమెరికాలో మంకీపాక్స్‌ కలకలం సృష్టిస్తోంది. తొలి కేసు బయటపడిన బ్రిటన్‌ నుంచి ఈ వ్యాధి వివిధ దేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తోంది. గతవారం స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కూడా ఈ జాబితాలో చేరిపోయాయి. బ్రిటన్‌లో కేసుల సంఖ్య ఏకంగా 20కు చేరుకుంది. స్పెయిన్‌లోనూ ఇప్పటివరకు 23 కేసులు వెలుగులోకి వచ్చాయి. ‘‘అధిక కేసుల్లో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. మంకీపాక్స్‌ను నిరోధించే టీకాలను తెప్పించుకున్నాం’’ అని యూకే ఆరోగ్య మంత్రి సాజిద్‌ జావిద్‌ తెలిపారు. సాధారణంగా మంకీపాక్స్‌ కేసులు ఆఫ్రికాకు పరిమితమవుతాయి. అరుదుగా ఇతర ప్రాంతాలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. బ్రిటన్‌లో నమోదైన తొలి కేసుకు సంబంధించిన మూలాలు నైజీరియాలో ఉన్నాయి. తాజా కేసులకు ఆఫ్రికాతో సంబంధం లేకపోవడం.. శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివిధ దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ‘‘మంకీపాక్స్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చే అనారోగ్య ప్రయాణికులను ఐసోలేషన్‌ చేసి వారి నమూనాలను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలోని బీఎస్‌ఎల్‌-4కు పంపాలని వారికి ఆదేశాలిచ్చాం’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయా వెల్లడించారు.  

సంభోగంతో సోకుతుందా..! 

ఆఫ్రికాతో సంబంధం లేని ఓ యువకుడికి ఈ వ్యాధి సోకిన నేపథ్యంలో.. ఇది లైంగికంగా ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతోందన్న అనుమానాలను బ్రిటన్‌ ఆరోగ్య ఆధికారులు వ్యక్తం చేశారు. యువకుడు స్వలింగ సంపర్కుడు అని, ఇటీవలే ఓ మగాడితో శృంగారం చేశాడని చెబుతున్నారు. స్పెయిన్, పోర్చుగల్‌ కూడా యువకులకే ఈ వ్యాధి సోకిందని పేర్కొన్నాయి. ఇతర మగాళ్లతో ఆ యువకులు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నారని వెల్లడించాయి.

ఏమిటీ మంకీపాక్స్‌

మశూచి లాంటిదే. 1958లో ప్రయోగశాలలోని కోతుల్లో దీన్ని కనుగొన్నారు. అందుకే మంకీపాక్స్‌ అని పేరు పెట్టారు. మానవుల్లో తొలి కేసు 1970లో నమోదైంది. మధ్య, పశ్చిమ ఆఫ్రికాకే పరిమితమైన వ్యాధిది. అరుదుగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. జ్వరం, ముఖంపై దద్దుర్లు, ఒళ్లునొప్పులతో ఇది ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలు 2 నుంచి 4 వారాల వరకు ఉంటాయి.  తాజా వ్యాప్తిలో ఎక్కడా మరణాలు సంభవించలేదు.

ఎలా సోకుతుందంటే..

వ్యాధి సోకిన జంతువు కరిచినా, ఈ ఇన్‌ఫెక్షన్‌కు గురైన మానవుడి రక్తం, శరీర స్రావాలను తాకినా ఇది సోకుతుంది. తుంపర్లతోనూ వ్యాపిస్తుంది. ఎలుకలు, చిట్టెలుకలు, ఉడతల ద్వారా కూడా సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా.. ఈ వ్యాధి అంటుకొనే ప్రమాదం ఉంది. మశూచి టీకాలే మంకీపాక్స్‌ నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పది మందిలో ఒకరు మాత్రమే చనిపోయే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని