‘మరణావస్థ’లో భారీ నక్షత్రం

ప్రకృతిలో ఏదీ శాశ్వతం కాదు. రాత్రిపూట నింగిలో మెరిసే తారలూ ఏనాటికైనా నశించిపోవలసిందే. మనకు కనిపించే నక్షత్రాల్లో అత్యంత ప్రకాశవంతమైన తార బెటెల్‌ గ్యూస్‌. 2019లో దాని కాంతి భారీగా మందగించింది. దీంతో అది త్వరలో పేలిపోవచ్చని

Published : 17 Aug 2022 05:59 IST

మెల్‌బోర్న్‌: ప్రకృతిలో ఏదీ శాశ్వతం కాదు. రాత్రిపూట నింగిలో మెరిసే తారలూ ఏనాటికైనా నశించిపోవలసిందే. మనకు కనిపించే నక్షత్రాల్లో అత్యంత ప్రకాశవంతమైన తార బెటెల్‌ గ్యూస్‌. 2019లో దాని కాంతి భారీగా మందగించింది. దీంతో అది త్వరలో పేలిపోవచ్చని 2019లో శాస్త్రవేత్తలు భావించారు. అప్పట్లో ఆ తార ఉపరితలం మీదున్న ద్రవ్యరాశి (ప్లాస్మా)లో సింహభాగం పేలిపోయి చుట్టుపక్కలకు విరజిమ్మడం వల్లే కాంతి మందగించిందని హబుల్‌ టెలిస్కోపు సాయంతో అమెరికన్‌ శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధారించారు. బెటెల్‌ నక్షత్ర బాహ్య వలయంలో అయస్కాంత క్షేత్రాలు అస్థిరతే దీనికి కారణమని తేల్చారు. ఆ పేలుడు కారణంగా ఆ నక్షత్రం తన ఉపరితల ద్రవ్యరాశిలో చాలా భాగాన్ని కోల్పోయింది. ఇలాంటి విస్ఫోటాలు ఇతర తారల్లోనూ సంభవిస్తాయి కానీ, వాటన్నింటికంటే 40వేల రెట్ల ఎక్కువ ద్రవ్యరాశిని బెటెల్‌ గ్యూస్‌ విరజిమ్మింది. ఇలాంటి విస్ఫోటాన్ని శాస్త్రజ్ఞులు మునుపెన్నడూ ప్రత్యక్షంగా వీక్షించలేదు.

బెటెల్‌ నక్షత్రం 400 రోజులకు ఒకసారి ప్రకాశవంతమవుతుంది, వెంటనే వెలుగు తగ్గుతుంది. పేలుడులో ద్రవ్యరాశి హరించుకుపోవడమే దీనికి కారణం. 200 సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు ఈ పరిణామాన్ని గమనిస్తున్నారు. ఉపరితల ద్రవ్యరాశి క్షీణత.. బెటెల్‌ తార అంతర్గత ప్రకంపనలను వేగవంతం చేస్తోంది. ఈ నక్షత్రం తన చరమాంకాన్ని చేరుకుంటున్నా అది ‘సూపర్‌నోవా’గా భారీ పేలుడుతో అంతం కావడానికి ఇంకా వేల సంవత్సరాలు పడుతుంది. ఆ మహా విస్ఫోటనాన్ని మనం భూమి నుంచి పగటిపూట కూడా చూడవచ్చు. అయితే బెటెల్‌ పేలిపోయిన 640 సంవత్సరాల తరవాత కానీ ఆ ఘటనను మనం చూడలేం. అక్కడి నుంచి బయలుదేరిన కాంతి భూమికి చేరడానికి అంతకాలం పడుతుందన్నమాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని