రష్యా వైమానిక స్థావరంపై దాడులకు మా సహకారం లేదు

రష్యా వ్యూహాత్మక బాంబర్లను నిలిపిన కుర్క్స్‌ ప్రాంతం సహా మూడు వైమానిక స్థావరాలపై దాడులు చేసేలా ఉక్రెయిన్‌కు తాము సహకరించలేదని అమెరికా వెల్లడించింది.

Published : 08 Dec 2022 05:32 IST

అమెరికా స్పష్టీకరణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా వ్యూహాత్మక బాంబర్లను నిలిపిన కుర్క్స్‌ ప్రాంతం సహా మూడు వైమానిక స్థావరాలపై దాడులు చేసేలా ఉక్రెయిన్‌కు తాము సహకరించలేదని అమెరికా వెల్లడించింది. ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఈ విషయాన్ని స్పష్టంచేశారు. తమ వైమానిక స్థావరాలపై డ్రోన్‌ దాడి కీవ్‌ పనే అని రష్యా ఆరోపించిన కొద్దిసేపటికే అమెరికా నుంచి ప్రతిస్పందన రావడం గమనార్హం. తాము ఈ దాడులకు సాయంగానీ, ప్రోత్సాహంగానీ అందించలేదని బ్లింకెన్‌ పేర్కొన్నారు. అదే సమయంలో ఉక్రెయిన్‌లో రష్యా దాడులను ఆయన తప్పుపట్టారు. ప్రజలకు అవసరమైన వెచ్చదనం, నీరు, విద్యుత్తు అందించే వ్యవస్థలపై రష్యా దాడులు చేస్తోందని ఆరోపించారు. శీతాకాలాన్ని మాస్కో ఆయుధం వలే ఉపయోగిస్తోందని ఆరోపించారు. ‘‘రష్యా భూభాగాల్లో ఉక్రెయిన్‌ దాడులను మేము ప్రోత్సహించడం లేదు. సహకరించడమూ లేదు. ఉక్రెయిన్‌పై వరుస దాడులతో అక్కడి ప్రజలు జీవితం ఎలా ఉంటోందో అర్థం చేసుకోవాలి. ఆత్మరక్షణకు, భూభాగాన్ని కాపాడుకోవడానికి, వారి స్వేచ్ఛను రక్షించుకోవడానికి అవసరమైన ఆయుధ సంపత్తి ఉక్రెయిన్‌ వాసుల వద్ద ఉంది’’ అని బ్లింకెన్‌ చెప్పారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ దీర్ఘశ్రేణి ఆయుధాలను అభివృద్ధి చేసుకుంటే తమ దేశం అడ్డుకోదని పేర్కొన్నారు. ‘‘ఒక్క ముక్కలో చెప్పాలంటే.. మాకు సంబంధంలేదు. మేమైతే కచ్చితంగా చేయలేదు’’ అని ఆస్టిన్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని