India-UK FTA: ‘కభీ ఖుషీ కభీ గమ్‌’: భారత్‌తో చర్చలపై యూకే నేత ఆసక్తికర వ్యాఖ్యలు

India-UK FTA:భారత్‌- బ్రిటన్‌ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం (FTA)పై సాగుతోన్న చర్చల తీరును బ్రిటన్‌ (Britain) ప్రతిపక్ష నేత ఒకరు ఓ బాలీవుడ్‌ సినిమాతో పోల్చారు. ‘కభీ ఖుషీ కభీ గమ్‌’లా ఈ ప్రక్రియ సాగుతోందన్నారు.

Published : 21 Nov 2023 18:50 IST

లండన్‌: భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (FTA) సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో అనుకూల, ప్రతికూల పరిణామాలను యూకే(UK) నేత ఒకరు బాలీవుడ్ సూపర్‌ హిట్‌తో పోల్చారు. ‘కభీ ఖుషీ కభీ గమ్‌(కొన్నిసార్లు ఆనందం.. కొన్నిసార్లు బాధ)’ అంటూ అభివర్ణించారు. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన దీపావళి వేడుకల్లో భాగంగా చేసిన ప్రసంగంలో ఈ ఒప్పందం గురించి లేబర్ పార్టీ నేత కీర్ స్టామర్ మాట్లాడారు.

‘ప్రపంచ వేదికపై బ్రిటన్(Britain) ఖ్యాతిని మళ్లీ చాటి చెప్తాం. భారత్‌తో సరికొత్త వ్యూహాత్మక భాగస్వామ్యంతో అది సాధ్యమవుతుంది. టోరీ నేతలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(Free Trade Deal) దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని భావిస్తున్నాను. ఆ చర్చలు సాగుతూ..ఆగుతూ నడుస్తున్నాయి. ఆ ప్రక్రియను మనం కభీ ఖుషీ కభీ గమ్‌ అని పిలవొచ్చు. కానీ లేబర్ పార్టీ(ప్రతిపక్ష పార్టీ) అంతకంటే ఎక్కువగా కోరుకుంటోంది. రెండుదేశాల మధ్య బంధంలో మరింత అవగాహన ఉండాలని కోరుకుంటాం. ఎల్లప్పుడూ సంతోషకర ద్వైపాక్షిక సంబంధాన్ని కలిగిఉండేందుకు మా పార్టీ కట్టుబడి ఉంది. ప్రజాస్వామ్యం, ఆకాంక్షలు, గౌరవం వంటి  పరస్పర విలువలపై ఈ బంధం ఆధారపడి ఉంటుంది’ అని ప్రతిపక్ష నేత కీర్ స్టామర్ వ్యాఖ్యానించారు. 

రన్‌వే నుంచి అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం..!

ఏఫ్‌టీఏ(FTA) చర్చలు గతేడాది జవవరిలో ప్రారంభం కాగా.. అదే ఏడాది దీపావళికి ఒప్పందంపై ఒక కొలిక్కి రావాలని అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ గడువు విధించారు. కానీ అనుకున్న ప్రకారం అది జరగలేదు. తర్వాతి టోరీ ప్రధాని రిషి సునాక్‌ నేతృత్వంలో కొత్తగా డెడ్‌లైన్ ఏదీ విధించనప్పటికీ.. వచ్చే ఏడాది భారత్‌, యూకేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోగా దీనిపై అవగాహనకు రావాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. 

ఇటీవల జీ20 సదస్సు సందర్భంగా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి చర్చ జరిగింది.చారిత్రాత్మకంగా నిలిచిపోయే రీతిలో సాధ్యమైనంత త్వరగా ఈ ఒప్పందం కుదుర్చుకునేందుకు కలిసి అడుగులు వేయాలని భారత ప్రధాని నరేంద్రమోదీ, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ఆశిస్తున్నారు. ఎఫ్‌టీఏలో భాగంగా వస్తువులకు సుంకం మినహాయింపుతో పాటు ఐటీ, హెల్త్‌కేర్‌ రంగాల్లో ఎక్కువ అవకాశాలను భారత్‌ ఆశిస్తోంది. అదే సమయంలో స్కాచ్‌ విస్కీ, ఆటోమొబైల్స్‌, గొర్రె మాంసం, చాక్లెట్లు వంటి ఉత్పత్తులపై దిగుమతి సుంకంపై యూకే మినహాయింపులు కోరుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని