Black Sea: రష్యాకు ఎదురుదెబ్బ.. నౌకాదళ కమాండర్‌ సహా 34 మంది మృతి!

సెవెస్తపోల్‌లోని రష్యా నల్ల సముద్ర నౌకాదళ ప్రధాన కేంద్రంపై ఉక్రెయిన్‌ ఇటీవల క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో ఇక్కడి నౌకాదళ కమాండర్‌ మృతి చెందినట్లు కీవ్ తెలిపింది.

Published : 26 Sep 2023 02:13 IST

కీవ్‌: రష్యా ఆక్రమిత క్రిమియా (Crimea)పై కొంత కాలంగా వరుస దాడులు చేపడుతూ వచ్చిన ఉక్రెయిన్‌.. ఇటీవల ఏకంగా సెవెస్తపోల్‌లోని మాస్కో నల్ల సముద్ర నౌకాదళ ప్రధాన కేంద్రంపైనే క్షిపణి ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో రష్యా నల్ల సముద్ర నౌకాదళ (Russia Black Sea Fleet) కమాండర్‌ హతమైనట్లు కీవ్‌ ప్రత్యేక బలగాలు తాజాగా ప్రకటించాయి. ‘ఇటీవల జరిపిన దాడిలో రష్యా నల్ల సముద్ర నౌకాదళ కమాండర్‌ సహా 34 మంది అధికారులు మృతి చెందారు. మరో 105 మంది గాయపడ్డారు. నౌకాదళ ప్రధాన కేంద్రం కోలుకోలేని విధంగా ధ్వంసమైంది’ అని పేర్కొన్నాయి.

ఒడెస్సా పోర్టులో రష్యా భారీ విధ్వంసం..!

క్రిమియాలో రష్యాకు ‘సెవెస్తపోల్‌’ ప్రధాన నౌకాస్థావరం. ఉక్రెయిన్‌పై నౌకాదళ దాడులను రష్యా ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తోంది. నల్ల సముద్రంపై మాస్కోకు తిరుగులేని ఆధిపత్యం అందించిన ఈ నౌకాశ్రయం.. కొంతకాలంగా ఉక్రెయిన్‌ దాడులకు లక్ష్యంగా మారింది. సముద్ర డ్రోన్లు, క్షిపణులతో కీవ్‌ విరుచుకుపడుతోంది. ఇటీవల చేపట్టిన ఓ దాడిలో రష్యాకు చెందిన రెండు నౌకలతోపాటు ఒక సబ్‌మెరైన్‌ దెబ్బతింది. శుక్రవారం ఓ క్షిపణి దాడిలో నౌకాదళ కేంద్ర కార్యాలయం మంటల్లో చిక్కుకుంది. ఈ దాడి విషయాన్ని రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. మరోవైపు.. కీవ్‌ తాజా ప్రకటనపై రష్యా స్పందించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని