తల్లి గర్భంలోనే శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స.. అమెరికా వైద్యుల ఘనత

ఇంకా భూమ్మీదకు అడుగుపెట్టని ఓ శిశువు ప్రాణాలను అమెరికా వైద్యులు(US Doctors) కాపాడారు. అరుదైన శస్త్రచికిత్స చేసి, వైద్యరంగంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. 

Published : 05 May 2023 20:29 IST

వాషింగ్టన్: అమెరికా వైద్యులు(US Doctors) అరుదైన ఘనత సాధించారు. తల్లి గర్భంలోని శిశువు(Baby Still In Womb) మెదడుకు చికిత్స( Brain Surgery ) చేశారు. ప్రపంచంలోనే ఈ తరహా ఆపరేషన్ ఇదే తొలిసారి కావడం విశేషం. బోస్టన్‌లోని పిల్లల ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు స్ట్రోక్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

సాధారణ వైద్యపరీక్షల్లో భాగంగా తల్లిగర్భంలోని 30 వారాల శిశువు మెదడులో ఉన్న సమస్యను వైద్యులు గుర్తించారు. మెదడులో అరుదైన రక్తనాళాల సమస్య వారి దృష్టికి వచ్చింది. ఆ అనారోగ్యాన్ని " Vein of Galen Malformation (VOGM)’’ అంటారు. దాంతో బాధపడే శిశువు గుండె వైఫల్యం లేక మెదడు దెబ్బతినడం జరుగుతుంది. చాలావరకు ఇలాంటి కేసుల్లో జీవించడం అరుదు. మెదడు నుంచి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు సరిగా అభివృద్ధి చెందకపోతే ఈ పరిస్థితి వస్తుంది. ‘ఈ సమస్యతో జన్మించినవారిలో 50 నుంచి 60 శాతం మంది వెంటనే అనారోగ్యానికి గురవుతారు. బిడ్డపుట్టగానే మెదడు, గుండె వైఫల్యానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందులో 40 శాతం మంది చనిపోయే అవకాశం ఉంటుంది’ అని బోస్టన్‌ పిల్లల ఆసుపత్రి వైద్యనిపుణులు తెలిపారు. ఆ శిశువును ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్న వైద్య బృందం.. 34 వారాల ఆ గర్భస్థ శిశువుకు శస్త్రచికిత్స నిర్వహించి, విజయవంతమైంది. కొద్దిరోజులకు బిడ్డ జన్మించిందని, పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉందని తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని