Huzurabad By Election: నువ్వా... నేనా..!

ప్రధానాంశాలు

Huzurabad By Election: నువ్వా... నేనా..!

పార్టీలకు ప్రతిష్ఠాత్మకం.. నేతలకు కీలకం
హుజూరాబాద్‌లో తెరాస.. భాజపా పోటాపోటీ ప్రచారం
రేపు కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో ఆసక్తికర రాజకీయ సమరానికి తెరలేచింది. ప్రధాన పార్టీల ప్రతిష్ఠాత్మక పోరుకు హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గం వేదిక కానుంది. ఇప్పటికే మూడు నెలలుగా ఇక్కడ రాజకీయ సందడి నెలకొంది. తెరాస, భాజపా అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.షెడ్యూల్‌ కూడా విడుదలవడంతో ప్రధాన పార్టీలు జోరు పెంచనున్నాయి. ఈ నియోజకవర్గానికి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన మాజీమంత్రి ఈటల రాజేందర్‌ భాజపా అభ్యర్థిగా బరిలో దిగనుండగా, తెరాస విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను పోటీలో దింపింది. కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. మాజీమంత్రి ఈటల జులై 12న రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక జరుగుతోంది. తొలిసారిగా ఇక్కడ పాగా వేయాలని భాజపా ప్రయత్నిస్తుండగా 2004 నుంచి వరుసగా నెగ్గుతున్న తెరాస పార్టీ పట్టు నిలుపుకోవడంతోపాటు ఈటల ఓటమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. సత్తా చాటాలని కాంగ్రెస్‌ చూస్తోంది. కొన్ని నెలలుగా ఎన్నికల ప్రచారం సాగుతుండటంతో ‘ఖరీదైన ఎన్నిక’ అని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నాగార్జునసాగర్‌ తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

నియోజకవర్గంలోనే ఈటల

తెరాసకు రాజీనామా అనంతరం భాజపాలో చేరిన మాజీమంత్రి ఈటల రాజేందర్‌ మూడు నెలలుగా భాజపా శ్రేణులతో కలసి ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంతో ఉన్న అనుబంధం, నేతలతో సాన్నిహిత్యం, వ్యక్తిగత పరిచయాల ప్రాతిపదికగా ముందుకు వెళ్తున్నారు. తాను చేసిన అభివృద్ధితో పాటు కేంద్ర పథకాలను ప్రస్తావిస్తున్నారు. భాజపా ముఖ్యనేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జిగా వ్యహరిస్తున్నారు. అక్టోబరు 2న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామయాత్రను ముగించనుండగా ఇందులో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పాల్గొననున్నారు.

సామాజిక సమీకరణాలపై దృష్టి  

ఇక్కడ అత్యధికంగా మాదిగ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉండగా తర్వాతి స్థానంలో రెడ్డి సామాజికవర్గం ఓటర్లు ఉన్నారు. ఈడిగ, మున్నూరుకాపు, ముదిరాజ్‌, పద్మశాలి, యాదవ కులానికి చెందిన ఓటర్లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీటిని అనుసరించి పార్టీలు వ్యూహాలను రూపొందిస్తున్నాయి.

2004 నుంచి తెరాస విజయాలు

2004 నుంచి జరుగుతున్న ప్రతి ఎన్నికలోనూ తెరాస విజయం సాధిస్తూ వచ్చింది. 2004, 2008 ఉప ఎన్నికల్లో తెరాస ముఖ్యనేత కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు గెలుపొందగా, 2009 నుంచి 2018 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో నాటి తెరాస అభ్యర్థి ఈటల విజయం సాధించారు.


ముగ్గురు మంత్రుల సారథ్యం  

రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చాక దుబ్బాక మినహా మిగిలిన అన్ని ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. అదే పరంపర కొనసాగించాలని ఆ పార్టీ సంకల్పిస్తోంది. అభ్యర్థిగా విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ప్రకటించింది. ఇప్పటికే బలాలన్నింటిని మోహరించింది. గ్రామాల్లో ప్రచారం పూర్తయింది. సామాజికవర్గాలవారీగా కార్యాచరణ చేపట్టింది. కొత్తగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం కింద ప్రభుత్వం ఒక్కో ఎస్సీ కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున వారి ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ పథకంపై తెరాసకు భారీ ఆశలున్నాయి. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ మూడు నెలలుగా అక్కడే ఉంటున్నారు. వీరితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్‌ తదితరులు మండలాలకు బాధ్యులుగా ఉన్నారు. గతంలో హుజూరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన మాజీమంత్రి పెద్దిరెడ్డి, మరో మాజీమంత్రి ఎల్‌.రమణ, కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి తదితర నేతలను పార్టీలో చేర్చుకుంది. వచ్చే నెల 15 తర్వాత సీఎం, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు రెండు మూడు రోజులు పర్యటించే అవకాశం ఉంది.


ముగ్గురి పేర్లు ఏఐసీసీకి..

ఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ నేతృత్వంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా ఇతర ముఖ్యనేతలు ఉప ఎన్నికపై జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. పాడి కౌశిక్‌రెడ్డి పార్టీకి దూరం కావడంతో పీసీసీ ప్రత్యేక దృష్టిసారించింది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహాకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. మండలాలవారీగా సమావేశాలను నిర్వహించింది. టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 19 మందిలో మూడు పేర్లను రాజనర్సింహా, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలోని కమిటీ ఏఐసీసీకి పంపినట్లు తెలిసింది. డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆ పార్టీ కిసాన్‌సెల్‌ నేత పత్తి కృష్ణారెడ్డి, బీసీ వర్గానికి చెందిన రమేష్‌ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మాజీమంత్రి కొండా సురేఖను బరిలో దింపే అంశంపైనా చర్చ జరుగుతోంది. ఈనెల 30న కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది.


 Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని