దంచి కొట్టిన వాన

ప్రధానాంశాలు

దంచి కొట్టిన వాన

హైదరాబాద్‌లో కాలనీల మునక, ట్రాఫిక్‌ జాం
గ్రామాల్లో దెబ్బతిన్న పంటలు
నేడూ పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం

ఈనాడు, ఈనాడు డిజిటల్‌- హైదరాబాద్‌: అకస్మాత్తుగా..అనూహ్యంగా శనివారం కురిసిన భారీవర్షాలతో ప్రజలు అవస్థలు పడ్డారు. బంగాళాఖాతంలో రెండురోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం తీరం దాటి తెలంగాణపై నుంచి వెళ్తూ హైదరాబాద్‌ సహా పలుచోట్ల కుంభవృష్టి కురిపించింది. ఆదివారం కూడా ఆదిలాబాద్‌, కుమురంభీం తదితర ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఆదివారానికి అల్పపీడనం తెలంగాణ దాటి మహారాష్ట్ర వైపు వెళ్లిపోతుంది. సోమవారం నుంచి రెండు రోజుల పాటు పెద్దగా వర్షాలేమీ పడవని ఆమె చెప్పారు.

రాజధాని అతలాకుతలం

రాజధానిలో కుండపోత వాన  మరోసారి బీభత్సం సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి చిరుజల్లులుగా మొదలై శనివారం మధ్యాహ్నానికి జోరువానగా మారింది. భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాలాలు, డ్రైనేజీలు పొంగి రోడ్లు చెరువుల్ని తలపించాయి. దిల్‌సుఖ్‌నగర్‌, కమలానగర్‌, చింతలకుంట, ఎల్‌బీ నగర్‌ ప్రాంతాల్లో రోడ్డుపై నిలిపిన ద్విచక్రవాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మూసారాంబాగ్‌ వంతెన పైనుంచి వరద పారడంతో కొంతసేపు రాకపోకలు ఆగిపోయాయి. జంట జలాశయాలకు భారీగా వరద చేరుతోంది. పలుచోట్ల డ్రైనేజీల మూతలు నిర్లక్ష్యంగా తెరిచి ఉంచడంతో ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

నీటమునిగిన పంటలు

భారీ వర్షం వల్ల జిల్లాల్లో చాలా చోట్ల పంటలు నీటమునిగాయి. వరి, పత్తి, మొక్కజొన్న తదితర అనేక పంటలు ఇప్పుడు పూత, కాత, కోత దశలో ఉన్నాయి. ఈ దశలో కొద్దిగంటల్లో భారీ వర్షం పడటం వల్ల పంటలకు నష్టం ఎక్కువగా ఉంటుందని రైతులతో పాటు వ్యవసాయాధికారులు సైతం తెలిపారు. నగరం చుట్టుపక్కల రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లో కూరగాయల పంటలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. వర్షాలకు పూత, కాత రాలిపోయి ఈ పంటలకు నష్టం ఎక్కువగా ఉంది. పంట నష్టాలపై వ్యవసాయశాఖ ఎలాంటి అంచనాలు వేయనందున ఎన్ని ఎకరాల్లో దెబ్బతిన్నాయనే వివరాలను అధికారికంగా వెల్లడించడం లేదు. వర్షం వల్ల విద్యుత్‌ డిమాండు గణనీయంగా తగ్గింది. శనివారం సాయంత్రం 8 వేల మెగావాట్ల గరిష్ఠ డిమాండు ఉంది.


జడ్చర్లలో ఒకరిని మింగిన నాలా

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఓ వ్యక్తి నాలాలో కొట్టుకుపోయి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో నాలాలు పొంగిపొర్లాయి. పట్టణంలోని వాల్మీకీనగర్‌ కాలనీకి చెందిన మతిస్థిమితం సరిగా లేని రాఘవేందర్‌ (35) నాలాలో పడి కొట్టుకుపోయాడు. నాలాలు కబ్జాకు గురై వర్షం వచ్చిన ప్రతిసారీ కాలనీలు జలమయమవుతున్నాయని.. కాలనీవాసులు రాస్తారోకో చేపట్టారు.Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని