చెరగని చురకల సంతకం

తాజావార్తలు

చెరగని చురకల సంతకం
చో రామస్వామి (1934 - 2016)
చో రామస్వామి- నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, న్యాయవాదిగా బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘తుగ్లక్‌’ సంపాదకుడిగా, రాజకీయ విమర్శకుడిగా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయా రాజకీయ నాయకులు, పార్టీల స్థితిగతులు, భవిష్యత్తు, వారు కుదుర్చుకోబోయే పొత్తులు, మార్చనున్న మాటల మీదా ‘చో’ వేసిన అంచనాలు, చేసిన విమర్శలు- వాటిలోని చమత్కారం, ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేనివారికీ ఆసక్తి కలిగిస్తాయి, నవ్విస్తాయి.

‘మాస్‌’ భాషలో చెప్పాలంటే పంచ్‌! ఎంతో అనుభవం, సమాజం మీద ప్రేమ, ధర్మచింతన, అన్నింటికీ మించి అపారమైన శబ్దజ్ఞానం ఉంటే తప్ప- అలా మాట్లాడటం కుదరదు. ఆయనలోని రచయిత, రాజకీయ విశ్లేషకుడు ఎప్పడూ కలిసే ఉండేవారు. కలిసే బయటికి వచ్చేవారు. ఇందుకు ఉదాహరణలెన్నో... ఆయనలో ఉన్న ఈ ఇద్దరి గురించి చెప్పాలంటే- రాజకీయ విశ్లేషకుడిగా పూర్తిస్థాయిలో ఎదగక ముందు నుంచీ, నటుడిగా జీవితం ప్రారంభించినప్పటి నుంచీ ఆయన రాసుకున్న మాటల గురించి చెప్పాలి.

నాటకాల్లో కానివ్వండి, సినిమాల్లో కానివ్వండి- ఆయా రచయితలు, దర్శకులు చెప్పిన డైలాగుల్ని ఆయన ఎన్నడూ యథాతథంగా చెప్పలేదు. వాటికి తన సొంత అభిప్రాయాల్ని, భావజాలాన్ని సంభాషణల రూపంలో జోడించి, అక్కడికక్కడ ఆశువుగా చెప్పేవారు. ఎవరికీ భయపడేవారు కారు. అలా కొన్ని దశాబ్దాల క్రితమే సినిమాల్లో, నాటకాల్లో ఆయన పలికించిన చమత్కారం నేటికీ సమాజానికి వర్తించేలా ఉంటుంది. నవ్వు తెప్పిస్తుంది.

‘ఒక సాధారణ పౌరుడిగా చెప్తున్నా విను. బడ్జెట్‌ వేయడంవల్ల ఏ ప్రయోజనం ఉండదు. అది వూరికే పేపర్‌ మీద... అంతే. బడ్జెట్‌ వేస్తే దాని ప్రకారం అంతా జరిగిపోతుందని కలలు కనకు’

‘జనం గొడవల్లేకుండా కలిసికట్టుగా ఉన్నారంటే, అది సమాజానికి మంచిది కాదు. వెంటనే అక్కడ ఎన్నికలు పెట్టిస్తే సరి. ఎందుకంటే, ఎన్నికలు పెడితే గొడవలొస్తాయి. ఆ గొడవలు తీర్చడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుణ్ని ఎంపిక చేసుకోవడానికి మళ్లీ ఎన్నికలు కావాలి. అందుకే ఒక చిన్న కాలనీ నుంచీ దేశం దాకా- ఎన్నిక అనేది ఓ నిత్యావసర వస్తువు!’

చో రాసిన ‘జడ్జిమెంట్‌ రిజర్వ్‌డ్‌’, ‘తుగ్లక్‌’- రాజకీయ రంగంపై భారతీయ సాహితీ చరిత్రలో వచ్చిన అత్యుత్తమ హాస్య, వ్యంగ్య నాటకాలని చెప్పాలి.

‘జడ్జిమెంట్‌ రిజర్వ్‌డ్‌’లో ఒక మరపురాని సన్నివేశం ఇది- కానిస్టేబుల్‌గా పనిచేసి రిటైరైన ఏడుకొండలు (ఏళుమలై) పాలిటిక్స్‌లో చేరానంటూ చో దగ్గరికి వస్తాడు. ‘నీకేం అనుభవం ఉందని పాలిటిక్స్‌లో చేరావయ్యా?’ అని అడుగుతాడు చో. ‘అదేంటి... అంత మాటనేశారు? పాలిటిక్స్‌కు సంబంధించి ఏదన్నా కొచ్చన్‌ వేయండి. టకటకా సమాధానం చెప్తాను’ అంటాడు ఏడుకొండలు.

‘అవునా? సరే... అసెంబ్లీలో ఎంతమంది సభ్యులు ఉంటారు?’
‘పాలిటిక్స్‌ గురించి అడగండి అంటే, ఏదేదో అడుగుతారేంటి?’
‘ఓహో... అసెంబ్లీ అంటే పాలిటిక్స్‌ కాదా? సరే. ఎమ్మెల్యే బాధ్యతలేంటి?’
‘ఏంటి సార్‌? పాలిటిక్స్‌ గురించి అడగమంటున్నా కదా... సంబంధం లేని ప్రశ్నలేస్తే ఎలా?’
‘ఓ...ఇది కూడా పాలిటిక్స్‌ కాదా? ఓకే... వడపళని దగ్గర ఎవరు సారా కాస్తున్నారో తెలుసా?’
‘ఆ...ఆ... ఇప్పుడు మీరు పాలిటిక్స్‌కు సంబంధించిన కొచ్చన్‌ వేశారు. వెరీ గుడ్‌. చెప్తా వినండి... నాకు పాలిటిక్స్‌లో చాలా నాలెడ్జ్‌ ఉంది...’- ఆ సన్నివేశానికి ఇప్పటికీ చప్పట్లు మారుమోగుతాయనడంలో సందేహం లేదు.

రాజకీయ రంగంలో జరగబోయేవి ఆయన ముందుగానే విశ్లేషించిన సందర్భాలెన్నో ఉన్నాయి. భాజపాకు మోదీ నాయకత్వం వహిస్తారని, ప్రధానమంత్రి అయ్యే అర్హతలన్నీ ఆయనకు ఉన్నాయని అందరికన్నా ముందు చెప్పింది రామస్వామే! ఒక్క రాజకీయాల్లోనే కాదు, కళారంగంలోనూ ఆయన జోస్యం ఫలించిన సందర్భాలెన్నో ఉన్నాయి. 1964వ సంవత్సరంలో ‘అండర్‌ సెక్రెటరీ’ అనే నాటకంలో జయలలితతో కలిసి నటించారాయన. ఆ సమయంలో ఆమె పుస్తక పఠనం అలవాటు చూసి, ఆమె అప్పటికే పలు అంశాల మీద మాట్లాడుతున్న తీరు చూసి, చో ఆ రోజే చెప్పారట... ‘నువ్వు నటనను మించి ఎదుగుతావు. నువ్వు ఎదగడాన్ని ఆపడం ఎవరివల్లా కాదు. నీ వల్ల కూడా కాదు’ అని!

‘నిజం చెప్పడం నా బలహీనత. అదే నా కాలక్షేపం కూడా’ అనేవారాయన. ఎలాంటి నిజమైనా సరే, ఆ నిజం తన సన్నిహితుల్ని బాధపెడుతుంది అని తెలిసినా సరే... మొహంమీదే చెప్పగల ముక్కుసూటి మనిషి ఆయన. ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలెన్నో ఉన్నాయి. గుజరాత్‌కు మోదీ సీఎంగా ఉన్నప్పుడు అల్లర్లు జరిగిన నేపథ్యంలో, అప్పట్లో కాంగ్రెస్‌ నేతలందరూ మోదీని తప్పుపట్టారు. ఆ సమయంలో చో ‘మోదీ మిలట్రీ సహాయం కావాలని కేంద్రాన్ని కోరారు. ఆయనకు వెంటనే సహాయం చేయకుండా తప్పుపట్టడం రాజకీయం చేయడమే’ అని నిలదీశారు. గొంతెత్తి ఆయన నినదిస్తే, ఆ నినాదం ఆయా నాయకులకు కచ్చితంగా చేరేది. ఎందుకంటే వారు ఆయనకు అనుకూల శత్రువులు, ప్రతికూల మిత్రులు! ఆయన్ని తిట్టుకుంటూ అయినా సరే, ఫలానా అంశం మీద ఏం రాశారా... అని చదివేవారు. ఆయన్ని మెచ్చుకుంటూ, తమ తప్పును తాము అంతరాంతరాల్లో ఒప్పుకొనేవారు.

చో ఒక పార్టీకో, ఒక రాజకీయ నాయకుడికో చెందిన మనిషి కాడు. ఎవరికీ భయపడని ఆయన ధైర్యం, ఎవరి నుంచీ ఏ ప్రయోజనాన్నీ ఆశించని ఆయన వ్యక్తిత్వానికి ఇంతకంటే నిదర్శనాలు ఇంకేం కావాలి?

తాను అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగే గుండెధైర్యం ఆయన సొంతం. అందుకు ‘తుగ్లక్‌’ పత్రిక పెట్టిననాటి పరిస్థితులే సాక్ష్యం. తాను నమ్మిన నిజం కోసం తెగించి నిలబడే తత్వం చో సొంతం. ఒకర్ని ఎలా విమర్శిస్తారో, తనను తానూ అలాగే విమర్శించుకునేవారు.

‘ఏదన్నా బాగా చేయలేకపోతే, దాన్ని ఒక పద్ధతి ప్రకారం పాడు చేస్తా. నాటకాలు వేసే రోజుల్లో నా చుట్టూ ఉన్న సమకాలీనులందరూ అద్భుతమైన నాటకాలు రాసి, వేసేవారు. వాటిలో ఆద్యంతం డ్రామా... రక్తి కట్టేది. నేను అలాంటివి రాయలేను. ఆ విషయం నాకు తెలుసు. అందుకే, ప్రతి ఎమోషన్‌నీ సెటైర్‌ చేసి రాయడం మొదలుపెట్టా. అసలు నేను పేరు తెచ్చుకున్నదే అలాగని నా అభిప్రాయం’ అనేవారు నవ్వేస్తూ.

సద్విమర్శ, హాస్య చతురత, వ్యంగ్య రచన, గుండె నిబ్బరం, తెగింపు... వెరసి- చో రామస్వామి! ఆయన లేకపోతే ఎలా?
రేపటి నుంచీ వ్యంగ్యాస్త్రాల్ని సంధించేదెవరు, కుండ బద్దలు కొట్టేదెవరు, బల్లగుద్ది చెప్పేదెవరు?
ప్రశ్నల వర్షం కురిపించేదెవరు, వెన్నులో వణుకు పుట్టించేదెవరు, ‘తుగ్లక్‌’ను ముందుకు నడిపేదెవరు?
‘చో’ లేని ‘తుగ్లక్‌’ అంటే- తుగ్లక్‌ లేని చరిత్రే!

- ఉమర్జీ అనూరాధ
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.