కబడ్డీ జైత్రయాత్ర

తాజావార్తలు


కబడ్డీ జైత్రయాత్ర
అహ్మదాబాద్‌ వేదికపై ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచ కప్‌ కబడ్డీ పోటీల తుది పోరులో, సాటిలేని పాటవ ప్రదర్శనతో భారత్‌ విశ్వవిజేతగా పునరావిర్భవించింది. ఇప్పటివరకు అధికారికంగా ముమ్మార్లు నిర్వహించిన ప్రపంచ కప్‌ కబడ్డీ హోరాహోరీలో ప్రతిసారీ ఇరాన్‌ జట్టును కంగు తినిపించడం ద్వారా గెలుపొందిన ఇండియా, తన పేరిట అపురూపమైన రికార్డును సగర్వంగా లిఖించుకుంది! ఇరాన్‌, థాయ్‌లాండ్‌, జపాన్‌, అమెరికా, పోలండ్‌, కెన్యాలు ఒక శ్రేణిలో; భారత్‌, బంగ్లాదేశ్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, అర్జెంటీనా మరో బృందంలో తలపడి రేకెత్తించిన క్రీడాసంరంభం విశేష జనాదరణ చూరగొంది. ఈసారీ సొంతగడ్డపై తిరుగే లేదనుకున్న ఇండియాకు దూకుడు మీద ఉన్న కొరియన్ల చేతిలో ఆదిలోనే ఎదురైన భంగపాటు, అంతిమ విజేతపై అంచనాల్ని చెల్లాచెదురు చేసిన మాట వాస్తవం. తమ మలిపోరులో ఆస్ట్రేలియాను 54-20తో మట్టి కరిపించిన అనూప్‌ కుమార్‌ జట్టు బంగ్లాదేశ్‌, అర్జెంటీనా, ఇంగ్లాండ్‌ల పైనా అదే ధాటి కనబరచి టీవీక్షకులతో కేరింతలు కొట్టించింది. స్వల్ప తేడాతో జపాన్‌ అడ్డు తొలగించుకుని సెమీఫైనల్‌కు చేరిన థాయ్‌లాండ్‌పై 73-20 పాయింట్ల అంతరంతో ఘనవిజయం సాధించిన భారత్‌, తుది ప్రత్యర్థికి తొడగొట్టి సవాలు విసిరింది. ఉపఖండంలో ఉద్రిక్త పరిస్థితులతో పాక్‌ ప్రవేశానికి దారులు మూసుకుపోయాక, బరిలో ఇండియాకు దీటైన పోటీదారుగా మిగిలిన ఇరాన్‌ సైతం ఈసారి శాయశక్తులా విజృంభించింది. అమెరికా, థాయ్‌లాండ్‌, కెన్యా, జపాన్‌లపై నెగ్గి అనూహ్యంగా పోలండ్‌ చేతిలో ఓడినా; కాలూ చేయీ కూడదీసుకుని కొరియాను అది నిలువరించిన తీరు- క్రీడాభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆరు నూరైనా భారత జట్టుమీద పైచేయి సాధించాలన్న పంతం నెగ్గించుకోవడంలో ఇరాన్‌కు తాజాగా ఎదురైన ఆశాభంగాన్ని, అంకెలు సంపూర్ణంగా ఆవిష్కరించలేవు!
శతాబ్దాల క్రితమే భారత గడ్డపై పుట్టి, క్రమేణా ఆసియా ఖండమంతటా ప్రాచుర్యం పొందిన సంప్రదాయ క్రీడ కబడ్డీ. సరైన గుర్తింపు, వ్యవస్థాగత ప్రోత్సాహం కొరవడిన పర్యవసానంగా ఆసియా క్రీడల్లో ప్రదర్శనాంశంగా కాలిడటానికీ అది 1980 వరకు నిరీక్షించాల్సి వచ్చింది. అనంతర కాలంలో ఆసియా కబడ్డీ ఛాంపియన్‌గా ఇండియాకన్నీ అప్రతిహత విజయాలే! 2004, 2007లలో ప్రపంచ కప్‌ పోటీల్లోనూ అవే ఫలితాలు పునరావృతమయ్యాయి. 2010 నుంచి వరసగా అయిదేళ్లపాటు పంజాబ్‌ ప్రభుత్వం ఆహ్వానిత ప్రపంచ కప్‌ పోటీలకు ఆతిథ్యమిచ్చినా, అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య వాటిని గుర్తించ నిరాకరించింది! డీలాపడిన కబడ్డీకి నూతన జవజీవాలు కల్పించిన ఘనత కచ్చితంగా పీకేఎల్‌(ప్రో కబడ్డీ లీగ్‌)దే. 2014లో లీగ్‌ తొలి యత్నం దేశీయంగా 43.50 కోట్ల మంది వీక్షకుల్ని ఆకట్టుకుందని ఫిక్కి-కేపీఎమ్‌జీ సంస్థల సంయుక్త నివేదిక ధ్రువీకరించింది. అంతకంతకు విస్తరిస్తున్న ప్రేక్షకాదరణ పీకేఎల్‌లో నవ తారల ఆవిర్భావానికి బాటలు పరచింది. ఆ పోటీల్లో ఆడి రాటుతేలిన జన్‌ కున్‌ లీ ప్రభృతులతో కూడిన కొరియా జట్టే ప్రస్తుత ప్రపంచ కప్‌ ఆరంభాన పెను సంచలనం సృష్టించింది. 2007 దరిమిలా అధికారికంగా ప్రతిష్ఠాత్మక పోటీల నిర్వహణకు ముందుకు రాని అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య (ఐకేఎఫ్‌)పై పరోక్షంగా ఒత్తిడి పెంచిన ఖ్యాతీ, ప్రో కబడ్డీ లీగ్‌ ఖాతాలోనే జమపడుతుంది. తొమ్మిదేళ్ల విరామానంతరం ధూమ్‌ధామ్‌గా చోటుచేసుకున్న ప్రపంచ కప్‌ పోటీల్లో ఇరాన్‌, కొరియా లాంటివి కొమ్ము విసిరినా- భారత్‌ జైత్రయాత్ర నిర్నిరోధంగా కొనసాగడం అభిమానులకు మధుర జ్ఞాపకాలు మిగిల్చింది. వారి స్మృతిపేటికలో, అజయ్‌ ఠాకుర్‌ చెలరేగి ఆడి ప్రత్యర్థుల్ని దిమ్మెరపరచిన తీరు ఎన్నటికీ చెక్కుచెదరకుండా నిలిచిపోతుంది!
రేపటి పౌరుల శారీరక మానసిక దారుఢ్యానికి దోహదపడే క్రీడాంశాల్లో కబడ్డీదే పెద్దపీట. ఒకప్పుడు కబడ్డీ, ఖోఖోలతో పాటు వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, టెన్నికాయిట్‌, హైజంప్‌, లాంగ్‌జంప్‌ లాంటివి ఆడించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో క్రీడామైదానాలుండేవి. బండెడు పుస్తకాలతో కుస్తీ పట్టడమే విద్యార్థుల దినచర్యగా దిగజారిన బాలభారతాన నేడు క్రమ క్రీడావికాసం ఎండమావిని తలపిస్తోంది. దేశంలో ఇప్పటికీ సంప్రదాయ గ్రామీణ క్రీడల మూలాలు సజీవంగా ఉన్న కొన్ని చోట్ల కబడ్డీ పోటీల్లాంటివి నిర్వహిస్తున్నారు. తెలుగునేలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, బిహార్‌, పంజాబ్‌లకు పీకేఎల్‌లో సముచిత ప్రాతినిధ్యం దక్కడానికి ఆ చొరవే వూపిరులూదింది. బంగ్లాదేశ్‌లో కబడ్డీ జాతీయ క్రీడ. అయినా అక్కడ అది స్థానిక ప్రజాదరణలో క్రికెట్‌ సరసన వెలాతెలా పోతోంది. ఇండియాలోనూ పకడ్బందీ తోడ్పాటు లేనిదే కబడ్డీ మనలేదు. ఆ దృష్ట్యా పురిటిగడ్డపై సంప్రదాయ క్రీడ మరిన్ని ప్రాభవ దీప్తులతో వెలుగొందేలా పీకేఎల్‌, ఆసియా కబడ్డీ సమాఖ్య, ఐకేఎఫ్‌ విస్తృత కార్యాచరణకు నిబద్ధం కావాల్సి ఉంది. వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీల సత్వర భర్తీ, ఆటల్ని పాఠ్యాంశంలో అంతర్భాగంగా మలచి అవసరమైన మేర క్రీడాసామగ్రి సరఫరా, మండలాల వారీగా ఉమ్మడి మైదానాల ఏర్పాటు... తదితరాలతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలూ చురుగ్గా ముందడుగేయాలి. ఆ ఏకోన్ముఖ కృషి, దేశవ్యాప్తంగా క్రీడల సముద్ధరణకు కొంగుబంగారమవుతుంది. కబడ్డీ లాంటి గ్రామీణ క్రీడలకు జవజీవాలు చేకూరుస్తుంది! 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బేస్‌బాల్‌, కరాటే, స్కేట్‌ బోర్డింగ్‌, సర్ఫింగ్‌ తదితరాలను చేర్చడానికి ఇటీవలే మార్గం సుగమమైంది. పుట్టిల్లయిన భారత్‌తో పాటు తక్కిన దేశాల్లోనూ విస్తృత వ్యాప్తికి సమర్థ వ్యూహరచన, పటుతర కార్యాచరణ జోరెత్తితేనే మున్ముందు కబడ్డీకీ ఒలింపిక్స్‌ ప్రవేశార్హత దఖలుపడేది!
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.