The Family Man 3: గుడ్‌న్యూస్‌ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ టీమ్‌.. అది ఏంటంటే..

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ టీమ్‌ సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. 

Published : 07 May 2024 00:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశేష ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ (The Family Man) ఒకటి. దీని మొదటి రెండు సీజన్లకు భారీ ప్రేక్షకాదరణ లభించడంతో మూడో దానికోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ టీమ్‌ శుభవార్త చెప్పింది. దీని చిత్రీకరణను ప్రారంభించినట్లు తెలిపింది. సీజన్‌ 3కు కూడా రాజ్‌ అండ్‌ డీకేనే దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj Bajpayee) కూడా ఇప్పటికే చిత్రీకరణలో పాల్గొన్నారు. శ్రీకాంత్‌ తివారి పాత్రలో ఆయన మరింత ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. సీజన్‌ 3లో కుటుంబంలో ఎదురైన సమస్యలను ఆయన ఎలా అధిగమించనున్నాడు. అలాగే జాతీయభద్రతకు ఎదురవుతోన్న ముప్పును తన తెలివితో ఎలా తిప్పికొట్టాడో చూపనున్నారు.

ది ఫ్యామిలీమ్యాన్‌2 రివ్యూ

గతంలో మనోజ్‌ బాజ్‌పాయ్‌ సీజన్‌ 3 గురించి మాట్లాడుతూ.. ‘ఈశాన్య భారతదేశంలో అధిక భాగం షూటింగ్ చేయనున్నాం. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ ఎక్కడైతే పూర్తైందో అక్కడినుంచే ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ మొదలవుతుంది. శ్రీకాంత్‌ తివారీ (మనోజ్‌ బాజ్‌పాయ్‌ పోషించిన పాత్ర) పిల్లలు పెద్దవాళ్లు అవుతారు. ఆయనకు వయసు పెరిగినా సవాళ్లు వెంటాడుతూనే ఉంటాయి. ఈసారి వాటిని ఎలా ఎదుర్కొన్నాడనేది సిరీస్‌లో తెలుస్తుంది’ (The Family Man Season 3) అని తెలిపారు. 2019లో ‘ఫ్యామిలీ మ్యాన్‌’ మొదటి సీజన్‌ విడుదలై ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించింది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో అత్యధికమంది వీక్షణలు సొంతం చేసుకున్న సిరీస్‌గా నిలిచింది. ప్రముఖ హీరోయిన్‌ సమంత కీలక పాత్ర పోషించిన సీజన్‌ 2.. 2021లో రిలీజై విశేషంగా ఆకట్టుకుంది. మూడో సీజన్‌ 2025లో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని