TOEFL: ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్‌’ స్కోర్‌ చెల్లుబాటు

అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్‌ (టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఏ ఫారెన్‌ లాంగ్వేజ్‌) స్కోర్‌ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్ సర్వీస్‌ (ETS) వెల్లడించింది.

Published : 07 May 2024 00:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్‌ (టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఏ ఫారెన్‌ లాంగ్వేజ్‌) స్కోర్‌ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్ సర్వీస్‌ (ETS) వెల్లడించింది. గతేడాది జులై నుంచి ఈ (TOEFL) స్కోరును అనుమతించడాన్ని నిలిపివేసిన ఆస్ట్రేలియా హోం మంత్రిత్వశాఖ.. సమీక్షలో భాగంగా పెండింగులోనే ఉంచింది. తాజాగా దీన్ని పరిగణనలోకి తీసుకుందని ఈటీఎస్‌ పేర్కొంది. 2024 మే 5 లేదా ఆ మరుసటి రోజు నుంచి టోఫెల్‌ రాసిన వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది.

భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులకు ఆస్ట్రేలియా గమ్యస్థానంగా ఉంటోంది. ఏటా దాదాపు 1.2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నతవిద్య కోసం అక్కడికి వెళ్తున్నారు. ప్రపంచంలో అత్యుత్తమ 100 యూనివర్సిటీల్లో తొమ్మిది ఆస్ట్రేలియాలోనే ఉన్నాయని ఈటీఎస్‌ ఇండియా, సౌత్‌ ఏసియా కంట్రీ మేనేజర్‌ సచిన్‌ జైన్‌ పేర్కొన్నారు.

కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి 24 గంటలే పని!

మరోవైపు విద్యార్థుల్లో ఇంగ్లిష్ సామర్థ్యాన్ని అంచనా వేసే ఈ టోఫెల్‌ (TOEFL) స్కోరును ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు పైగా దాదాపు 12,500 యూనివర్సిటీలు అనుమతిస్తున్నాయి. విదేశీ విద్యలో ప్రపంచంలోనే ప్రసిద్ధ గమ్యస్థానాలుగా ఉన్న అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు యూకేలోని 98 శాతానికి పైగా విశ్వవిద్యాలయాలు ఈ స్కోరును ప్రామాణికంగా తీసుకొని డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, మూడు గంటలకు పైగా ఉన్న టోఫెల్‌ పరీక్ష వ్యవధిని రెండు గంటల్లోపే (గంటా 56నిమిషాల్లో) పూర్తయ్యేలా ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్ సర్వీస్‌ (ETS) ఇటీవల మార్పులు చేసింది. అంతేకాకుండా పరీక్ష పూర్తయిన వెంటనే విద్యార్థులు తమ అధికారిక స్కోర్‌ విడుదలయ్యే తేదీని సైతం తెలుసుకోవచ్చని ఈటీఎస్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు