California: 1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు

అమెరికాలో ఏం చేసినా భారీగా ఉండాల్సిందేనేమో.. అది దుబారా వ్యయమైనా సరే. తాజాగా కొన్ని వందల అడుగుల వంతెనకు ఏకంగా రూ.91 వేల కోట్లు వెచ్చించి కాలిఫోర్నియా విమర్శల పాలవుతోంది. 

Updated : 06 May 2024 21:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టు ఖర్చు దాదాపు 780 మిలియన్‌ డాలర్లు.. దిల్లీ మెట్రో ఖర్చు బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. కానీ, అమెరికాలో ఓ చిన్న కనెక్టింగ్‌ వంతెన నిర్మాణానికి ఎంత ఖర్చయిందో తెలుసా..? ఏకంగా 11 బిలియన్ డాలర్లు. అంటే మన దేశీయ కరెన్సీ ప్రకారం రూ.91 వేల కోట్లు. దీని నిర్మాణానికి దాదాపు దశాబ్ద సమయం పట్టింది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా హైస్పీడ్‌ రైల్‌ సంస్థ ట్వీట్‌ చేయగా.. ఇప్పుడది ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 

అమెరికాలో కాలిఫోర్నియా (California) రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఎందుకంటే ఓ చిన్న ప్రాజెక్టుకు భారీగా డబ్బు వృథా చేసి.. దానిని గొప్పగా సెలబ్రేట్‌ చేసుకోవడమే ఇందుకు కారణం. 11 బిలియన్‌ డాలర్ల వ్యయంతో తొమ్మిదేళ్లపాటు తిప్పలు పడి 1600 మీటర్ల పొడవైన హైస్పీడ్‌ రైలు వంతెన నిర్మాణం పూర్తి చేసింది. ‘‘ఫ్రెస్నో రివర్‌ వయాడెక్ట్‌ను గతేడాది పూర్తి చేశాం. రాష్ట్రంలోని బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులోని ఓ చిన్న భాగం ఇది. శాన్‌ ఫ్రాన్సిస్కో - లాస్‌ ఏంజెల్స్‌లను ఇది కనెక్ట్‌ చేస్తుంది’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొంది. 

పారిశ్రామికవేత్త ఎలాన్‌ మస్క్‌ ఎక్స్‌లో స్పందిస్తూ తీవ్ర నిరాశ వ్యక్తంచేశారు. ఈ ప్రాజెక్టు గురించి స్పందిస్తూ చాలా విచారకరం అంటూ ఏడుస్తున్న ఎమోజీని పోస్టు చేశారు. వాస్తవానికి ఈ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు రద్దయ్యే అవకాశాలున్నాయి. 

మరోవైపు డాజీకాయిన్‌ వ్యవస్థాపకుడు బిల్లి మార్కస్‌ స్పందిస్తూ ‘‘ 1600 అడుగుల హైస్పీడ్‌ రైలు వంతెనను 9 ఏళ్లలో 11 బిలియన్ డాలర్లు వెచ్చించి నిర్మించారు. ఈ దూరం నడుచుకొంటూ దాటడానికి 5 నిమిషాల సమయం పడుతుంది. అంతమాత్రానికి హైస్పీడ్‌ రైలు చాలా పెద్ద విషయం’’ అంటూ వెటకారంగా పోస్టు చేశారు. మరోవైపు బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు మొత్తానికి 100 బిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతుందన్న అంచనాలపైనా వెటకారంగా స్పందించారు. ‘‘వావ్‌ చాలా ఆకర్షణీయంగా ఉంది. 700 క్వాడ్రిలియన్‌ డాలర్లతో ఇది 2400 సంవత్సరంలో పూర్తయ్యేవరకు వేచి ఉండలేను’’ అని పేర్కొన్నాడు.

ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ పాట్రిక్‌ బ్లూమెంథల్‌  స్పందిస్తూ.. అధికారులు జబ్బలు చరుచుకోవడంపై మరోసారి ఆలోచిస్తే బాగుంటుందన్నారు. ‘‘0.3 మైళ్ల ప్రాజెక్టు కోసం 15 ఏళ్లలో 11.2 బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తే.. ప్రాజెక్టులోని ప్రతీ మైలుకు 36.96 బిలియన్‌ డాలర్లు ఖర్చవుతుంది’’ అని ఎక్స్‌లో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని