Mumbai vs Hyderabad: సూర్యకుమార్‌ యాదవ్‌ శతకం.. హైదరాబాద్‌పై ముంబయి విజయం

వరుస ఓటములతో ఢీలా పడిన ముంబయి ఊరట. హైదరాబాద్‌తో జరిగిన పోరులో ఆజట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Updated : 07 May 2024 00:27 IST

ముంబయి: వరుస ఓటములతో ఢీలా పడిన ముంబయికి సొంతమైదానంలో ఊరట లభించింది. హైదరాబాద్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్ (48: 30 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. చివర్లో కెప్టెన్‌ కమిన్స్‌ (35*: 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. మిగతవారు విఫలమయ్యారు. ముంబయి బౌలర్లలో పీయూష్‌ చావ్లా, హార్దిక్‌ తలో మూడు వికెట్లు తీయగా, కంబోజ్‌, బుమ్రా ఒక్కో వికెట్‌ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబయి.. సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav) అజేయ శతకం (102*: 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో విధ్వంసం సృష్టించిన వేళ ఆ జట్టు 17.2 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. మరో ఆటగాడు తిలక్‌ వర్మ (Tilak Varma) (37*: 32 బంతుల్లో 6 ఫోర్లు) సూర్యకి సహకరించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, జాన్సెన్‌, కమిన్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

అదరగొట్టిన సూర్యకుమార్‌..

174 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన ముంబయి ధాటిగా ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. భువనేశ్వర్‌ వేసిన తొలి బంతికి ఇషాన్‌ ఫోర్‌ కొట్టగా,  రెండో బంతికి లెగ్‌ బైస్‌ అయి ఫోర్‌ వెళ్లింది. రోహిత్‌ శర్మ ఫోర్‌ బాదడంతో తొలి ఓవర్లోనే 13 పరుగులు వచ్చాయి. జాన్సెన్‌ వేసిన రెండో ఓవర్‌లో ఇషాన్‌ (9) మయాంక్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ(4) క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లో భువనేశ్వర్‌ కుమార్‌ నమన్‌ ధీర్‌ను డకౌట్‌ చేశాడు. దీంతో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన తిలక్‌ వర్మతో కలిసి సూర్యకుమార్‌ యాదవ్‌ పెను విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కమిన్స్‌ వేసిన ఆరో ఓవర్లో తిలక్‌ వర్మ రెండు ఫోర్లు బాదగా, ఆఫ్‌ స్టంఫ్‌ మీదుగా సూర్య భారీ సిక్సర్‌ దంచాడు. దీంతో ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. ఏడో ఓవర్లో జాన్సెన్‌కు సూర్య చుక్కలు చూపాడు. రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. అయితే ఆ తర్వాత హైదరాబాద్ బౌలర్లు వరుసగా మూడు ఓవర్లు కట్టదిట్టంగా బౌలింగ్‌  వేయడంతో ముంబయి 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 84 పరుగులతో నిలిచింది. నితీశ్‌ రెడ్డి వేసిన 12వ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన సూర్య.. తర్వాత ఓవర్లో రెండు పరుగులు తీసి 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇక అదే ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ముంబయి 139 పరుగులతో నిలిచింది. అప్పటి విజయ లక్ష్యం 30 బంతుల్లో 35 పరుగులుగా మారింది. కమిన్స్‌ వేసిన 17వ ఓవర్‌లో సూర్య విశ్వరూపం చూపాడు. వరుసగా రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో శతకానికి చేరువయ్యాడు. లక్ష్యం 3 ఓవర్లలో 7 పరుగులు కాగా,  18వ ఓవర్‌లో తొలి బంతికి తిలక్‌ వర్మ సింగిల్‌ తీయగా, స్ట్రైకింగ్‌లోకి వచ్చిన సూర్య కుమార్‌ డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా సిక్స్‌ బాది శతకం చేయడమే కాకుండా మ్యాచ్‌ను గెలిపించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని