11 ఎయిడెడ్‌ సంస్థలు... రూ.వందల కోట్ల ఆస్తులు

ప్రధానాంశాలు

11 ఎయిడెడ్‌ సంస్థలు... రూ.వందల కోట్ల ఆస్తులు

ప్రభుత్వ పరిధిలోకి వెళ్లనున్న దేవాదాయ విద్యాలయాలు

ప్రైవేటుగా మారేందుకే మొగ్గుచూపిన 20 సంస్థలు

ఈనాడు, అమరావతి: దేవాదాయశాఖలోని ఛారిటబుల్‌ ట్రస్టులు, ఆలయాల నిర్వహణలో ఉన్న ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో... 11 సంస్థలను ప్రభుత్వానికి అప్పగించనున్నారు. నాలుగు ట్రస్టులకు చెందిన పది విద్యాసంస్థలు, ఒక వసతిగృహాన్ని... ప్రాంగణాలు, బోధన, బోధనేతర సిబ్బంది సహా ప్రభుత్వానికి అప్పగించేందుకు వాటి ఈవోలు, కరస్పాండెంట్లు ఆమోదం తెలిపారు. వీటి ప్రాంగణాలు రూ.వందల కోట్ల విలువ చేస్తున్నాయి. ఇదే సమయంలో ఇరవై విద్యాసంస్థలు మాత్రం గ్రాంటును వదులుకొని, ప్రైవేటుగా కొనసాగేందుకు మొగ్గుచూపాయి.

సమ్మతి తెలిపిన విద్యాసంస్థలివి...

రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజానికి చెందిన ఎస్‌కేవీటీ ఆంగ్ల, తెలుగు మాధ్యమ పాఠశాలలు, ఎస్‌కేఆర్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌, ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాల, వీటీ జూనియర్‌ కళాశాల, ది నేషనల్‌ సీనియర్‌ బేసిక్‌ స్కూల్‌, విజయవాడ గొల్లపూడిలోని పి.నరసింహరావుచౌదరి ఉన్నత పాఠశాల, గుంటూరులోని శ్రీశారదానికేతన్‌కు చెందిన ఓరియంటల్‌, ప్రాథమిక పాఠశాలలు, ఓరియంటల్‌ కళాశాల, వసతి గృహాన్ని ప్రాంగణాలతో సహా అప్పగించేందుకు ఆదేశాలు జారీ చేశారు.

27 ఎకరాల్లో అయిదు సంస్థలు

* రాజమహేంద్రవరంలోని హితకారిణి సమాజానికి చెందిన అయిదు విద్యాసంస్థలన్నీ కలిపి దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటి విలువ రూ.150-200 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

* విజయవాడ గొల్లపూడిలో ఉన్న పి.నరసింహరావుచౌదరి ఉన్నత పాఠశాల రెండు ఎకరాల విస్తీర్ణంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. దీని విలువ రూ.30-40 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 

* వీటి అప్పగింత తర్వాత స్థిర, చర ఆస్తులపై   అధికారం ప్రభుత్వానికే ఉంటుంది. ఆయా సంస్థల అవసరాలకు సరిపోగా, మిగిలిన ఆస్తులను ప్రజావసరాలకు వాడుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందనే నిబంధన ఉంది.

ఎయిడ్‌ లేకపోయినా సొంతంగానే నిర్వహణ

ప్రభుత్వ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ లేకపోయినా సరే.. విద్యా సంస్థలను సొంతంగా నిర్వహించుకుంటామని ఆరు ఛారిటబుల్‌ ట్రస్ట్‌లు, నాలుగు దేవాలయాలు స్పష్టంచేశాయి. వీటిలోని పోస్టులు, బోధన బోధనేతర సిబ్బందిని అప్పగించేందుకు మాత్రం అంగీకరించాయి.

* సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, గుంటూరు జిల్లా పొన్నూరులోని భావనారాయణస్వామి ఆలయాలకు చెందిన మొత్తం నాలుగు పాఠశాలలు, మూడు కళాశాలలను సొంతంగా నిర్వహించనున్నారు.

* విజయనగరంలోని మాన్సాస్‌ ట్రస్ట్‌కు చెందిన అయిదు విద్యాసంస్థలను, ఏలూరులోని ది గాంధీ ఆంధ్రా జాతీయ మహావిద్యాలయం, మచిలీపట్నంలోని ది ఆంధ్రా జాతీయ విద్యాపరిషత్‌కు చెందిన మూడు విద్యాసంస్థలు, గుంటూరు జిల్లా పిల్లుట్లలోని జీవీఆర్‌కే ఉన్నత పాఠశాల, ప్రకాశం జిల్లా తిమ్మసముద్రంలోని గోరంట్ల వెంకన్న ట్రస్ట్‌కు చెందిన రెండు సంస్థలు, నెల్లూరులోని శ్రీవెంకట సంజీవచెట్టి విద్యాసంస్థలకు చెందిన సర్వోదయ కళాశాలను సొంతంగా నిర్వహించనున్నారు.

రెండింటి మూసివేతకు అనుమతి

గుంటూరు జిల్లా పొన్నూరులో శ్రీభావనారాయణస్వామి దేవస్థానం పరిధిలోని సంస్కృత కళాశాల గతంలోనే మూతపడగా, ఓరియంటల్‌ పాఠశాలను ఈ విద్యా సంవత్సరం తర్వాత మూసివేతకు ఆదేశించారు. వీటిలో ఆగమ/వేద పాఠశాలను వసతిగృహం సహా ఆరంభించేందుకు అనుమతిస్తూ కమిషనర్‌ ఆదేశాలిచ్చారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని