పెట్టుబడుల కోసం ఫిబ్రవరిలో విశాఖలో సదస్సు

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు మూడేళ్లుగా ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రావడం లేదు. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడులకు సంబంధించి డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) నివేదిక దీన్ని స్పష్టం చేస్తోంది. ఈ నివేదిక జూన్‌లో విడుదలైంది. 2020లో దేశవ్యాప్తంగా 1,432 పెట్టుబడుల ఒప్పందాలు కుదరగా.. ఇందులో రాష్ట్రానికి వచ్చింది కేవలం 59 మాత్రమే. అలాగే 2021లో 1,489 పెట్టుబడి ఒప్పందాల్లో రాష్ట్రానికి 47 మాత్రమే వచ్చాయి. 2022 మే వరకు వివిధ సంస్థలతో 475 పెట్టుబడి ఒప్పందాలు కుదిరితే రాష్ట్రానికి దక్కింది 20 మాత్రమే. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడుల సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సదస్సును వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించాలని భావిస్తోంది. సదస్సు నిర్వహణతోపాటు ఇందులో పారిశ్రామికవేత్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా సహకరించాలని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇన్వెస్ట్‌ ఇండియా సీఈవోను కలిసి అధికారులు కోరారు. బయటినుంచి వచ్చే పెట్టుబడుల లీడ్స్‌ సమాచారం ఇన్వెస్ట్‌ ఇండియాకు ముందుగా తెలుస్తుంది. ఇక్కడున్న అవకాశాలపై పెట్టుబడిదారులకు వివరించాలని ఇన్వెస్ట్‌ ఇండియాను రాష్ట్రం కోరింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని