మమత ప్రతిష్ఠకు మచ్చ

పశ్చిమ్‌ బెంగాల్‌లో నియామకాల కుంభకోణం

భారత్‌లో అవినీతి, రాజకీయాలు అవిభక్త కవలల్లా తయారయ్యాయి. ఇటీవల పశ్చిమ్‌ బెంగాల్‌లో వెలుగులోకి వచ్చిన నియామకాల కుంభకోణాన్ని పరిశీలిస్తే నేతలు ప్రతి అవకాశాన్నీ ఎలా సొమ్ము చేసుకుంటున్నారో అర్థమవుతుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ మంత్రి పార్థా ఛటర్జీ మిత్రురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ.50 కోట్లకు పైగా నగదు, భారీగా ఆభరణాలు, విదేశీ కరెన్సీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గుర్తించింది. ఆ సొమ్ము తనది కాదని పార్థా బుకాయిస్తున్నా, ఆ కుంభకోణంలో ఆయనే కీలకమని వెల్లడైంది. దానిపై తీవ్ర దుమారం రేగిన తరవాతే మంత్రివర్గం నుంచి పార్థా ఛటర్జీని మమతా బెనర్జీ తొలగించారు.

భారతీయ జనతా పార్టీ (భాజపా) కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రముఖులపై ఈడీ దాడులు చేస్తోందనే అభిప్రాయముంది. ఈ కేసులో మాత్రం కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈడీ దర్యాప్తు చేపట్టింది. ప్రతిభను పట్టించుకోకుండా లంచాలు ఇచ్చిన వారికే ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టారని, విద్యామంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీ అందులో ప్రధాన పాత్రధారి అని ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణకు కోర్టు ఆదేశించడానికి ముందే లంచాలు ఇవ్వడానికి నిరుద్యోగ యువత తమ తల్లులు, భార్యల ఆభరణాలను అమ్ముకున్నారని ప్రాంతీయ పత్రికల్లో వార్తలొచ్చాయి. అప్పుడు మమతా బెనర్జీ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. అర్పితా ముఖర్జీ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడిన తరవాతే చర్యలకు దీదీ ఉపక్రమించారు.  

మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించినా, తాను యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తగా ఉన్నప్పటి పాత ఇంట్లోనే నివసిస్తున్నారు. ఎప్పుడూ సాధారణ ఆహార్యంలోనే కనిపిస్తారు. అయితే, మమత మేనల్లుడు, వారసుడు అయిన అభిషేక్‌ బెనర్జీపై వచ్చిన అవినీతి ఆరోపణలతో మమత సృష్టించుకున్న మంచి పేరు ఎప్పుడో మసకబారింది. పార్థా అక్రమార్జన వెలుగులోకి రావడంతో మంత్రివర్గంలో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. నియామకాల కుంభకోణం తొలిదశలో విద్యాశాఖను పర్యవేక్షించిన మరో మంత్రినీ దీదీ తొలగించారు. ఈ చర్యలన్నీ అవినీతి వ్యవహారాన్ని తెరమరుగు చేసే ప్రయత్నాలే. ఈ కుంభకోణం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చినా, ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. ఎన్నికలకు మరో నాలుగేళ్ల సమయం ఉంది. అప్పటికి ఈ లంచాల వ్యవహారం అంత ప్రభావం చూపకపోవచ్చు. ఏది ఏమైనా ఈ కుంభకోణం మమతా బెనర్జీ పెంచుకున్న ప్రతిష్ఠకు భంగకరమే. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించక ముందు పశ్చిమ్‌ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌తో మమత నిత్య పోరాటం సాగించారు. ప్రధాని మోదీతో తీవ్ర శత్రుత్వమున్నా... ఉపరాష్ట్రపతి ఎన్నికలకు టీఎంసీ దూరంగా ఉండిపోవడం చాలా మందిని ఆశ్చర్యపరచింది. ఆ పార్టీకి ఉన్న 39 మంది ఎంపీల్లో ఏ ఒక్కరూ దానిపై దీదీని స్పష్టత కోరలేదు.  

పశ్చిమ్‌ బెంగాల్‌లో పాలన గొప్పగా సాగుతోందని, అవినీతి లేనే లేదనే అభిప్రాయాన్ని నియామకాల కుంభకోణం పటాపంచలు చేసింది. మూడు దశాబ్దాల పాటు మార్క్సిస్టుల హయాములో ఆ రాష్ట్రంలో కొనసాగిన మామూళ్ల సంస్కృతి తృణమూల్‌ పాలనలోమరింతగా పెచ్చరిల్లింది. అక్రమాల అధికారాన్ని అనుభవించడానికి గతంలోని మార్క్సిస్టు శ్రేణులు టీఎంసీలో చేరిపోయాయి. గత శాసనసభ ఎన్నికల్లో భాజపా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ పశ్చిమ్‌ బెంగాల్‌లో ఉన్న ముస్లిముల్లో మూడోవంతు వెన్నుదన్నుగా నిలవడమే టీఎంసీ విజయానికి ప్రధాన కారణం. ఆ ఎన్నికల్లో విశ్వసనీయమైన స్థానిక నాయకుడు లేకపోవడం భాజపాకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం భాజపాలో ఉన్నవారిలో ఎక్కువ మంది తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ లేదా కమ్యూనిస్టు పార్టీల నుంచి వలస వచ్చినవారే. శాసనసభ ఎన్నికల్లో అదే ఆ పార్టీ విజయానికి అవరోధంగా మారింది. ప్రజల్లోనే ఉంటూ వారి సాధకబాధకాలు తెలుసుకుంటూ, తృణమూల్‌ వైఫల్యాలను ఎండగడుతూ నాలుగేళ్ల పాటు భాజపా ఓపికగా జనం పక్షాన నిలిస్తే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి అవకాశం లేకపోలేదు. గణనీయంగా ఉన్న అల్పసంఖ్యాక వర్గాల ఓట్లపైనే మమతా బెనర్జీ ఆధారపడుతున్నప్పటికీ... అవినీతి, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో గూడుకట్టుకొన్న ఆగ్రహం ప్రతికూలంగా పరిణమించే ప్రమాదం ఉంది.

- వీరేంద్ర కపూర్‌ (రాజకీయ, సామాజిక విశ్లేషకులు)


మరిన్ని

ap-districts
ts-districts