నేస్తమా.. నా గెలుపు నీ భిక్ష

స్సు ఊరు దాటుతోంది. నా గుండె బరువెక్కుతోంది. పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఊరు వీడలేదు. ఒకటి నుంచి బీటెక్‌ దాకా.. అంతా ఊళ్లోనే. చిన్నప్పుడే నాన్న పోయారు. అమ్మ బీడీలు చుట్టి చదివించింది. అక్క పెళ్లికి చేసిన అప్పు కొండలా పేరుకుపోయింది. చదువైపోగానే ఉద్యోగం వస్తుంది.. కష్టాలన్నీ గట్టెక్కుతాయనుకున్నా. రాలేదు. ఏడాదిదాకా ఊళ్లోనే చిన్నాచితకా పనులు చేశా. ఆ జీతం వడ్డీలకే సరిపోయేది. దాంతో సిటీకి వెళ్లి ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోవాలనుకున్నా. 

బ్యాగులో రెండు డ్రెస్‌లు.. జేబులో మూడు వేల రూపాయలతో నగరానికొచ్చా. రోజుకి నాలుగైదు ఆఫీసుల మెట్లెక్కేవాణ్ని. ‘గ్యాప్‌ ఎందుకొచ్చింది?’, ‘ఏం కోర్సు నేర్చుకున్నావ్‌?’, ‘అనుభవం లేదుగా?’ ప్రశ్నలు విసిరేవాళ్లే తప్ప కొలువు ఇచ్చేవారు లేరు. విసిగిపోయా. కట్టాల్సిన కిస్తీలు, చెల్లించాల్సిన అప్పులు.. ఈ ఆలోచనలతోనే తెల్లారేది. చివరికి చిన్నదైనా ఫర్వాలేదనుకొని ఓ కంపెనీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా చేరా. కొంచెం కుదురుకున్నాక సాఫ్ట్‌వేర్‌ కోర్సులో చేరి, ఐటీ ఉద్యోగం వెతుక్కోవాలనేది నా ప్లాన్‌.

ఆఫీసులో పరిచయమయ్యాడు శ్యామ్‌. తనదీ నాలాంటి నేపథ్యమే. గోదావరి జిల్లాలో ఏదో ఊరన్నాడు. నాతో ఇట్టే కలిసిపోయాడు. నాకు పెట్టాకే తను తినేవాడు. నాకు ధైర్యం చెప్పకుండా రోజు ముగించేవాడు కాదు. అడక్కుండానే డబ్బులు సర్దేవాడు. ఇంత మంచివాళ్లూ ఉంటారా? అనిపించేది.

రోజులు బాగానే గడిచిపోతున్నాయి. ఇంతలో ఓ చెడువార్త. ఓరోజు మా ఓనరు స్టాఫ్‌ అందరినీ పిలిచారు. ‘బిజినెస్‌ నడవట్లేదు. అందరికీ జీతాలివ్వలేను. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరిని తీసేయాలనుకుంటున్నా’ అన్నారు. కాళ్లు వణికిపోయాయి. అప్పులు, పస్తులు, ఫైల్‌ పట్టుకొని రోడ్డెక్కడం కళ్లముందు మెదిలి గుండెదడ మొదలైంది. మనసేం బాగోక అలాగే సీట్లో కూర్చుండిపోయా. నా బాధ గమనించాడేమో! ‘ఏం కాదులే.. దీనికింత ఇదైపోవాల్సిన పన్లేదు. ఈమాత్రం పని ఎక్కడైనా దొరుకుతుంది. ఎక్కువగా ఆలోచించకు’ భుజం మీద చేయేసి భరోసా ఇచ్చాడు. మనసు కుదుట పడింది.

జీతాలిచ్చే రోజు. డబ్బులు చేతికందగానే శ్యామ్‌తో రెస్టరెంట్‌కి వెళ్లి డిన్నర్‌ చేయాలనుకున్నా. కానీ ఆఫీసులో తనెక్కడా కనిపించలేదు. సెలవులో ఉన్నాడనుకున్నా. సాయంత్రం ఓనరు పిలిచి ‘ఇది నీది, ఇది శ్యామ్‌ది. నీ దగ్గర తీసుకున్నాడటగా.. తనదీ నీకే ఇవ్వమన్నాడు’ అంటూ రెండు కవర్లు చేతిలో పెట్టారు. తెరిచి చూస్తే పదిహేను వేల రూపాయలు. నాకంతా ఆయోమయం. సీటు దగ్గరికి రాగానే కొలీగ్‌ ఒక చీటీ ఇచ్చాడు. ‘సారీ మహేష్‌.. నీతో చెప్పకుండా జాబ్‌ మానేశా. అర్జెంటు పని మీద ఊరెళ్లా. నా జీతం డబ్బులు తీసుకో. సాఫ్ట్‌వేర్‌ కోర్సు నేర్చుకోవడానికి వాడుకో. మనం మళ్లీ కలిసేనాటికి నువ్వు మంచి పొజిషన్‌లో ఉండాలి’ చీటీ చదువుతుంటే నా కళ్లలో తడి. ఆఫీసులో ఇద్దరిలో ఒకరమే ఉండాల్సిన పరిస్థితి రావడంతో నాకోసమే తను జాబ్‌ మానేశాడని అర్థమైంది. తన త్యాగానికి విలువ దక్కేలా చేయాలనుకున్నా. ఆఫీసు పని చేస్తూనే ఉదయం ‘డాట్‌నెట్‌’ కోర్సులో చేరా. క్షణం ఖాళీ దొరికినా బాగా ప్రిపేర్‌ అయ్యేవాణ్ని. నా కష్టం ఫలించింది. కోర్సు పూర్తవగానే మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఈ నాలుగేళ్లలో రెండు ప్రమోషన్లు అందుకున్నా. మంచి జీతం. అప్పులన్నీ తీరాయి. జీవితంలో సెటిలవడంతో నా జీవితంలోకి ఒకమ్మాయిని ఆహ్వానిస్తున్నా. ఈ నెలలోనే పెళ్లి.

నేను ఈ స్థాయికి చేరడం శ్యామ్‌ చలవే. ఈ కాలంలో ఒక స్నేహితుడి కోసం ఎవరూ ఇంత గొప్ప పని చేయరు. తర్వాత శ్యామ్‌ని కలవాలని ఎంతో ప్రయత్నించా. ఫోన్‌ కలవట్లేదు. సామాజిక మాధ్యమాల్లో దొరకలేదు. అయినా నా నేస్తం కోసం వెతుకులాట ఆపలేదు. ప్రియమిత్రుడు కలిస్తే ఒక్కసారి మనసారా హత్తుకొని ‘నా గెలుపు నీ పుణ్యమే శ్యామ్‌’ అని గట్టిగా చెప్పాలని ఉంది. ఈ స్నేహితుల దినోత్సవం నాడైనా ఆ కోరిక నెరవేరితే బాగుండు.    

- మహేష్‌


మరిన్ని

ap-districts
ts-districts