close

ఫీచర్ పేజీలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కారేలేని కార్ల షోరూం

కొత్త ట్రెండ్‌

అదో కార్ల షోరూం.. కానీ అక్కడ కార్లు బారులు తీరి ఉండవు... లోపలికెళ్లగానే అక్కడో పెద్ద తెర.. దానికెదురుగా మీటల బోర్డు... వాటిని మీటగానే కోరుకున్న మోడల్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది... ఒక్కో బటన్‌ నొక్కుతూ ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌, ఫీచర్లు.. ప్రతి విభాగం అణువణువూ చూడొచ్చు... నిజమైన వాహనాన్ని పరిశీలించిన అనుభూతి చెందొచ్చు... ఎంజీ మోటార్‌ దేశంలోనే మొదటిసారి ఇలాంటి డిజిటల్‌ కారు స్టూడియో ప్రారంభించింది... నాలుగేళ్లలో ఇండియాలో సగం షోరూంలు ఇదే తరహాలో ఉండబోతున్నాయన్నది ఆటోమొబైల్‌ పండితుల అంచనా.
షోరూంలో అడుగుపెట్టగానే మనకు తళతళ మెరిసే వాహనాలు కనిపిస్తాయి. వాటిని తడిమి చూసి, ఫీచర్లు తెలుసుకొని, కాసేపు అందులో కూర్చొని అన్నీ నచ్చిన తర్వాతే ఎవరైనా.. ఆ బండి కొనాలా? వద్దా? అనే నిర్ణయానికి వస్తారు. కానీ కేవలం దృశ్యరూపంలో తెరపై చూసినంత మాత్రాన నిజమైన అనుభూతి కలుగుతుందా? వివరాలన్నీ స్పష్టంగా తెలుస్తాయా? అంటే అంతకుమించిన సంతృప్తి సొంతం చేసుకోవచ్చు అంటారు ఎంజీ మోటార్‌ ప్రతినిధులు. నిజానికి కొనుగోలుదారులు షోరూంలో అడుగుపెట్టడానికి ముందే పెద్దఎత్తున కసరత్తు చేస్తారట. వాహనాలు కొనాలి అనుకునేవాళ్లలో 62శాతం మంది ఆన్‌లైన్‌లో గాలించి వివరాలు సేకరించాకే డీలర్ల దగ్గరికి వెళ్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. మరో రెండేళ్లలో వాహనాల అమ్మకాల్లోనూ 60శాతం వెబ్‌సైట్‌, మొబైల్‌, సోషల్‌మీడియా, యాప్‌లాంటి డిజిటల్‌ ప్లాట్‌ఫాంల ద్వారానే జరుగుతాయని భారతీయ వాహన తయారీదారుల సమాఖ్య (సియామ్‌) అంచనా వేస్తోంది. అంటే జనం ఒకరకంగా అత్యాధునిక టెక్నాలజీ, కొత్త ట్రెండ్‌కి సిద్ధమవుతున్నారని అర్థమవుతోంది. ఆపై ఎలాంటి సందేహాలు వచ్చినా తీర్చడానికి సాంకేతికాంశాలపై పట్టున్న డీలర్‌షిప్‌ ప్రతినిధులు ఉండనే ఉంటారు. కాబట్టి డిజిటల్‌ కారు స్టూడియోలు భవిష్యత్తులో విజయవంతం అవుతాయని ఆటోమొబైల్‌ నిపుణుల నిశ్చితాభిప్రాయం.
ఎలా ఉంటుందంటే..
ఎంజీ మోటార్‌ బెంగళూరులో డిజిటల్‌ కారు షోరూం తెరిచి దేశంలో సరికొత్త ఆటోమొబైల్‌ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. ఈ స్టూడియోలోకి వెళ్లగానే పెద్ద వీడియో తెర దర్శనమిస్తుంది. దానికెదురుగా డిజిటల్‌ టూల్స్‌ మీటలతో కూడిన బోర్డు ఉంటుంది. ఇది కృత్రిమ మేధ, ఇమ్మెర్సివ్‌ వాయిస్‌ రికగ్నిషన్‌ ద్వారా అనుసంధానమవుతుంది. టూల్స్‌ బోర్డుపై గుండ్రంగా ఉన్న మీటలు తిప్పుతూ 360 డిగ్రీల కోణంలో కారులో అంగుళం అంగుళం తెరపై చూడొచ్చు. లోపలి నుంచి బయటివరకు కొత్త మోడల్‌కి సంబంధించి ప్రతి చిన్న శబ్దాన్ని స్పష్టంగా వినొచ్చు. మరో మాటలో చెప్పాలంటే ఈ పద్ధతి ద్వారా కారుపై ఏమాత్రం అవగాహన లేని వారు సైతం స్పష్టమైన సమాచారం తెలుసుకోవచ్చు అంటారు ఎంజీ మోటార్‌ ప్రతినిధులు. ఈ రకం షోరూంలు మనకు కొత్తే అయినా విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఆడీ, బీఎండబ్ల్యూ, టాటా మోటార్స్‌లాంటి కంపెనీలు సైతం డిజిటల్‌ స్టూడియోల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
అభిరుచికి అనుగుణంగా..
‘మారుతున్న కాలానికి అనుగుణంగా, వినియోగదారుల అభిరుచిని అందిపుచ్చుకునేలా మారాల్సిన అవసరం ఉందనీ, ఆ క్రమంలోనే ఈ డిజిటల్‌ షోరూంలు వచ్చాయంటున్నారు ఆటోమొబైల్‌ తయారీదారులు. మిలీనియల్స్‌, యువ కొనుగోలుదారులు, కొత్తరకం టెక్నాలజీని తేలిగ్గా అందిపుచ్చుకునేవారు ఈ కొత్త ట్రెండ్‌ని ఎంతో ఆస్వాదిస్తారనీ, భవిష్యత్తులో ఈ తరహా డిజిటల్‌ షోరూంలే ఎక్కువగా ఉండబోతున్నాయి’ అంటారు ఎంజీ మోటార్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ చాబా. అన్నింటికీ మించి నగరాలు, పట్టణాల్లో పెద్దపెద్ద షోరూంలను నిర్వహించడం వాహన కంపెనీలకు తలకుమించిన భారం అవుతోంది. డిజిటల్‌ స్టూడియోలు విజయవంతమైతే ఒక షోరూం మీద నెలకు నాలుగున్నర లక్షల రూపాయల వరకు మిగులుతుందంటారు చాబా. అందుకే ఆటోమొబైల్‌ కంపెనీలు  డీలర్‌షిప్‌లను మల్టీ ఫార్మాట్‌ సేల్స్‌ ఛానెళ్లుగా మార్చబోతున్నాయి. డిజిటల్‌ స్టూడియోలకు కొంత స్థలం కేటాయించి మిగిలిన ప్రదేశంలో షోరూం ఆపరేషన్లు, కార్యాలయాలు, మొబైల్‌ విజిట్‌ కేంద్రాలుగా మార్చుతారని ప్రచారం జరుగుతోంది.
వర్చువల్‌ వచ్చేస్తోంది
మన దగ్గర ఇప్పుడిప్పుడే డిజిటల్‌ యుగం మొదలైనా అమెరికా, బ్రిటన్‌లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వర్చువల్‌ షోరూంలు కూడా వచ్చేశాయి. దీంట్లోకి వెళ్లగానే కారు కంపెనీ ప్రతినిధులు కొనుగోలుదారుడి తలకి ఒక వీఆర్‌ హెడ్‌సెట్‌ అమర్చుతారు. దీనిద్వారా కారు డిజైన్‌, ఇంజిన్‌ విభాగాలు, భద్రతా ఫీచర్లు, ఇతర ప్రత్యేకతలు అన్నీ కళ్లముందే కనిపిస్తాయి. దీంతో డెమో కారులో డ్రైవింగూ చేసేయొచ్చు. వాహనసంస్థలు అత్యాధునిక టెక్నాలజీ వాడుకోవడంలో ఇది మరో ముందడుగు. ఆడీ కంపెనీ అమెరికా, జర్మనీ, బ్రిటన్‌లలో ఈ తరహా వర్చువల్‌ షోరూంలు నిర్వహిస్తోంది. మెర్సిడెస్‌ బెంజ్‌, షెవర్లే, హ్యుందాయ్‌, టెస్లా, లాంబోర్ఘినీలు సైతం వేర్వేరు దేశాల్లో ఈ కారు స్టూడియోలు ప్రారంభించాయి. త్వరలోనే ఈ తరహా షోరూంలు భారత్‌కు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

డిజిటల్‌తో లాభాలు
* షోరూం నిర్వహణకు భారీ స్థలం కేటాయించాల్సిన  అవసరం లేదు.
* డీలర్‌షిప్‌ నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి.
* తక్కువ సిబ్బందితోనే షోరూంని నిర్వహించవచ్చు. జీతాలు మిగులుతాయి.
* డెమో వాహనాల ఖర్చు తగ్గుతుంది.
* ఖర్చులు తగ్గడంతో కంపెనీలు ఆఫర్లు, డిస్కౌంట్లతో  కొంతైనా కొనుగోలుదారులకు బదలాయిస్తారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు