Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం పడింది.

Updated : 07 May 2024 22:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు వరుణిడి రాక ఉపశమనం కలిగించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో వేసవి తాపం నుంచి ప్రజలకు ఊరట కలిగింది. దాదాపు గంట సేపు వర్షం కురవడంతో రహదారులు జలమయం కాగా, డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్‌, మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, ఆల్వాల్‌, ప్యారడైజ్‌, ప్యాట్నీ, ఎల్బీనగర్‌, కాప్రా, సుచిత్ర జీడిమెట్ల, మలక్‌పేట, ఎర్రగడ్డ, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, ముషీరాబాద్‌, చిక్కడపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి వరదనీరు చేరింది. 

మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్‌లో రోడ్లపై భారీగా వర్షం నీరు చేరడంతో  ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రాయదుర్గం బయోడైవర్సిటీ నుంచి ఐకీయా వరకు, ఖాజాగూడ చౌరస్తా నుంచి డీపీఎస్‌ వరకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఐటీ కారిడార్‌లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పలు చోట్ల చెట్లు విరిగి పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం, ఈదురు గాలుల వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో..

తెలంగాణలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్‌, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, ములుగు జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మానుకొండూర్‌, హుజూరాబాద్‌, పెద్దపల్లి, మల్యాల, పెగడపల్లి, వేములవాడలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

కరీంనగర్‌లో కూలిన టెంట్లు.. సీఎం సభ వాయిదా

సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనాల్సిన కాంగ్రెస్‌ జనజాతర సభకోసం కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి. ఈదురుగాలుల ధాటికి కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. ఆ సమయంలో టెంట్ల కింద కార్యకర్తలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వర్షం కారణంగా సీఎం సభ వాయిదా పడింది.

అకాల వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

తెలంగాణలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్‌, పోలీసు, విద్యుత్‌ అధికారులతో సమీక్షించారు. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌ స్తంభాలు కూలిన చోట తక్షణం పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో రహదారులపై నిలిచిన నీటిని తక్షణమే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని