close

క్రీడలు

ఆసీస్‌ జోరా.. ఇంగ్లాండ్‌ ప్రతీకారమా? 

యాషెస్‌ రెండో టెస్టు నేటి నుంచే 
మధ్యాహ్నం 3.30 నుంచి సోనీ సిక్స్‌లో

లండన్‌: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో మరో సమరానికి రంగం సిద్ధమైంది. బుధవారం నుంచే రెండో టెస్టు. ప్రపంచకప్‌ గెలిచి ఊపుమీదున్న ఇంగ్లాండ్‌ను దాని సొంతగడ్డపై తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓడించడంతో ఈ సిరీస్‌పై ఆసక్తి రెట్టింపైంది. మరి లార్డ్స్‌ మైదానంలో జరగబోతున్న రెండో టెస్టులో కంగారూల జోరు కొనసాగి ఆధిక్యం రెట్టింపవుతుందా.. ఇంగ్లాండ్‌ ప్రతీకార విజయంతో సిరీస్‌ను సమం చేస్తుందా అన్నది ఆసక్తికరం. తొలి టెస్టు తొలి మూడు రోజుల్లో ఇంగ్లాండే ఆధిపత్యం చలాయించినప్పటికీ.. స్మిత్‌ అద్భుతంగా పోరాడి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాదడంతో మ్యాచ్‌ ఆసీస్‌ వైపు మళ్లింది. తొలి మ్యాచ్‌ తప్పులు పునరావృతం కానివ్వకుండా లార్డ్స్‌లో గెలుపు బావుటా ఎగరేయాలని రూట్‌ సేన భావిస్తోంది. ఎడ్జ్‌బాస్టన్‌ విజయం ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేదే. రెండో టెస్టులో స్మిత్‌పై అందరి కళ్లూ నిలిచి ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లూ ఇద్దరు కీలక బౌలర్లను కోల్పోయాయి. తొలి టెస్టు మధ్యలో గాయపడి బౌలింగ్‌ నుంచి తప్పుకున్న అండర్సన్‌ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. అతడి స్థానంలో అరంగేట్ర ఆటగాడు జోఫ్రా ఆర్చర్‌ బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియా.. గాయం కారణంగా ప్యాటిన్సన్‌ సేవలు కోల్పోయింది. అతడి స్థానంలో స్టార్క్‌ లేదా హేజిల్‌వుడ్‌ తుది జట్టులోకి రావచ్చు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు