close

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రాభివృద్ధికి ఒక్క నిర్ణయమైనా తీసుకున్నారా?

దాడులు జరగకపోతే పోటాపోటీ సమావేశాలెందుకు?
వైకాపా 100రోజుల పాలనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా

ఈనాడు డిజిటల్‌, గుంటూరు: వంద రోజుల వైకాపా ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో రాజకీయ దాడులు, ఇసుక విధానంతో రోడ్డున పడ్డ లక్షల మంది భవన కార్మికులు, ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్టు సిబ్బంది మినహా ఎటువంటి అభివృద్ధి జరగలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. జగన్‌ పాలనలో రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక్క నిర్ణయమైనా తీసుకున్నారా? అనే విషయాన్ని ఆలోచించుకోవాలన్నారు. గత ప్రభుత్వ అవినీతిని బూచీగా చూపించి రివర్స్‌ టెండరింగ్‌ పేరిట నిర్మాణాలన్నింటినీ ఆపేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేలా చేశారని మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చెప్పే పనులకు చేసే పనులకు సంబంధం లేదని, మూడు నెలల పాలనలోనే జగన్‌కు పరిపాలనపై పట్టు సడలిందా? అనే అనుమానం కలుగుతుందని చెప్పారు. నాలుగు లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని చెబుతూ.. అంతకు రెండింతల మందిని బజారున పడేశారని, సెప్టెంబరు 5న ఇసుక విధానాన్ని ప్రకటిస్తామని చెప్పడంతో భవన కార్మికులు రోడ్డున పడ్డారని, పరిశ్రమల్లో స్థానికులకే 75శాతం రిజర్వేషన్లని చెప్పడంతో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించి రాయలసీమలో ఉన్న అసంపూర్తి ప్రాజెక్టులపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.  గ్రామాల్లో అమాయకుల మీద దాడులు జరగకపోతే పోటాపోటీగా మీ పార్టీ నాయకులు సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. భాజపా కార్యకర్తలపై గ్రామాల్లో జరిగిన దాడులకు నిరసనగా 16న ధర్నా చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి కిశోర్‌బాబు, తదితర నేతలు పాల్గొన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు