Trading hours: ట్రేడింగ్‌ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!

Trading hours: స్టాక్‌ బ్రోకర్‌ కమ్యూనిటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌లో ట్రేడింగ్‌ సమయం పొడిగించే అంశాన్ని సెబీ తిరస్కరించింది.

Published : 07 May 2024 13:45 IST

Trading hours | ముంబయి: డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌లో ట్రేడింగ్‌ సమయం (trading hours) పొడిగించేందుకు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (NSE) చేసిన ప్రతిపాదనను మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) పక్కనపెట్టింది. స్టాక్‌ బ్రోకర్‌ కమ్యూనిటీలో ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజీలైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ కార్యకలాపాలు మధ్యాహ్నం 3.30 గంటలతో ముగుస్తున్నాయి. క్యాష్‌, ఎఫ్‌అండ్‌ఓ సెగ్మెంట్‌లో ట్రేడింగ్‌ కూడా అదే సమయంతో నిలిచిపోతోంది.

అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా వ్యవహరించేందుకు వీలుగా తొలి దశలో ఇండెక్స్‌ ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ను సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించాలని ఎన్‌ఎస్‌ఈ సెబీకి ప్రతిపాదించింది. రెండో దశలో రాత్రి 11.30 గంటల వరకు, మూడో దశలో క్యాష్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ గంటలను సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలని తన ప్రతిపాదనల్లో పేర్కొంది. దేశీయ కాలమానం ప్రకారం.. మన మార్కెట్ల అనంతరం యూరోపియన్‌ మార్కెట్లు ప్రారంభమవుతాయి. అమెరికా మార్కెట్లు రాత్రి 7 గంటలకు(భారతీయ కాలమానం ప్రకారం) తెరుచుకుంటాయి. దీనివల్ల మార్కెట్‌ అనంతరం అంతర్జాతీయంగా ఏదైనా పరిణామం జరిగితే.. దానికి అనుగుణంగా ట్రేడర్లు అప్రమత్తం అవ్వడానికి వీలుంటుందని ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. 

నెల క్రితం ప్రమోషన్‌.. ఇప్పుడు లేఆఫ్‌.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!

ఎన్‌ఎస్‌ఈ చేసిన ఈ ప్రతిపాదన పట్ల కొందరు స్టాక్‌ బ్రోకర్లు అభ్యంతరాలు లేవనెత్తారు. ట్రేడింగ్‌ సమయం పెంపు వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌పై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల అదనపు మ్యాన్‌ పవర్‌ కూడా అవసరం పడుతుందని, నిర్వహణ పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సంప్రదాయ స్టాక్‌ బ్రోకర్లు సెబీకి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. డిస్కౌంట్‌ బ్రోకర్లు మాత్రం గడువు పొడిగింపునకు మొగ్గు చూపారు. ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ నిర్ణయాన్ని సెబీ పక్కనపెట్టింది. భవిష్యత్‌లో బ్రోకర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ట్రేడింగ్‌ సమయం పెంపు పట్టాలెక్కే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని