సన్‌రైజర్స్‌పై సూర్యప్రతాపం

ఐపీఎల్‌-17లో 11 మ్యాచ్‌లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్‌.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఝలక్‌ ఇచ్చింది.

Updated : 07 May 2024 06:42 IST

శతకంతో చెలరేగిన సూర్య కుమార్‌
ముంబయి ఘనవిజయం
ముంబయి

ఐపీఎల్‌-17లో 11 మ్యాచ్‌లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్‌.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఝలక్‌ ఇచ్చింది. బంతితో విజృంభించి, బ్యాటుతో చెలరేగిన ముంబయి ఇండియన్స్‌.. సన్‌రైజర్స్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. విధ్వంసక బ్యాటింగ్‌తో ఒక దశలో ప్రత్యర్థి జట్లన్నింటినీ వణికించి, ఆపై గాడి తప్పిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. మరోసారి తేలిపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.

ప్లేఆఫ్స్‌ రేసులో ప్రతి మ్యాచ్‌ కీలకంగా మారిన దశలో సన్‌రైజర్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సోమవారం వాంఖడేలో హైదరాబాద్‌ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ముంబయి 16 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్‌ (102 నాటౌట్‌; 51 బంతుల్లో 12×4, 6×4) మెరుపు శతకంతో జట్టుకు ఘనవిజయాన్నందించాడు. తిలక్‌ వర్మ (37 నాటౌట్‌; 32 బంతుల్లో 6×4) అతడికి సహకారమందించాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ (1/22) ఆకట్టుకున్నాడు. మొదట హైదరాబాద్‌ 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (48; 30 బంతుల్లో 7×4, 1×6), ప్యాట్‌ కమిన్స్‌ (35 నాటౌట్‌; 17 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. పియూష్‌ చావ్లా (3/33), హార్దిక్‌ పాండ్య (3/31) ఆ జట్టును దెబ్బ తీశారు. 12 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌కిది ఆరో ఓటమి.

అలా మొదలై..: ముంబయి ఇన్నింగ్స్‌ ఆరంభం చూస్తే ఆ జట్టు చిత్తుగా ఓడిపోతుందనే అనిపించి ఉంటుంది ఎవ్వరికైనా. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (9), రోహిత్‌ శర్మ (4) పేలవ ఫామ్‌ను కొనసాగించగా.. మూడో స్థానంలో వచ్చిన నమన్‌ ధీర్‌ (0) కూడా తేలిపోయాడు. ఇషాన్‌ను యాన్సెన్‌, రోహిత్‌ను కమిన్స్‌ పెవిలియన్‌ చేర్చారు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో మెయిడెన్‌ వేసిన భువి.. అయిదో ఓవర్లో ధీర్‌ను ఔట్‌ చేశాడు. 5 ఓవర్లకు 36/3తో ముంబయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో ఆత్మరక్షణకు పోకుండా.. ఎదురుదాడి చేసిన సూర్యకుమార్‌ నిమిషాల్లో మ్యాచ్‌ గమనాన్ని మార్చేశాడు. చూస్తుండగానే స్కోరు బోర్డు రాకెట్‌ వేగాన్నందుకుంది. మరో ఎండ్‌లో తిలక్‌ వర్మ ఆచితూచి ఆడుతూ సహకరిస్తుంటే.. సూర్య చెలరేగిపోయాడు. ఆరంభంలో పొదుపుగా బౌలింగ్‌ చేసిన బౌలర్లందరి గణాంకాలను అతను మార్చేశాడు. యాన్సెన్‌ వేసిన ఏడో ఓవర్లో సూర్య రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదడంతో 22 పరుగులొచ్చాయి. 30 బంతుల్లో అర్ధశతకం సాధించిన సూర్య.. ఆపై టాప్‌ గేర్‌లోకి వెళ్లిపోవడంతో ముంబయికి ఎదురు  లేకపోయింది. వికెట్టూ పడక, పరుగులూ ఆగక సన్‌రైజర్స్‌ ఓటమికి చేరువైంది. ముంబయి విజయానికి 6 పరుగులు అవసరమైన స్థితిలో 96పై నిలిచిన సూర్య.. సిక్స్‌ కొట్టి శతకం పూర్తి చేయడంతో పాటు మ్యాచ్‌ను ముగించాడు.

మొదట హెడ్‌.. ఆఖర్లో కమిన్స్‌: మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ ఏ దశలోనూ సౌకర్యవంతంగా కనిపించకపోయినా, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినా.. మొదట్లో హెడ్‌, చివర్లో కమిన్స్‌ ధాటిగా ఆడి జట్టుకు పోరాడే స్కోరునందించారు. సీజన్‌ ఆరంభంలో మెరుపు ఆరంభాలందించి.. ఆ తర్వాత లయ తప్పిన హెడ్‌, అభిషేక్‌ జోడీ ఈ మ్యాచ్‌లో కూడా తడబడింది. మొదట్లో హెడ్‌ తన శైలికి విరుద్ధంగా నెమ్మదిగానే ఆడాడు. అభిషేక్‌ ఎంతోసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అతణ్ని బుమ్రా పెవిలియన్‌ చేర్చాడు. కాసేపటికే హెడ్‌ను అరంగేట్ర బౌలర్‌ కాంబోజ్‌ ఔట్‌ చేశాడు. కానీ అది నోబాల్‌ కావడంతో హెడ్‌ బతికిపోయాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న హెడ్‌ ధాటిగా స్కోరు పెంచాడు. కాంబోజ్‌ బౌలింగ్‌లోనే హెడ్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను తుషార చేజార్చినా.. కాసేపటికే హెడ్‌ను చావ్లా ఔట్‌ చేసి ముంబయికి ఉపశమనాన్నిచ్చాడు. అంతకంటే ముందు మయాంక్‌ (5)ను కాంబోజ్‌ బౌల్డ్‌ చేశాడు. సీజన్‌ ఆరంభంలో పేలవ ప్రదర్శన చేసి హెడ్‌ తుది జట్టులోకి వచ్చాక జట్టులో చోటు కోల్పోయిన మయాంక్‌.. ఈ మ్యాచ్‌తో మళ్లీ దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. హెడ్‌ ఔటయ్యాక వికెట్ల పతనం ఊపందుకుంది. ఓ ఎండ్‌లో హార్దిక్‌.. మరో ఎండ్‌లో చావ్లా వికెట్ల మీద వికెట్లు పడగొట్టారు. నితీశ్‌ (20)తో పాటు యాన్సెన్‌ (17), షాబాజ్‌ (10)లను హార్దిక్‌ పెవిలియన్‌ చేర్చాడు. ప్రమాదకర క్లాసెన్‌ (2)ను చావ్లా బౌల్డ్‌ చేశాడు. 16 ఓవర్లకు 125/7తో నిలిచిన సన్‌రైజర్స్‌ 150 అయినా దాటుతుందా అన్న సందేహాలు కలిగాయి. అయితే కెప్టెన్‌ కమిన్స్‌ ఆఖరి ఓవర్లో చెలరేగి ఆడి జట్టుకు ఊహించిన దాని కంటే ఎక్కువ స్కోరే సాధించి పెట్టాడు. అతడి ధాటికి చివరి 4 ఓవర్లలో హైదరాబాద్‌ 48 పరుగులు సాధించింది.

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) తిలక్‌ (బి) చావ్లా 48; అభిషేక్‌ (సి) ఇషాన్‌ (బి) బుమ్రా 11; మయాంక్‌ (బి) కాంబోజ్‌ 5; నితీశ్‌ (సి) కాంబోజ్‌ (బి) హార్దిక్‌ 20; క్లాసెన్‌ (బి) చావ్లా 2; యాన్సెన్‌ (బి) హార్దిక్‌ 17; షాబాజ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) హార్దిక్‌ 10; సమద్‌ ఎల్బీ (బి) చావ్లా 3; కమిన్స్‌ నాటౌట్‌ 35; సన్వీర్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 173; వికెట్ల పతనం: 1-56, 2-68, 3-90, 4-92, 5-96, 6-120, 7-124, 8-136; బౌలింగ్‌: తుషార 4-0-42-0; అన్షుల్‌ కాంబోజ్‌ 4-0-42-1; బుమ్రా 4-0-23-1; హార్దిక్‌ 4-0-31-3; చావ్లా 4-0-33-3

ముంబయి ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (సి) మయాంక్‌ (బి) యాన్సెన్‌ 9; రోహిత్‌ (సి) క్లాసెన్‌ (బి) కమిన్స్‌ 4; నమన్‌ ధీర్‌ (సి) యాన్సెన్‌ (బి) భువనేశ్వర్‌ 0; సూర్యకుమార్‌ నాటౌట్‌ 102; తిలక్‌వర్మ 37 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు 22 మొత్తం: (17.2 ఓవర్లలో 3 వికెట్లకు) 174; వికెట్ల పతనం: 1-26, 2-31, 3-31; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-1-22-1; యాన్సెన్‌ 3-0-45-1; కమిన్స్‌ 4-1-35-1; నటరాజన్‌ 3.2-0-31-0; నితీశ్‌కుమార్‌ 2-0-16-0; షాబాజ్‌ 1-0-11-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని