China: చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి

చైనాలోని ఓ ఆసుపత్రిలో దుండగుడు కత్తులతో జరిపిన దాడిలో పలువురు చనిపోయారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు.

Updated : 07 May 2024 14:52 IST

బీజింగ్‌: చైనాలోని ఓ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు కత్తులతో జరిపిన దాడిలో పలువురు చనిపోయారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. పది మంది పరిస్థితి అత్యంత విషమంగా లేదా చనిపోయినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. మరణాల సంఖ్యను అక్కడి అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. యున్నాన్‌ ప్రావిన్సులో ఈ ఘటన జరిగింది.

ఝావోటాంగ్‌ నగరంలో ఉన్న ఆసుపత్రిలోకి ప్రవేశించిన ఓ దుండగుడు అక్కడున్న వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. అడ్డు వచ్చిన వారిపైనా దాడి చేశాడు. ఈ ఘటనలో దాదాపు 23 మందికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మరింతమంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్పారు. అనుమానితుడిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

డ్రాగన్‌ కుట్రలు.. ఇతర దేశాల ఎన్నికల్లో చైనా జోక్యం ఇలా..

ఇదిలాఉంటే, మారణాయుధాలను కలిగిఉండటంపై నిషేధమున్న చైనాలో.. ఇటువంటి భారీ హింసాత్మక దాడులు అరుదనే చెప్పవచ్చు. అయినప్పటికీ ఇటీవల ఈ తరహా కత్తిపోట్ల దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాది ఆగస్టులో యున్నాన్‌ ప్రావిన్సులో ఓ వ్యక్తి జరిపిన కత్తి దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అంతకుముందు జులైలో గువాంగ్‌డాంగ్‌ ప్రావిన్సులోని ఓ ప్రైమరీ పాఠశాలలో జరిగిన కత్తి దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 2022లో జరిగిన ఇటువంటి ఘటనలో ముగ్గురు చనిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు