జగన్‌ కోసం.. ఎంతకైనా దిగజారుతా

నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది.

Updated : 07 May 2024 06:40 IST

వైకాపా కుట్రల అమలులో  వెనక్కి తగ్గని సీఎస్‌ జవహర్‌రెడ్డి
మొన్న పింఛన్లు.. తాజాగా పెట్టుబడి రాయితీ, ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌
ఎన్నికల షెడ్యూలుకు ముందే బటన్‌ నొక్కినా.. దురుద్దేశపూరితంగా ఖాతాల్లో జమచేయని వైనం

ఈనాడు, అమరావతి: నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా అధికార వైకాపాపై మితిమీరిన స్వామిభక్తిని ప్రదర్శిస్తున్న ఆయన... తన ప్రతి నిర్ణయాన్ని, ప్రతి అడుగునూ ఆ పార్టీకి ఎన్నికల్లో లబ్ధి కలిగించటమే లక్ష్యంగా వేయటంలో ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ఎన్నికల సమయంలోనైనా తటస్థంగా, నిష్పాక్షికంగా వ్యవహరిస్తారేమోననుకుంటే... ‘‘లేదు లేదు.. అధికార పార్టీతో అంటకాగుతూ.. ఇంకా అథఃపాతాళానికి దిగజారుతూనే ఉంటా’’ అని తన చేతల ద్వారా పదే పదే నిరూపించుకుంటున్నారు. ఇంటివద్దకే పింఛన్లు అందించే అవకాశమున్నా.. వృద్ధుల్ని మండుటెండల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేసి సీఎస్‌ జవహర్‌రెడ్డి వారిని ముప్పుతిప్పలు పెట్టారు. ఆ నెపం విపక్షాలపై నెట్టేందుకు జగన్‌ పన్నిన దుష్టపన్నాగంలో అన్నీ తానై వ్యవహరించారు. ఇలా జగన్‌ కుట్రలను యథేచ్ఛగా అమలుచేస్తున్న ఆయన తాజాగా రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల వ్యవహారంలో మరో కుతంత్రానికి తెరలేపారు. ఈ దురుద్దేశాన్ని గుర్తించే ఎన్నికల సంఘం వాటి విడుదలకు అనుమతి నిరాకరించి అడ్డుకట్ట వేసింది.

ముందే జమచేసే అవకాశం ఉన్నా..

2023 ఖరీఫ్‌లో కరవు వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ పెట్టుబడి రాయితీని బాధిత రైతులకు వెంటనే చెల్లించలేదు. రూ.847 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లింపు కోసం మార్చి 6న, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.610 కోట్ల కోసం మార్చి 1న బటన్‌ నొక్కారు. సాధారణంగా ఆ వెంటనే మొత్తం సొమ్ము రైతులు, విద్యార్థుల ఖాతాల్లో జమకావాలి. మహా అయితే ఓ వారం పట్టొచ్చు. కానీ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశముందని తెలిసినా అప్పట్లో వారి ఖాతాల్లో సొమ్ములు జమచేయకుండా దురుద్దేశపూర్వక జాప్యం చేశారు. తీరా మార్చి 16న ఎన్నికల షెడ్యూలు విడుదలైపోయింది. కొన్ని రోజుల తర్వాత తీరిగ్గా ఆ సొమ్ము విడుదలకు అనుమతివ్వాలంటూ స్క్రీనింగ్‌ కమిటీ ముందు ప్రతిపాదనలు పెట్టారు. దానికి అధ్యక్షుడిగా ఉన్న సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆఘమేఘాలపై స్పందించి నిధుల విడుదలకు అనుమతివ్వాలంటూ ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించారు. పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు ఆ సొమ్ము రైతులు, విద్యార్థుల ఖాతాల్లో జమచేసి ఎన్నికల్లో వైకాపాకు అనుచిత ప్రయోజనం కలిగించాలనే కుతంత్రం దీని వెనక ఉంది. ఒకవేళ ఎన్నికల సంఘం స్క్రీనింగ్‌ కమిటీ ప్రతిపాదనలను తిరస్కరించి, నిధులు విడుదలకు అనుమతించకపోతే విపక్షాలు అడ్డుకోవటం వల్లే పెట్టుబడి రాయితీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులు చేయలేకపోయామంటూ ప్రతిపక్షాలపై విషప్రచారం చేయాలనే దురుద్దేశంతో ఇలా వ్యవహరించారు.

ప్రభుత్వ నిధులతో ఓట్లు కొనాలనే కుట్ర కాదా!

ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు దాదాపు రూ.13వేల కోట్ల మేర బిల్లులు చెల్లించి దోచిపెట్టారు. అప్పుడు జగన్‌కు, జవహర్‌రెడ్డికి రైతులకు చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గుర్తుకురాలేదా? వేలకోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నా... అప్పుడు ఎందుకు చెల్లించలేదు? వారం, పదిరోజుల్లో సొమ్ము జమచేస్తామని చెప్పి ఎందుకు జాప్యం చేశారు? అప్పుడు కుట్రపూరిత తాత్సారం చేసి... ఇప్పుడు ఎన్నికల సంఘానికి నిధుల విడుదల కోసం నివేదించటం ఏంటి? వారు అనుమతిస్తే పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చేసి... తద్వారా ప్రభుత్వ నిధులతో ఓట్లు కొనాలనే కుట్ర ఇది కాదా? ఎవరి మెప్పు కోసం, ఎవరి కళ్లలో ఆనందం కోసం, ఎవరికి అనుచిత ప్రయోజనాలు కోసం జవహర్‌రెడ్డి ఇదంతా చేశారనేది ప్రశ్నించుకుంటే జగన్‌, వైకాపా కోసమే ఆయన ఈ కుట్రను అమలు చేశారనేది తేటతెల్లమవుతుంది. ఎన్నికల సంఘం ఈ కుట్రను పసిగట్టే వాటి విడుదలకు అనుమతి నిరాకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని