Rohit - Yuvaraj: రోహిత్‌ శర్మను వరల్డ్ కప్‌ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్‌ సింగ్

వచ్చే టీ20 ప్రపంచకప్‌నకు రోహిత్‌ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్ అభిప్రాయపడ్డాడు. 

Updated : 07 May 2024 13:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma)పై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్ (Yuvaraj Singh) ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్‌నకు రోహిత్‌ శర్మ జట్టులో ఉండటం ఎంతో కీలకమని, అతను తెలివైన కెప్టెన్‌ అని ప్రశంసించాడు. జూన్‌ 2 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్‌ (T20 World Cup 2024)లో రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్‌ఇండియా బరిలోకి దిగనుంది. ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. 

‘‘రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉండటం ఎంతో కీలకం. ఒత్తిడిలో మంచి నిర్ణయాలు తీసుకునే తెలివైన కెప్టెన్ మనకు కావాలి. రోహిత్ శర్మకు ఆ సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉంది. అతడు కెప్టెన్‌గా ఐదు ఐపీఎల్‌ ట్రోఫీలు సాధించాడు. రోహిత్ సారథ్యంలో టీమ్ఇండియా 2023 వన్డే ప్రపంచ కప్‌లో అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరింది. భారత్‌కు కెప్టెన్‌గా రోహిత్‌లాంటి ఆటగాడు అవసరమని నేను భావిస్తున్నాను. ఎన్నో విజయాలు సాధించినా అతడి వ్యక్తిత్వంలో కొంచెం కూడా మార్పు రాలేదు. అదే రోహిత్ శర్మ బ్యూటీ. సహచర ఆటగాళ్లతో ఎప్పుడూ సరదాగా ఉంటాడు. మైదానంలో నాయకుడిగా ఆటగాళ్లకు అండగా నిలుస్తాడు. క్రికెట్‌లో నాకున్న అత్యంత ఆప్తమిత్రుల్లో రోహిత్ శర్మ ఒకరు. రోహిత్ శర్మను ప్రపంచ కప్ ట్రోఫీ, పతకంతో చూడాలని ఆశిస్తున్నాను. అతను నిజంగా దానికి అర్హుడు’’ అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ అన్నాడు. రోహిత్ శర్మకు కెరీర్‌ తొలినాళ్లలో యువరాజ్‌ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. తర్వాత వీరిద్దరూ మంచి మిత్రులుగా మారారు. 2007లో భారత్‌ టీ20 ప్రపంచకప్‌ సాధించిన జట్టులో యువీ, రోహిత్‌ సభ్యులుగా ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు