close

Updated : 04/03/2021 17:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అలా చేస్తే రూ. 75కే లీటర్‌ పెట్రోల్‌

ఎస్‌బీఐ ఆర్థికవేత్తల అభిప్రాయం

ముంబయి: చమురు ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకొస్తే దేశంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 75కు దిగొస్తుందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు అన్నారు. కానీ ఇందుకు రాజకీయ నాయకులు సిద్ధంగా లేరని, అందువల్లే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

‘‘పెట్రోలియం ఉత్పత్తులపై విధించే వ్యాట్, పన్నులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఆదాయవనరులు. అందువల్లే చమురు ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం, రాష్ట్రాలకు సుముఖంగా లేవు. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రవాణా ఛార్జీలు, డీలర్‌ కమిషన్‌, ఎక్సైజ్‌ సుంకం, సెస్‌, వ్యాట్‌ ఇలా పలు రకాల పన్నులు, ఛార్జీలు విధిస్తున్నాయి. లీటర్‌ పెట్రోల్‌పై రవాణా ఛార్జీలు రూ. 3.82, డీలర్‌ కమిషన్‌ రూ. 3.67, సెస్‌ రూ.30గా ఉంది. ఇక డీజిల్‌పై రవాణా ఛార్జీలు రూ. 7.25, డీలర్‌ కమిషన్‌ రూ. 2.53, సెస్‌ రూ. 20గా ఉంది. ఒక వేళ వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే అత్యధికంగా 28శాతం పన్ను ఉంటుంది. చమురు ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే రాష్ట్రాలకు నష్టం తప్పదు. అయితే అలా తెస్తే మాత్రం వినియోగదారులపై రూ.30  వరకు భారం తగ్గుతుంది. అప్పుడు లీటర్‌ పెట్రోల్‌ రూ. 75, లీటర్‌ డీజిల్‌ రూ. 68కే వస్తుంది’’అని సదరు ఆర్థికవేత్తలు వివరించారు. 

ఇంధన ఉత్పత్తులను జీఎస్‌టీ కిందకు తీసుకొస్తే కేంద్ర, రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందని, దేశ జీడీపీలో ఇది కేవలం 0.4శాతమేనని వారు పేర్కొన్నారు. అంతేగాక, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో ఇంధన ధరల్లో రోజువారీ మార్పులు చేయకుండా చమురు ధరలను స్థిరీకరించాలని ఆర్థికవేత్తలు సూచించారు. అంటే.. అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు వచ్చే లాభాలను, ధరలు పెరిగినప్పుడు వచ్చే లోటుతో పూడ్చుకోవాలన్నారు. అలా చేస్తే వినియోగదారులపై ఎలాంటి భారం పడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి..

కారు విలాసం కాదు.. అవసరం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని