మందుల ధరలు పెరిగే ప్రమాదం
close

Updated : 12/10/2021 08:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మందుల ధరలు పెరిగే ప్రమాదం

ముడి రసాయనాల ధరల మంట
ఔషధ కంపెనీల వ్యయాలు పైపైకి
చైనా నుంచి సరఫరాలు లేకే సమస్య
ఈనాడు - హైదరాబాద్‌

చైనాలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో మనదేశంలో ఔషధాల ధరలు పెరిగే ప్రమాదం ఏర్పడింది. మందులు ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి రసాయనాలు, సాల్వెంట్లు, ఇంటర్మీడియెట్లను ఉత్పత్తి చేసే చైనా కంపెనీలపై ఆ దేశ ప్రభుత్వం కఠిన కాలుష్య నిబంధనలతో కొరడా ఝుళిపిస్తోంది. దీంతో అక్కడి నుంచి మనదేశానికి ముడి రసాయనాలు తగినంతగా దిగుమతి కావడం లేదు. ఫలితంగా ఒక్కసారిగా రసాయనాలు ధరలు పెరిగిపోయాయి. పైగా కొరత కూడా ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా లభించే కొన్ని ముడి రసాయనాల ధరలను ఇక్కడి కంపెనీలు పెంచేశాయి. దీనివల్ల ఔషధ కంపెనీలు ముడిపదార్థాలు, ఇంటర్మీడియెట్లను అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖపట్నం పరిసరాల్లో ఔషధ పరిశ్రమలు కేంద్రీకృతమైన విషయం తెలిసిందే. ముడి రసాయనాలు, ఇంటర్మీడియెట్ల ధరలు బాగా పెరిగిపోవడంతో ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నట్లు ఈ ప్రాంతాల్లోని యూనిట్ల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

తక్కువ ధరల కోసమే చైనా వైపు

చైనాలో కఠినమైన కాలుష్య నిబంధనలను అమలు చేస్తూ, రసాయనాలను ఉత్పత్తి చేసే కంపెనీలను మూసి వేయడం గత నాలుగైదేళ్లుగా జరుగుతోంది. కానీ ఇటీవల కాలంలో ఆ దేశ ప్రభుత్వం నిబంధనలను ఇంకా కట్టుదిట్టం చేయడంతో  ఎన్నో యూనిట్లు మూతపడుతున్నాయి. ఈ పరిస్థితిని మనదేశంలో ప్రభుత్వం, పరిశ్రమ ఊహించినప్పటికీ తగిన ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోనందున ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకు తక్కువ ధరకు లభిస్తున్నాయనే కారణంతో చైనా నుంచి ముడిరసాయనాలను మన కంపెనీలు కొనుగోలు చేస్తూ వచ్చాయి. దీనివల్ల స్థానికంగా ముడిరసాయనాలు ఉత్పత్తి చేసే సంస్థలు తగ్గిపోయాయి. ఒక వేళ ఉన్నప్పటికీ చైనా ధరలతో పోటీపడలేని పరిస్థితి. వివిధ పథకాలు, ప్రోత్సాహకాల ద్వారా దేశీయంగా ముడి రసాయనాల ఉత్పత్తిని పెంచేందుకు ఇటీవల కాలంలో కొన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. అవి కార్యరూపం దాల్చడానికి ఎన్నో ఏళ్లు పడుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆరేడు నెలలు ఇంతేనా?

ముడి రసాయనాలు, ఇంటర్మీడియెట్లకు కొరత, అధిక ధర చెల్లించాల్సిన పరిస్థితులు ఆరేడు నెలల పాటు అయినా ఉండవచ్చని స్థానిక ఫార్మా కంపెనీ అధిపతి ఒకరు ‘ఈనాడు’కు వివరించారు. దీనివల్ల అధికంగా నష్టపోయేది ఔషధ కంపెనీలేనని, పెరిగిన ధరల భారాన్ని పూర్తిగా వినియోగదార్లపై మోపలేమని, ఆ మేరకు ఫార్మా కంపెనీల ఆదాయాలు, లాభాలు తగ్గిపోవచ్చని అన్నారు. మందుల ధరలు పెరగడం మాత్రం ఖాయమని పేర్కొన్నారు. నిత్యం ప్రజలు ఉపయోగించే మందుల ధరలు పెరిగి ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు.

మరికొన్ని రంగాలపైనా

తాజా ప్రభావంతో ఫార్మాతో పాటు కాగితం ఉత్పత్తి, రంగుల తయారీ, పీవీసీ ఉత్పత్తులు, రసాయనాలతో ముడిపడి ఉన్న ఇతర అనేక రకాల ఉత్పత్తుల ధరలూ పెరిగే పరిస్థితులు నెలకొన్నాయి. రసాయనాల కొరత, అధిక ధరలు ఈ రంగాల వ్యాపార సంస్థలకూ ఇబ్బందికరమే. పలు రకాల కాగితం తయారీలో నిమగ్నమైన ఒక దేశీయ సంస్థ తాజాగా టన్నుకు రూ.2,000 చొప్పున ధర పెంచినట్లు డీలర్లకు సమాచారం ఇచ్చింది. బొగ్గు, వృధా కాగితం ధరలు, రవాణా ఛార్జీలు పెరగటంతో పాటు రసాయనాల ధర అధికం కావటంతో ధర పెంచక తప్పలేదని స్పష్టం చేసింది.

* హెచ్‌-యాసిడ్‌, వినైల్‌ సల్ఫోన్‌, ఏబీఎస్‌, పాలీస్టెరీన్‌, టీడీఐ, ఎండీఐ, సీపీసీ బ్లూ, పిగ్మెంట్‌ గ్రీన్‌, రిఫ్రిజిరేంట్‌ గ్యాస్‌, ఫెనాల్‌ తదితర రసాయనాల ధరలు  గత 6 నెలల్లోనే 15 - 65 శాతం వరకు పెరిగాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని