Loan: రుణ భారం తగ్గించుకుందామిలా...
close

Updated : 05/12/2021 16:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Loan: రుణ భారం తగ్గించుకుందామిలా...

పండగల వేళ కొనుగోళ్లు.. ఇతర అవసరాల కోసం చాలామంది వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డులు లేదా ఇతర రుణాలను తీసుకుంటారు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఈ సమయంలో అప్పులను ఎంతో సులువుగా ఇస్తుంటాయి. ముఖ్యంగా ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండిలాంటి వాటికి ఇటీవల కాలంలో ఆదరణ పెరిగింది. రుణం తీసుకోవడంతోనే సరిపోదు కదా.. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించడమూ ముఖ్యమే. ఈ నేపథ్యంలో అప్పుల ఊబిలో నుంచి త్వరగా బయటపడేందుకు ఏం చేయాలి? తెలుసుకుందాం.

* ఎంత అప్పు ఉంది?.. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదే.. గృహ, వాహన, వ్యక్తిగత, వినియోగ వస్తువుల కోసం తీసుకున్న అప్పు, క్రెడిట్‌ కార్డు.. చేబదుళ్లు.. ఇలా అన్ని అప్పులనూ ఒకసారి ఒక చోట రాసి పెట్టుకోవాలి. అసలు మొత్తం ఎంత? ఇంకా ఎంత చెల్లించాలి? ఎన్నాళ్లు చెల్లించాలి? వడ్డీ భారం ఎంత పడుతోంది? ఇలా లెక్కలన్నీ తీయాలి. మీకు వచ్చే ఆదాయాన్ని, అందులో నుంచి వాయిదాలు చెల్లించగా మిగిలేది, పొదుపు ఎంత చేస్తున్నారు.. చూసుకోండి. మిగులు మొత్తాన్ని స్వల్పకాలిక రుణాలను తీర్చేందుకు వినియోగించే అవకాశం ఉందా పరిశీలించండి.

* ముందుగానే చెల్లించండి: సాధారణంగా రుణం తీసుకున్న నిర్ణీత వ్యవధి తర్వాతే ముందస్తు చెల్లింపులకు అనుమతిస్తారు. పండగల వేళ తీసుకున్న రుణాలకు ఈ అవకాశం ఉండకపోవచ్చు. కానీ, పాత రుణాలకు వెసులుబాటు ఉంటుంది. అధిక వడ్డీ ఉన్న రుణాలను మీ దగ్గరున్న పొదుపు మొత్తంతో ముందుగా చెల్లించేయండి. దీనివల్ల మీ ఈఎంఐ భారం తగ్గుతుంది. ముందస్తు తీర్చేటప్పుడు రుసుముల గురించీ చూసుకోండి.

* వాయిదా తప్పొద్దు: నెలవారీ వాయిదా (ఈఎంఐ), క్రెడిట్‌ కార్డుల బిల్లులను క్రమం తప్పకుండా చెల్లించడం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఒక్క రోజు ఆలస్యమైనా.. రుసుముల భారం తప్పదు. క్రెడిట్‌ కార్డును అధికంగా వినియోగించి, కనీస మొత్తం చెల్లిస్తూ వెళ్తుంటే.. వడ్డీ, రుసుములు అధికంగా పడుతుంటాయి. చివరకు బాకీ చెల్లించడం సవాలుగా మారుతుంది. వీలైనంత వరకూ మొత్తం బాకీని ఒకేసారి చెల్లించేయండి. సమయానికి బిల్లు చెల్లించకపోతే మీ క్రెడిట్‌ స్కోరూ దెబ్బతింటుంది.

* అన్నింటినీ ఒకే దగ్గరకు: పలు చోట్ల అప్పులు ఉండటం కన్నా.. ఒకేచోట ఉండటం ఎప్పుడూ మంచిదే. దీనివల్ల వడ్డీ భారమూ తగ్గుతుంది. ఒకే ఈఎంఐ ఉంటుంది కాబట్టి, దాన్ని క్రమం తప్పకుండా చెల్లించొచ్చు. అప్పులన్నీ ఒకేచోటకు తీసుకొస్తామని చెప్పి వడ్డీ రేటు తగ్గింపు కోసం బ్యాంకులను అడగవచ్చు. వ్యక్తిగత రుణం లేదా ఇంటి రుణంపైన టాపప్‌ లాంటివి ఇందుకోసం ప్రయత్నించవచ్చు. చిన్న రుణాలను ఒకచోటకు చేర్చడం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించకపోతే వాటిని అలా వదిలేయడమే ఉత్తమం.

* వ్యవధి తగ్గించుకోండి: తక్కువ వడ్డీ ఉన్నా.. దీర్ఘకాల వ్యవధికి తీసుకుంటే వడ్డీ భారం అధికంగానే ఉంటుంది. కాబట్టి, వీలైనంత వరకూ తక్కువ నెలల్లోనే రుణాన్ని తీర్చేందుకు ఏర్పాటు చేసుకోవాలి. ఇది సాధ్యం కాకపోతే.. వడ్డీ రేటు గురించి మీ బ్యాంకు/ఎన్‌బీఎఫ్‌సీతో బేరం ఆడండి. 1శాతం వడ్డీ తగ్గినా దాని ప్రభావం ఎంతో ఉంటుంది.

* అత్యవసర నిధితో: అత్యవసర నిధిని అప్పులు తీర్చేందుకు వాడుకోవద్దు అని నిపుణులు చెబుతుంటారు. మీ దగ్గర అత్యవసర నిధి అవసరానికి మించి ఉన్నప్పుడు, స్పల్పకాలంలో దీని అవసరం పెద్దగా ఉండకపోవచ్చు అని భావించినప్పుడు రుణాలకు చెల్లించవచ్చు. వీలైనంత తొందరగా ఈ నిధిని భర్తీ చేయడం తప్పనిసరి.

అప్పులు అధికంగా ఉంటే ఆర్థికారోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల మీ భవిష్యత్‌ లక్ష్యాలపట్ల రాజీ పడాల్సి వస్తుంది. రుణాలు తీసుకోవడం, క్రెడిట్‌ కార్డులను వాడటంలో నియంత్రణ పాటించినప్పుడే ఆర్థిక క్రమశిక్షణతో ఉండగలం అని గుర్తుంచుకోవాలి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని