పక్షవాతం కూడానా?
close
Published : 12/05/2020 00:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పక్షవాతం కూడానా?

సమస్య సలహా

సమస్య: కరోనా జబ్బు వస్తే జ్వరం, దగ్గు ఉంటాయని తెలుసు. తల తిరగటం, తూలటం, చివరికి పక్షవాతం కూడా రావొచ్చని కొందరు భయపెడుతున్నారు. ఇది నిజమేనా?

- ఎస్వీ రమణ, హైదరాబాద్‌

సలహా: మీరు విన్నది నిజమే. కరోనా జబ్బు ఆరంభమైన సమయంలో జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలే ఉంటాయని అనుకునేవారు. రాన్రాను ఇది ఊపిరితిత్తులకే పరిమితం కావటం లేదని.. గుండె, జీర్ణకోశ వ్యవస్థ వంటి వాటినీ దెబ్బతీస్తోందని బయటపడింది. ఇప్పుడు నాడీ వ్యవస్థ మీదా దుష్ప్రభావాలు చూపుతున్నట్టు తెలుస్తోంది. కరోనా జబ్బు బారినపడ్డ మూడో వంతు మందిలో నాడులకు సంబంధించిన లక్షణాలు పొడసూపుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తీవ్రమైన జబ్బుకు గురైనవారిలో ఇవి కనిపిస్తున్నాయి. కొందరికి వాసన, రుచి తగ్గటం, తల తిరగటం వంటి తేలికైన ఇబ్బందులకే పరిమితం అవుతుండగా.. మరికొందరిలో మెదడు వాపు, పక్షవాతం, గిలియన్‌ బారీ సిండ్రోమ్‌ వంటి ప్రమాదకర సమస్యలకూ దారితీస్తోంది. ఇందుకు మెదడుకు ఇన్‌ఫెక్షన్‌ రావటం, రోగనిరోధక శక్తి ప్రతిస్పందనలు దోహదం చేస్తున్నాయని భావిస్తున్నారు. కరోనా వైరస్‌ రెండు విధాలుగా మెదడుకు చేరుకునే అవకాశముంది. ముక్కులో వాసనను పసిగట్టే నాడీకణాలు ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు అక్కడ్నుంచి శ్వాసకోశ వ్యవస్థ ద్వారా మెదడుకు చేరుకోవచ్ఛు కరోనా వైరస్‌ ఏసీఈ2 ప్రొటీన్‌ గ్రాహకాల ద్వారానే కణాల్లోకి ప్రవేశిస్తుంది. మెదడులోని రక్తనాళాల గోడల లోపలి పొరల కణాల్లోనూ ఏసీఈ2 ప్రొటీన్‌ గ్రాహకాలుంటాయి. వీటి ద్వారా వైరస్‌ మెదడులోకి వ్యాపించి ఇన్‌ఫెక్షన్‌ కలగజేయొచ్ఛు దీంతో మెదడు వాపు, పక్షవాతం వంటివి సంభవించొచ్ఛు మెదడు వాపు మూలంగా మూర్ఛ, మత్తుగా ఉండటం వంటి లక్షణాలు తలెత్తొచ్ఛు ఇవే కాదు, కరోనా ఇన్‌ఫెక్షన్‌ను బలంగా ప్రతిఘటించే మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున నాడీ కణాల మీదా దాడి చేయొచ్ఛు ఇది గిలియన్‌ బారీ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. దీంతో నాడులు బలహీనమవుతాయి. ఫలితంగా కొందరికి కాళ్లు చేతులు చచ్చుబడొచ్ఛు వైరస్‌ రక్తనాళాల గోడల కణాలను దెబ్బతీయటం వల్ల రక్తం గడ్డలు ఏర్పడే ప్రమాదముంది. మెదడు రక్తనాళాల్లో ఇలాంటి గడ్డలు ఏర్పడితే పక్షవాతానికి దారితీయొచ్ఛు నిజానికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లలో మెదడు వాపు, పక్షవాతం, గిలియన్‌ బారీ సిండ్రోమ్‌ వంటివి తలెత్తటం చూస్తున్నదే. చాలారకాల వైరల్‌ ఇన్‌ఫెక్షన్లలో ఇలాంటివి పొడసూపుతుంటాయి. కాకపోతే ఇప్పుడు కరోనా మహమ్మారిగా విస్తరించటం వల్ల వీటి బారినపడుతున్నవారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో చాలామంది కంగారు పడిపోతున్నారు. అంత భయం అవసరం లేదు. నూటికి 80 మందిలో కరోనా మామూలుగానే తగ్గిపోతోంది. జబ్బు తీవ్రమైన వారిలోనే పక్షవాతం వంటి ప్రమాదకర సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగని తేలికగా తీసుకోవటానికి లేదు. ఇది ఎప్పుడెవరికి వస్తుందో, ఎప్పుడెలా పరిణమిస్తుందో తెలియదు. కాబట్టి తరచూ చేతులు కడుక్కోవటం, ఇతరులకూ దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించటం మంచిది. ఏవైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన

చిరునామా సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం,

రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email: sukhi@eenadu.inమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని