CoronaVaccine: ధరల్లో తేడా ఎందుకు? - why two prices for vaccines sc asks centre
close
Updated : 30/04/2021 13:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CoronaVaccine: ధరల్లో తేడా ఎందుకు?

కేంద్రంపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం

దిల్లీ: దేశంలో కరోనా సంక్షోభం.. నిర్వహణ అంశంపై దాఖలైన సుమోటో కేసుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ ప్రారంభించింది. వ్యాప్తి కట్టడి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ఒకింత అసహనం వ్యక్తం  చేసిన న్యాయస్థానం.. కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండేసి టీకా ధరలు ఎందుకు అని ప్రశ్నించిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. అసలు 100శాతం వ్యాక్సిన్లను కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయట్లేదని అడిగింది. 

ఆక్సిజన్‌ సరఫరా, అత్యవసర ఔషధాల పంపిణీ, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ‘‘ఆక్సిజన్‌ ట్యాంకర్లు, సిలిండర్లు అన్ని ఆసుపత్రులకు చేరేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎంతవరకు సరఫరా చేస్తున్నారు? లాక్‌డౌన్‌ తరహాలో తీసుకున్న ఆంక్షలు, చర్యలపై వివరాలు ఏవి? నిరుపేదలు, నిరక్షరాస్యులకు ఇంటర్నెట్‌ సదుపాయం ఉందా? మరి అలాంటి వారికి వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ ఎలా చేయిస్తున్నారు? స్మశానవాటికల్లో పనిచేసే వారికి టీకా ఎలా ఇస్తున్నారు? పేటెంట్‌ చట్టంలోని సెక్షన్‌ 92ను కేంద్రం అమలు చేస్తోందా? వ్యాక్సిన్‌ డోసులను కేంద్రమే 100శాతం ఎందుకు కొనుగోలు చేయడం లేదు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్మే టీకాల ధరల్లో ఎందుకు వ్యత్యాసం ఉంది? ఆ మేరకు సేకరణ పూర్తిగా కేంద్రమే చేపట్టి పంపిణీ వికేంద్రీకరణ చేయవచ్చు కదా? వ్యాక్సిన్‌ తయారీదారులు డోసులు అందించే క్రమంలో రాష్ట్రాల మధ్య సమానత్వాన్ని ఎలా పాటిస్తున్నారు? నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ ప్రోగ్రాం విధివిధానాలను కేంద్రం ఎందుకు పాటించట్లేదు? 18-44 ఏళ్ల మధ్య జనాభా ఎంత? వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంపులో కేంద్రం పెట్టుబడి ఎంత?’’ అంటూ ధర్మాసనం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. 

కరోనా చికిత్స ధరలను కేంద్రం ఏ విధంగా నియంత్రిస్తుందో చెప్పాలని కోర్టు సూచించింది. వైద్య సిబ్బంది కొరతను ఎలా అధిగమిస్తున్నారు? ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఉంటే తాత్కాలిక చికిత్స కేంద్రాలను ఎలా ఏర్పాటు చేస్తున్నారని అడిగింది. 

సోషల్‌మీడియాలో సాయం కోరడం తప్పేంకాదు

ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు పలు సూచనలు చేసింది. కరోనా సమయంలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను పౌరులు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడం, ఆ వేదికలపై సాయం కోరడాన్ని తప్పుడు సమాచారం అనలేమని ధర్మాసనం తెలిపింది. అలాంటి ట్వీట్లు, పోస్టులపై చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. అలా చర్యలు తీసుకుంటే దాన్ని కోర్టుధిక్కరణగా భావించాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఈ కేసు విచారణలో అమికస్‌ క్యూరీగా న్యాయవాదులు మీనాక్షి అరోరా, జైదీప్‌ గుప్తా కూడా కోర్టుకు హాజరయ్యారు. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని